Venkaiah Naidu Book Launch: మనిషి తనను తాను సరిదిద్దుకోవటమే గొప్ప సంస్కరణ: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
Venkaiah Naidu Book Launch Today: హైదరాబాద్‌లో జరిగిన 14వ దలైలామా జీవిత చరిత్ర 'మన కాలం బుద్ధుడు' తెలుగు అనువాద పుస్తకావిష్కరణ కార్యక్రమంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు వర్చువల్‌గా ప్రసంగించారు. ప్రతిరోజూ ఆత్మపరిశీలన చేసుకుంటూ మనిషి తనను తాను సరిదిద్దుకోవడమే అత్యుత్తమ సంస్కరణ అని ఆయన పిలుపునిచ్చారు. దలైలామా ప్రదర్శించిన కరుణ, అహింస, సహనం వంటి విలువల ప్రాధాన్యాన్ని వివరిస్తూ, యువత కోపం, అసూయలను వీడి సమాజ పురోగతికి బాధ్యతగా కృషి చేయాలని సూచించారు.
Venkaiah Naidu Book Launch Today: హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీ (MCHRD) ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో జర్నలిస్టు డాక్టర్ అరవింద్ యాదవ్ రచించిన 14వ దలైలామా జీవిత చరిత్ర 'మన కాలం బుద్ధుడు' (తెలుగు అనువాదం: సీనియర్ జర్నలిస్టు మెరుగుమాల నాంచారయ్య) పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సభలో ముఖ్యఅతిథిగా వర్చువల్‌గా ప్రసంగించిన భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు, ప్రతిరోజూ నిద్రపోయేముందు ప్రశాంతంగా కూర్చొని ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.
రోజూ తాను మాట్లాడిన మాటలు, చేసిన పనులు సరైనవేనా అని ప్రశ్నించుకోవడం ద్వారా తప్పులను దిద్దుకుని ఆలోచనల్లోనూ, నిర్ణయాల్లోనూ పరిపక్వత సాధించవచ్చని వెంకయ్య నాయుడు అన్నారు. వ్యక్తుల్లో వచ్చే ఈ ఆత్మపరిశీలన మార్పు వల్ల కుటుంబాల్లో కలహాలు, సమాజంలో విద్వేషాలు తగ్గి శాంతి నెలకొంటుందని, శాంతి ఉన్నచోటే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
దలైలామా జీవన మార్గం - మానవీయ విలువలు
దలైలామా కేవలం బౌద్ధ ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదని, కరుణ, సహనం, అహింస, శాంతి, మానవీయ విలువలకు ప్రతిరూపమని వెంకయ్య నాయుడు కొనియాడారు. అనివార్య పరిస్థితుల్లో మాతృభూమి టిబెట్‌కు దూరమై భారతదేశంలో ప్రవాస జీవితం గడుపుతున్నప్పటికీ, ఎదురైన కష్టాలను ద్వేషంగా మార్చుకోకుండా టిబెట్ సంస్కృతి, భాష, సంప్రదాయాల పరిరక్షణకు ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
బుద్ధుడు జన్మించిన లుంబినీ నుంచి జ్ఞానోదయం పొందిన బోధ్‌గయ, తొలి ధర్మోపదేశం చేసిన సారనాథ్, మహాపరినిర్వాణం పొందిన కుశీనగర్ వరకు ఉన్న ప్రాంతాలు భారత ఆధ్యాత్మిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని చెప్పారు. బౌద్ధ ధర్మానికి, భారతీయ సనాతన ధర్మ సంప్రదాయానికి మధ్య అహింస, కరుణ, సత్యాన్వేషణ విషయాల్లో లోతైన సారూప్యతలు ఉన్నాయని వివరించారు.
యువతకు మార్గదర్శనం
ప్రస్తుత ప్రపంచంలో ఒకవైపు యుద్ధాలు, మరోవైపు ఉగ్రవాదం, అసహనం ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో విజ్ఞానంతో పాటు వివేకం, అధికారంతో పాటు బాధ్యత, సంపదతో పాటు దాతృత్వం మనిషికి అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు.
యువత కోపాన్ని, అసూయను విడిచిపెట్టి, కష్టపడి పనిచేస్తూ, తల్లిదండ్రులను, గురువులను గౌరవిస్తూ సామాజిక బాధ్యతతో మెలగాలని పిలుపునిచ్చారు. మనిషి సమాజంలో ఎంత ఎత్తుకు ఎదిగాడన్నది కాకుండా, ఎదిగే క్రమంలో ఎంతమందికి సహాయపడ్డాడన్నదే నిజమైన విజయానికి కొలమానమని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో మహాబోధి బుద్ధ విహార భిక్షువు బుద్ధ పాల, టిబెటన్ పండితులు ప్రొఫెసర్ గేషే నవాంగ్ సామ్తెన్, సీనియర్ జర్నలిస్టు ఆర్. దిలీప్ రెడ్డి, అజు పబ్లికేషన్స్ ప్రచురణకర్త ఎర్రం శ్వేత, కార్టూనిస్ట్ షేక్ సుభాని, సీనియర్ జర్నలిస్టు స్వప్న తదితరులు పాల్గొన్నారు.