Zee Telugu news Teachers Awards: హైదరాబాద్ బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన జీ తెలుగు న్యూస్ టీచర్స్ అవార్డ్స్ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాఠశాల విద్యా వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లు.. పరిష్కారాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ టీఎస్ ఉపాధ్యాయ సంఘం నేతలతోపాటు ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యా వ్యవస్థలోని లోపాలను, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను నిర్భయంగా, నిర్మోహమాటంగా.. ఉన్నది ఉన్నట్లుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. క్షేత్రస్థాయిలో పాఠశాలలు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను వివరిస్తూ ప్రస్తుత ప్రభుత్వ విద్యా విధానాలు.. నిబంధనలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పాఠశాలల్లో నెలకొన్న క్షేత్రస్థాయి పరిస్థితులను ఉన్నది ఉన్నట్లుగా ఎత్తిచూపుతూ, ప్రస్తుత విద్యా నిబంధనలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
జీ తెలుగు లైవ్ వేదికగా ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి పలు కీలక ప్రశ్నలను సంధించారు. పాఠశాలల్లో 60 మంది విద్యార్థులకు కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉంటే బోధన నాణ్యతగా ఎలా సాగుతుందో ఈ ప్రభుత్వమే స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ప్రాథమిక పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న ఐదు విభిన్న తరగతులకు కేవలం ఇద్దరు ఉపాధ్యాయులే సమర్థవంతంగా ఎలా బోధించగలరో ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. విద్యా ప్రమాణాలు పెంచాలని చెబుతూనే, క్షేత్రస్థాయిలో సరైన సిబ్బందిని కేటాయించకపోవడం వల్ల ఉపాధ్యాయులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల మనుగడను కాపాడుకోవాలంటే తక్షణమే ఉపాధ్యాయుల కొరతను తీర్చాలని, జీఓ 25 వంటి నిబంధనలను సవరించి ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని పీఆర్‌టీయూ-టీఎస్ తరఫున శ్రీపాల్ రెడ్డి గళమెత్తారు. విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న ఈ ప్రధాన సవాళ్లను పరిష్కరించకుండా నాణ్యమైన విద్య అందించడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.