Tirumala Devotees Insurance: టీటీడీ, ఎల్ఐసీ కీలక ప్రకటన.. తిరుమల వెళ్లే భక్తులకు రూ.10 లక్షల ఫ్రీ ఇన్సురెన్స్!
Rs 10 Lakhs Free Insurance Scheme To Tirumala Devotees: తిరుమల వెళ్లే భక్తులకు ఎన్నో సదుపాయాలు దక్కుతుండగా.. ఇప్పుడు మరో సదుపాయం అందుబాటులోకి వచ్చింది. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల కుటుంబాలకు భరోసా కల్పించేలా ఉచిత బీమా పథకం ప్రకటించారు. దీనిపై టీటీడీ, ఎల్ఐసీ కీలక ప్రకటన చేసింది.
Tirumala Free Insurance Scheme: గండాలు గట్టెక్కించే దేవాదిదేవుడు కలియుగ వైకుంఠవాసుడు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులకు భారీ శుభవార్త. తిరుమల సందర్శనకు వచ్చే భక్తుల కుటుంబాలకు భరోసా కల్పించేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు ఉచిత బీమా పథకం అమలుపై కీలక ప్రకటన చేసింది. ఎల్ఐసీతో కలిసి భక్తులకు రూ.10 లక్షల బీమా పథకాన్ని ప్రారంభించింది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల భద్రతకు టీటీడీ ప్రత్యేక చర్యలు చేపడుతుండగా.. అందులో ఈ పథకం కీలక మైలురాయిగా చెప్పవచ్చు.
భక్తులకు ఉచిత జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించేందుకు టీటీడీ, ఎల్ఐసీ సంయుక్తంగా చేపట్టిన బీమా పథకంపై టీటీడీ ఈవో, స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ ముద్దాడ రవిచంద్ర, ఎల్ఐసీ సీఈఓ కమ్ ఎండీ ఆర్. దురై స్వామి కీలక విషయాలు వెల్లడించారు. సెప్టెంబర్ 9వన టీటీడీ, ఎల్ఐసీ సంయుక్తంగా భక్తులకు ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించామని.. ఈ బీమా పథకాన్ని భక్తులకు ఉచితంగా అందిస్తున్నట్లు ఎల్ఐసీ సీఈఓ ఆర్.దురై స్వామి తెలిపారు.
తిరుమల యాత్రలో ప్రమాదవశాత్తు మరణించిన భక్తుడి బాధిత కుటుంబానికి రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా రక్షణ కల్పిస్తున్నట్లు దురై స్వామి తెలిపారు. దర్శనానికి ముందు రోజు, దర్శనం రోజు, మరుసటి రోజు, తిరుగు ప్రయాణంలోనూ బీమా రక్షణ వర్తిస్తుందని వివరించారు. ఇప్పటివరకు మొత్తం 17 బీమా క్లెయిమ్స్ నమోదయ్యాయని.. వీటిలో 7 క్లెయిమ్స్ పరిష్కరించగా.. మిగిలినవి ప్రక్రియలో ఉన్నాయని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర వెల్లడించారు.
ప్రతిరోజూ మారుతున్న భక్తుల వివరాలను రియల్ టైమ్‌లో నమోదు చేయడం తమకు ప్రధాన సవాలుగా మారిందని టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మన్ ముద్దాడ రవిచంద్ర చెప్పారు. తిరుమల దర్శనానికి రిజిస్టర్ చేసుకున్న భక్తులు ఏ కారణంతోనైనా మరణిస్తే వారి నామినీకి రూ.2 లక్షల ఉచిత జీవిత బీమా పరిహారం అందిస్తున్నట్లు ఎల్ఐసీ సీఈఓ దురై స్వామి తెలిపారు. ఇప్పటివరకు 17 మంది మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున నామినీ బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశామని.. భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలోనే నామినీ వివరాలను సేకరిస్తున్నట్లు వెల్లడించారు.
మరణ ధ్రువీకరణ పత్రం, నామినీ బ్యాంకు వివరాలు సమర్పిస్తే బీమా క్లెయిమ్ పరిష్కరిస్తామని ఎల్ఐసీ సీఈఓ దురై స్వామి తెలిపారు. భక్తులకు ఉచిత జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్న తొలి దేవాలయ సంస్థగా టీటీడీ నిలిచిందని ప్రకటించారు. టీటీడీలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకు ఇప్పటికే కోటి రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించామని గుర్తుచేశారు. ఇక తిరుమలలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి త్వరలో రూ.25 లక్షల బీమా కల్పించే యోచనలో ఉన్నామని ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. ప్రమాద బీమాతో పాటు తిరుమలకు వచ్చే భక్తుల ముందస్తు ఆరోగ్య భద్రతపై కూడా టీటీడీ ప్రత్యేక దృష్టి సారిస్తోందని చెప్పారు. తిరుమలలో భక్తుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ప్రమాద బీమా, ఉచిత జీవిత బీమా పథకాల ద్వారా భక్తులకు అండగా నిలుస్తున్నామని టీటీడీ, ఎల్ఐసీ అధికారులు స్పష్టం చేశారు.