Tirumala Vaikuntha Ekadashi 2026: తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి జరగనుంది. ధనుర్మాసంలో అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతుంటాయి. వైకుంఠ ద్వారం నుంచి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేందుకు లక్షలాది భక్తులు ఎదురుచూస్తుంటారు. అతి ప్రధానమైన వైకుంఠ ఏకాదశి దర్శనాలకు సంబంధించి టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఈ దర్శనాలకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
తిరుమలలోని పద్మావతి అతిథి గృహం సుధర్మ సమావేశ మందిరంలో గురువారం వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై సమీక్ష సమావేశం అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ నిర్వహించారు. డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి ప్రకటించారు. పది రోజుల వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాల తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నట్లు అదనపు సీఓ వెంకయ్య చౌదరి తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాలను ప్రణాళికాబద్ధంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత అత్యధిక మంది సాధారణ భక్తులకు ఉత్తర ద్వార దర్శనాలు కల్పించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు గత వైకుంఠ ద్వార దర్శనాల్లో చేసినట్టుగానే తొలి మూడు రోజులకు ఆన్‌లైన్‌లో ఈ-డిప్ ద్వారా ఎస్ఎస్డీ టోకెన్లు కేటాయిస్తామని వెల్లడించారు.
ఈ డిప్‌లో పొందిన టికెట్ పొందిన భక్తుల దర్శనాలు పూర్తయిన తర్వాత ఏడు రోజులు సర్వదర్శనం అమలు చేయాలని నిర్ణయించినట్లు అదనపు సీఓ వెంకయ్య చౌదరి తెలిపారు. డిసెంబర్ 25వ తేదీ శుక్రవారం రోజున స్వామివారి అభిషేక సేవ సమయంలో కూడా సర్వ దర్శనం భక్తులకు దర్శనాలు కూడా కల్పిస్తామని చెప్పారు. వైకుంఠ ఏకాదశికి పగడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేపడతామని.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక తిరుమలలో పార్కింగ్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వైకుంఠ ఏకాదశి చివరి ఏడు రోజుల్లో భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉండటంతో ఆ రద్దీకి తగ్గట్టు ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు అదనపు సీఓ వెంకయ్య చౌదరి వెల్లడించారు.