నాగార్జున సాగర్ పక్కనే ఉన్నా నీటి కరువు.. కాలనీ ప్రజలకు తీవ్ర కష్టాలు!
Nagarjuna Sagar Water Crisis: నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిసరాల్లో నివసించే ప్రజలకు తీవ్ర నీటి కష్టాలు తప్పడం లేదు.. తాగు నీరు లేక జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచినీటిని సరఫరా చేసే మోటర్స్ పాడవ్వడంతో వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు..
Nagarjuna Sagar Water Crisis Telugu: ఆసియాలోనే అతిపెద్ద జలాశయాల్లో ఒకటైన... నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు గుక్కెడు తాగునీటి కోసం తిప్పలు తప్పడం లేదు.. నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని పైలాన్ కాలనీలో గత కొద్ది రోజులుగా తాగునీటి సమస్యలు విపరీతం కావడంతో స్థానిక ప్రజలతో పాటు మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీరు కూడా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు.
కాలనీకి నిరంతరం మంచినీటిని సరఫరా చేయాల్సిన పంపింగ్ కేంద్రంలోని విద్యుత్ మోటార్లు మరమ్మతులు జరగడంతో.. సరఫరా వ్యవస్థ పూర్తిగా ఆగిపోయింది.. దీనికి తాత్కాలిక ప్రత్యామ్నాయంగా మున్సిపాలిటీ యంత్రాంగం ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ.. ఆ నీరు కాలనీవాసుల కనీస అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేకుండా పోయింది.. జనాభాకు తగిన సంఖ్యలో ట్యాంకర్లను కేటాయించకపోవడంతో పరిసరాల్లో నీటి కోసం పడిగాపులు తప్పడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపల్ ట్యాంకర్ ఎప్పుడు వస్తుందో? తెలియక గంటల తరబడి ఖాళీ బిందెలతో పాటు డ్రమ్ములతో రోడ్లపై వేచి చూడాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. పైగా రోడ్డుపై ఆగిన ట్యాంకర్ల నుంచి పెద్ద పెద్ద డ్రమ్ముల్లోకి నీళ్లు నింపుకొని.. మోసుకుంటూ ఇళ్లకు చేర్చడం తమకు నరకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులతో పాటు అనారోగ్యంతో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఎన్నికల సమయంలో ఓట్ల కోసం కాళ్లరిగేలా తిరిగే నాయకులు.. తీరా అధికారంలోకి వచ్చాక.. ప్రజలు మౌలిక వసతుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న.. కన్నెత్తి చూడకపోవడం దారుణమని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ జలాశయం కళ్ల ముందే కనిపిస్తున్నా.. పైపుల్లో నీరు రాకపోవడం అధికారుల పనితీరుకు నిదర్శనమని మండిపడుతున్నారు.