Indiramma Towers: ఇందిరమ్మ టవర్స్, డబుల్ బెడ్రూమ్‌పై తెలంగాణ మంత్రి బిగ్ అప్‌డేట్
Telangana Minister Big Update On Indiramma Towers: హైదరాబాద్‌లో గూడు లేని ప్రజలకు నిర్మించి ఇచ్చే ఇందిరమ్మ టవర్స్, డబుల్ బెడ్రూమ్‌పై తెలంగాణ మంత్రి కీలక ప్రకటన చేశారు. మూడు విడతల్లో నిర్మాణాలు చేపట్టి ప్రజలకు ఇస్తామని ప్రకటించారు. మంత్రి చేసిన ప్రకటన వివరాలు ఇలా ఉన్నాయి.
Hyderabad Indiramma Towers: పేదలు నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణమే లక్ష్యమని.. మూడు విడతల్లో నిర్మాణాలు చేపడతామని ప్రకటించారు. ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి యుద్ధప్రాతిపదికన స్థలాలను గుర్తించాలని అధికారులకు ఆదేశించారు. ఈ నెలాఖరులోగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. మొదటి విడత నిర్మాణాలకు అవసరమైన స్థలాల గుర్తింపును పూర్తిచేయడంతోపాటు రెండో, మూడో విడతల్లో చేపట్టనున్న నిర్మాణాలకు కూడా ముందుగానే భూములను సిద్ధం చేయాలని కలెక్టర్లకు సూచించారు.
హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, హౌసింగ్ శాఖ అధికారులతో శుక్రవారం మంత్రి సమీక్ష చేశారు. హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం, రెండు మూడో విడతలకు అవసరమైన భూముల గుర్తింపు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై కలెక్టర్లు, అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పేదల జీవనోపాధికి ఇబ్బందులు కలగకుండా వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇళ్లు నిర్మించి అందించాలనే సంకల్పంతో ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు.. టవర్స్ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్లు చెప్పారు. పేదవాడికి సొంత ఇంటిని అందించడం కంటే తమ ప్రభుత్వానికి మరే అంశం ప్రాధాన్యం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పూర్తి బాధ్యతతో.. సమన్వయంతో పనిచేయాలని సూచించారు. స్థలాల ఎంపికలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి ఆదేశించారు.
మొత్తం లక్ష ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని.. తొలి విడతలో ప్రతి నియోజకవర్గంలో సుమారు 500 ఇళ్ల చొప్పున నిర్మాణాలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి భూముల లభ్యత, స్థలాల అనుకూలత, ఇతర అవసరమైన అంశాలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. మొదటి విడతతో పాటు తదుపరి విడతల నిర్మాణాలకు కూడా ముందస్తు ప్రణాళికతో పనిచేయడం ద్వారా కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని మంత్రి అధికార యంత్రాంగానికి ఆదేశించారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా చేయాలని చెప్పారు. హౌసింగ్ కార్పొరేషన్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి లబ్ధిదారుల ఎంపిక కోసం డ్రా చేయాలని సూచించారు. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లోనూ ఇదే విధానాన్ని అనుసరించాలని ఆదేశించారు. డ్రా ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేసేలా ఏర్పాట్లు చేయాలని, ప్రత్యక్షంగా వీక్షించలేని వారు కూడా డ్రాకు సంబంధించిన వివరాలను యూట్యూబ్‌లో లబ్ధిదారులు తమ వివరాలు ఎంపిక జాబితాలో ఉన్నాయో లేదో ఎప్పుడైనా పరిశీలించుకునే అవకాశం ఉంటుందని మంత్రి వివరించారు.