Vijayasai Reddy: టీటీడీలో రాజకీయ నాయకులకు స్థానం లేకుండా చేస్తా: విజయసాయి రెడ్డి
Vijayasai Reddy Sensational Comments On Tirumala Laddu Ghee Row: కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తీవ్ర దుమారం రేపిన తిరుమల లడ్డూ వివాదంపై స్పందిస్తూ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. తన పార్టీ స్వతంత్రంగా ఉంటుందని.. ఎవరికీ బీ టీమ్‌గా పనిచేయదని స్పష్టం చేశారు.
Tirumala Laddu Ghee Row: త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్లు రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఇప్పటికే మూడు నగరాల్లో పార్టీకి సంబంధించిన 15 అంశాలను ప్రకటించామని.. తిరుపతిలో మరో ఐదు అంశాలను వెల్లడించామని తెలిపారు. మొత్తం 20 అంశాలతో పార్టీ మ్యానిఫెస్టో రూపొందిస్తామని చెప్పారు. అన్ని కులాలు.. అన్ని మతాలను కలుపుకుని ముందుకు వెళ్లే రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తామని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.
తిరుపతిలో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై స్పందిస్తూ ప్రధాన రాజకీయ పార్టీలపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండూ ప్రజల నమ్మకాన్ని కోల్పోయాయని.. తమ పార్టీ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుందని ప్రకటించారు. కడపలో దళితులను ఆలయం లోపలికి కూడా రానివ్వడం లేదని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే దళితులపై వివక్ష చూపేవారిని కఠినంగా శిక్షిస్తామని.. జైలుకు పంపుతామని వెల్లడించారు. కొత్త పార్టీతో అన్ని మతాలు, కులాలతో కలిసి రాజకీయం చేస్తామని.. ప్రత్యామ్నాయ పార్టీగా నిలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంపై స్పందించిన విజయసాయి రెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు. తిరుమలకు తక్కువ ధరకు నెయ్యి ఎలా సరఫరా అవుతుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కులం, మతాన్ని రాజకీయాలకు ఉపయోగించకూడదని ఇతర రాజకీయ పార్టీలకు సూచించారు. రాయలసీమకు భారీ రిజర్వాయర్లు నిర్మించి నీటిని అందిస్తామని తెలిపిన ఆయన.. నీరు లేకుండా రాయలసీమను నందనవనంగా ఎలా మారుస్తారని ప్రశ్నించారు.
టీటీడీ బోర్డుపై
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుపై స్పందించిన విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ బోర్డులో రాజకీయ నాయకులకు స్థానం లేకుండా చేస్తామని విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన చేశారు. మఠాధిపతులు, పీఠాధిపతులకు మాత్రమే బోర్డులో అవకాశం కల్పిస్తామని తెలిపారు. తిరుమల కొండల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని, తిరుమల–తిరుపతి భద్రతను మరింత పటిష్టం చేస్తామని చెప్పారు. తిరుపతిలో మద్యపానాన్ని నిషేధిస్తామని ప్రకటించారు.
'దేశవ్యాప్తంగా వెంకటేశ్వర స్కూల్స్ ఏర్పాటు చేస్తాం. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడిటేషన్లు, రక్షణ చట్టం, ఉచిత వైద్య సేవలు అందిస్తాం' అని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. తాను ఏ పార్టీకి బీ-టీమ్ కాదని.. ఏ పార్టీలో చేరకుండా స్వతంత్ర రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
లడ్డూ జంతు పదార్థాలు లేవు
లడ్డూ తయారీలో ఎలాంటి జంతువు సంబంధమైన కొవ్వు పదార్థాలు లేవని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కిలో నెయ్యి రూ.320 నుంచి రూ.400 కే కొనుగోలు చేసిందని.. ప్రస్తుత ప్రభుత్వం కిలో రూ.658లకు కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. స్వచ్ఛమైన నెయ్యి ధర కిలోకి వెయ్యి రూపాయలకు పైగానే పలుకుతుండగా.. మరి వీరు వాడుతున్నది స్వచ్ఛమైన నెయ్యి ఎలా అవుతుందని కూటమి ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి నిలదీశారు.