SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Chandrababu: మురసు తుఫానుపై సీఎం చంద్రబాబు అప్రమత్తం.. అధికారులకు కీలక ఆదేశాలు

AP CM Chandrababu High Alert On Cyclone Murasu: మరో తుఫాను ముంచుకొస్తుండడంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పూర్తి అప్రమత్తం ప్రకటించింది. అర్నాబ్‌ తుఫాను కన్నా మురసు తుఫాను ప్రభావం తక్కువగా ఉన్నా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తుఫానుపై అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 02, 2026, 10:26 PM IST | Updated: Nov 02, 2026, 10:30 PM IST
Image Credit: Source: AP CMO
Join

Chandrababu Review: అర్నాబ్‌ తుఫాను మిగిల్చిన నష్టం నుంచి ఇంకా కోలుకోకముందే మరో తుఫాను పొంచి ఉండడంతో సీఎం చంద్రబాబు అప్రమత్తమయ్యారు. తుఫానుపై ఏపీ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడమే కాకుండా తుఫానుపై నష్ట నివారణ చర్యలు సూచించారు. అర్నబ్‌తో పోలిస్తే మురసు తుఫాను తక్కువ తీవ్రత ఉందని.. అయినా కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలకు అవకాశం ఉందని.. 50 టీఎంసీల మేర వరద ప్రవాహాలు వస్తాయని సీఎం చంద్రబాబు అంచనా వేశారు.

అమరావతిలోని సచివాలయంలో ఉన్న ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తుఫానుపై అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. మురసు తుఫాను ప్రభావం తక్కువగానే ఉండే అవకాశం ఉందని.. అర్నబ్ తుఫానుతో పోలిస్తే గాలులు, వర్ష తీవ్రత కూడా తక్కువగానే ఉన్నట్టు అంచనాలు ఉన్నాయని వెల్లడించారు. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

తుపాను ప్రభావంతో వచ్చే వర్షాలను సమర్థంగా వినియోగించుకుని చెరువులు, రిజర్వాయర్‌లను నింపాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని.. అర్నబ్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే చాలా వరకు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. మురసు తుఫాను ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కోవాలని స్పష్టం చేశారు. మురసు తుఫాను గాలుల ప్రభావం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని సుమారు 8 వేల విద్యుత్ స్తంభాలపై పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

మురసు తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. పల్నాడు జిల్లాలో 30 సెంటీమీటర్లు, ప్రకాశంలో 24, మార్కాపురంలో 19, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 9 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో డ్రెయిన్లను ముందుగానే శుభ్రం చేయాలని.. వాగులు, వంకలు పొంగి ప్రవహించే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో 30 టీఎంసీల నుంచి 50 టీఎంసీల వరకు నీటి ప్రవాహాలు రావచ్చని అధికారులు అంచనా వేశారు. పులిచింతలలో 18 టీఎంసీల మేర ఫ్లడ్‌ కుషన్‌ అందుబాటులో ఉందని.. నాగార్జునసాగర్‌కు కూడా భారీగా ప్రవాహాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమ బేసిన్‌లోని జలాశయాల్లో నీటిని నిల్వ చేసుకునేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. మార్కాపురంలోని కంభం చెరువుతో పాటు ఆయా జిల్లాల్లోని మీడియం, మైనర్ ఇరిగేషన్‌ ట్యాంకులు పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

మురసు తుఫాను ప్రభావం ఉన్న 6 జిల్లాల పరిధిలోని 6,800 చెరువుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సాగునీటి సంఘాలను క్రియాశీలం చేసి ప్రజల భాగస్వామ్యంతో చెరువుల పరిస్థితిని పర్యవేక్షించాలని చెప్పారు. జలధార కార్యక్రమం కింద చేపట్టిన పనులను వినియోగించుకోవాలని, ఎక్కడా చెరువులకు గండ్లు పడకుండా చూడాలని స్పష్టం చేశారు. డ్రెయిన్లలో పూడిక కారణంగా పంటలు ముంపునకు గురికాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అవసరమైన నిత్యావసర వస్తువులను సిద్ధంగా ఉంచాలని సూచించారు. రైల్వే మార్గాలు, జాతీయ రహదారుల వద్ద లోతట్టు ప్రాంతాల్లో వరద ముప్పు ఉంటే రాకపోకలను నియంత్రించాలని, మత్స్యకారుల బోట్లు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు తెలిపారు. వర్షాలు, గాలులు, వరద ప్రవాహాలపై నిరంతరం పర్యవేక్షించాలని, సమాచార వ్యవస్థకు అంతరాయం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES