SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Chandrababu: పేదల సంక్షేమం, ఆధ్యాత్మిక సేవకు సంపన్నులు ముందుకురావాలి: చంద్రబాబు

CM Chandrababu Comments In Tirumala: పేదల సంక్షేమంతోపాటు ఆధ్యాత్మిక సేవకు ధనవంతులు ముందుకురావాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. తిరుమల శ్రీవారికి రూ.206 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలు విరాళంగా ఇచ్చిన జైన్‌ దంపతులను అభినందించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 26, 2026, 18:53 IST | Updated: Nov 26, 2026, 18:56 IST
Image Credit: Chandrababu In Tirumala
Join

Vardhaman Jain Donation: డబ్బు, సంపద, హోదా ఎప్పటికీ శాశ్వతం కాదు.. ఆధ్యాత్మికత, ధర్మం, సేవా భావమే అసలైన సంతృప్తి, సంతోషాన్నిస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రపంచంలో ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నా సంపాదించిన సంపదను సద్వినియోగం చేసుకునే అదృష్టం కొందరికే దక్కుతుందని పేర్కొన్నారు. పల్లవ, చోళ, చేర, పాండ్య రాజులతోపాటు మైసూర్, మరాఠా రాజులు తిరుమల ఆలయాన్ని అభివృద్ధి చేయగా.. శ్రీకృష్ణదేవరాయలు తిరుమల స్వామివారికి రత్నకిరీటం, పీతాంబరం సహా ఎన్నో ఆభరణాలు సమర్పించారని గుర్తుచేశారు. శ్రీకృష్ణ దేవరాయల కాలం నుంచి నేటి జైన్ దంపతుల వరకు తిరుమల శ్రీవారిపై భక్తి విశ్వాసాలు పెరుగుతూనే ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు.

తిరుమల శ్రీవారికి రూ.206 కోట్ల విలువైన 121 కిలోల బంగారు, వజ్రాభరణాలను సమర్పించిన చెన్నైకు చెందిన వర్ధమాన్ జైన్, రాధికా జైన్‌ దంపతులతో కలిసి గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సేవలోనే నిజమైన ఆనందం ఉందని చెప్పారు. పేదల సంక్షేమం, ఆధ్యాత్మిక సేవకు ధనవంతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శ్రీకృష్ణదేవరాయలు నుంచి జైన్ దంపతుల వరకు భక్తి పరంపర కొనసాగుతోందని గుర్తుచేశారు.

'దేవుడిపై భక్తి ఉన్న ప్రతి ఒక్కరూ మానవ సేవే - మాధవ సేవ అనే సూత్రాన్ని గుర్తుంచుకోవాలి. సమాజ హితం కోసం పనిచేసే వారే దేవుడికి అత్యంత సన్నిహితంగా ఉంటారు. సంపన్నులు ముందుకువచ్చి పేదల సంక్షేమం, సమాజ సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సహకారం అందించాలి' అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. 'భక్తులు సమర్పించే ప్రతి రూపాయి టీటీడీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవలకు ఖర్చు చేస్తుంది. టీటీడీ సహకారంతో 5 వేల దేవాలయాల నిర్మాణం చేపట్టబోతున్నాం. దేశంలోని అన్ని రాజధానులతో పాటు విదేశాల్లో హిందువులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తాం' అని వెల్లడించారు.

'ఆలయం ఉన్న ప్రతిచోటా అన్నప్రసాదం ఏర్పాటు చేస్తాం. 'ప్రాణదానం' ద్వారా వైద్య సేవలు, 'విద్యాదానం' కింద ప్రత్యేక నిధితో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తాం. ఎల్‌నినో వంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా 'వృక్షో గోవిందం' పేరుతో పచ్చదనం పెంపు కార్యక్రమాలు చేపడతాం' అని సీఎం చంద్రబాబు వివరించారు. భవిష్యత్తులో తిరుమలకు నీటి ఎద్దడి అనే మాటే లేకుండా హంద్రీ-నీవా ద్వారా కల్యాణి డ్యామ్‌కు, సోమశిల ద్వారా బాలాజీ రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తామని ప్రకటించారు. అవసరమైతే తిరుమలకు రెండో పైపులైన్ కూడా వేస్తామని తెలిపారు. తిరుమల వేంకటేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రం, దేశం మరింత అభివృద్ధి చెందడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు.

'పూర్వ కాలంలో దేవాలయాల మీద చాలా దాడులు జరిగాయి. కానీ తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయం విషయంలో ఎవరూ ఆ సాహసానికి ఒడిగట్టలేదు. రోజురోజుకు శ్రీవారి భక్తుల విశ్వాసాన్ని పెంపొందించడానికి చాలా మంది కృషి చేశారు. కొలిచిన వారికి, నమ్మిన వారికి శ్రీవారు రక్షణగా నిలిచారు. అది నా విషయంలో నిరూపితమైంది' అని టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ప్రాణదానం కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజే తనపై అలిపిరిలో దాడి జరిగిందని.. చాలా పకడ్బందీగా దాడి జరిగినా తిరుమల వేంకటేశ్వర స్వామి కృపతో ఆ ఘటనలో ఎవరూ చనిపోలేదని వివరించారు.

తిరుమల వెంకటేశ్వర స్వామే తనకు ప్రాణభిక్ష పెట్టారని... పునర్జన్మనిచ్చారంటూ సీఎం చంద్రబాబు నాటి దుర్ఘటనను గుర్తుచేసుకున్నారు. తిరుమల కొండపై పచ్చదనం విరాజిల్లుతోందని.. దేవుడి పవిత్రత కాపాడే విషయంలో రాజీ పడవద్దని టీటీడీకి విజ్ఞప్తి చేశారు. గో-సంరక్షణ, వేద పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. శ్రీవారి దేవాలయాన్ని ఆదర్శంగా పవిత్రతకు మారుపేరుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎక్కడికక్కడ శ్రీవారి దేవాలయాలను నిర్మించాలని.. ఆ ఆలయాల్లో ప్రశాంత, పవిత్ర వాతావరణం ఉండేలా చూడాలని చెప్పారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ZEENEWS TRENDING STORIES