SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

AP Elections: ఏపీలో కొనసాగుతున్న 'స్థానిక' సమరం.. రణరంగంగా మారిన పరిస్థితులు

YSRCP Candidate Kidnap In Nandigama And Leaders House Arrest: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. మున్సిపల్‌, పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల పరిస్థితి రణరంగాన్ని తలపించింది. ఎక్కడికక్కడ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 22, 2026, 03:02 PM IST | Updated: Oct 22, 2026, 03:04 PM IST
Image Credit: AP Local Body Elections
Join

YSRCP Leaders House Arrest: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌తోపాటు ఇతర ఎన్నికలు కొనసాగుతుండడంతో రాజకీయం హాట్‌హాట్‌గా కొనసాగుతోంది. గెలుపు లక్ష్యంగా అధికార తెలుగుదేశం పార్టీ కుయుక్తులు పన్నుతుండగా.. వాటిని తిప్పికొట్టేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. రణరంగాన్ని తలపించేలా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటుచేసుకుంటున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నందిగామలో అభ్యర్థి కిడ్నాప్
నందిగామ పట్టణంలోని 8వ వార్డుకు చెందిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మహిళా కౌన్సిలర్ అభ్యర్థి యర్రబడి అంజలి 8 వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసినప్పటి నుంచి కూటమి నాయకులు విత్ డ్రా చేసుకోవాలని పలుమార్లు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆమెను కిడ్నాప్ చేసి టీడీపీ నాయకులు బలవంతంగా నామినేషన్ సెంటర్ వద్దకు తీసుకువచ్చి నామినేషన్‌ను ఉపసంహరించుకునేలా చేయడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సమాచారం తెలుసుకున్న ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ నామినేషన్ సెంటర్ వద్ద చేరుకొని జరిగిన విషయంపై అధికారులను నిలదీశారు. దీంతో నామినేషన్ సెంటర్ వద్ద టీడీపీ నాయకులు గందరగోళ వాతావరణాన్ని సృష్టించి వైఎస్సార్‌సీపీ నాయకులను నామినేషన్ సెంటర్ నుంచి బయటికి పంపించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులకు దారితీశాయి. ఓటమి భయంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను కిడ్నాప్ చేసి బలవంతంగా ఉపసంహరించుకునేలా చేయించడం సరికాదని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ తెలిపారు. ఎన్నికల నామినేషన్ కేంద్రంలో ఉన్న సీసీ ఫుటేజ్‌ని బహిర్గతం చేసి న్యాయ విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు.

ఈసీ ఆఫీస్‌ ఎదుట ధర్నా
విజ‌య‌వాడ‌లోని రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ కార్యాల‌యం వ‌ద్ద వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ధ‌ర్నా చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసేందుకు వస్తే అపాయింట్‌మెంట్ ఇవ్వక‌పోవ‌డం దారుణం అని.. ముగ్గురు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తే కనీస గౌరవం ఇవ్వకపోవడం ఏమిటి? అని వైఎస్సార్‌సీపీ నాయకులు ప్రశ్నించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లలో అక్రమాలు.. వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులపై దాడులు, గృహ నిర్బంధాలు జ‌రుగుతుంటే ఎస్ఈసీకి ఏమీ ప‌ట్ట‌డం లేదని ఆరోపించారు.

'అభ్యర్థులపై దాడులు.. తలలు పగలగొట్టి పోలీస్‌స్టేషన్లకు తరలిస్తున్నా..ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు. సుప్రీంకోర్టు ఆదేశాలున్నా ఎన్నికల సంఘం ఎందుకు స్పందించడం లేదు? నిన్న ఆధారాలతో ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం.. నేడు మళ్లీ అదే పరిస్థితి' అని వైఎస్సార్‌సీపీ నాయకులు తెలిపారు. ఎన్నికల కమిషనర్‌ను కలవనివ్వకుండా జాయింట్ డైరెక్టర్‌ను కలవాలని చెప్పడంపై నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రేపటితో నామినేషన్ల గడువు ముగుస్తుంది.. అభ్యర్థులకు న్యాయం చేయడంలో జాప్యం ఎందుకు? నఅఇ ప్రశ్నించారు. తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు. దాడులకు సంబంధించిన వీడియో ఫుటేజ్‌, ఆధారాలను ఎస్ఈసీకి అందజేస్తామని.. ఎన్నికల సంఘం తనకున్న ప్రత్యేక అధికారాలను వినియోగించి తక్షణ చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలని.. ప్రతి అభ్యర్థికీ నామినేషన్ అవకాశం కల్పించాలని కోరారు.

నాయకుల గృహ నిర్బంధం
==> పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో మాచర్లలో మాజీ మంత్రి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆయన ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు ఇంట్లోనే ఉంచారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నివాసం చుట్టూ ఇనుప కంచెలు, బారికేడ్లను పోలీసులు ఏర్పాటుచేశారు. ఆయనను కలిసేందుకు వస్తున్న అనుచరులు, పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. పిన్నెల్లిని కలిసేందుకు వస్తే అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే పోలీసులు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

==> నామినేషన్ల వేళ తునిలో ఉత్కంఠ నెలకొంది. మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజాను పోలీసులు ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. ఆయనను ఎటు కదలనీయకుండా ఇంట్లోనే ఉంచారు.

==> ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైఎస్సార్‌సీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఎన్నికల సమయంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. పోలీసుల చర్యలపై వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి.

==> తిరుపతిలో నామినేషన్ కేంద్రాల వద్ద ముళ్ల కంచెల ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో పోలీసుల అప్రమత్తమయ్యారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఇనుప ముళ్ల కంచెలతో భద్రత ఏర్పాటుచేసి.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల ముందస్తు చర్యలు తీసుకున్నారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు కల్పిస్తున్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద అనుమతి ఉన్నవారికే ప్రవేశం కల్పించేలా చర్యలు తీసుకున్నారు.

Add Zee News as a Preferred Source

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES