SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

AP Secretariat Employees: సచివాలయ ఉద్యోగుల డిమాండ్స్‌ ఇవే.. సీఎం చంద్రబాబుకు విజయసాయి రెడ్డి బహిరంగ లేఖ

AP Secretariat Employees Demands: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి బహిరంగ లేఖ రాశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని.. వారి డిమాండ్లను లేఖలో ప్రస్తావించారు. వివరాలు ఇలా..

Written By Ashok Krindinti
Published: Sep 29, 2026, 12:52 PM IST | Updated: Sep 29, 2026, 12:58 PM IST
Image Credit: AP Secretariat Employees (Source: File)
Join

AP Secretariat Employees Demands: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని మాజీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగుల తరపున బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న దాదాపు 1.3 లక్షల మంది సచివాలయ ఉద్యోగులను కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో వీరంతా నియమితులయ్యారనే కారణంతోనే ప్రస్తుత ప్రభుత్వం వారి సంక్షేమాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఉద్యోగులను "సెకండ్ క్లాస్ సిటిజన్లు"గా చూడటం సరికాదని.. ఇది భవిష్యత్తులో ఉద్యోగ నియామకాల వ్యవస్థకే ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. సచివాలయాల పేర్లు మార్చిన ప్రభుత్వం, ఆ ఉద్యోగుల హక్కులను కాపాడటంలో మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆయన మండిపడ్డారు.   

ప్రధాన సమస్యలు – డిమాండ్లు ఇవే..

నోషనల్ ఇంక్రిమెంట్లు: సర్వీస్ రెగ్యులరైజేషన్ తర్వాత ఇవ్వాల్సిన రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇప్పటివరకు మంజూరు కాకపోవడంతో ఒక్కో ఉద్యోగి దాదాపు రూ.5 లక్షల వరకు నష్టపోయారు.

పే స్కేల్ బకాయిలు: రెండేళ్లకే రెగ్యులరైజ్ చేయాల్సి ఉండగా.. గత ప్రభుత్వం అదనంగా మరో 9 నెలల పాటు సేవలు చేయిచుకుంది. ఆ 9 నెలల కాలానికి సంబంధించిన పే స్కేల్ ప్రయోజనాలు చెల్లించలేదు.

రివైజ్డ్ పే స్కేల్: రెగ్యులరైజేషన్ అనంతరం వర్తింపజేయాల్సిన రివైజ్డ్ పే స్కేల్ అమలుకు నోచుకోలేదు. దీనివల్ల పీఆర్‌సీ, డీఏ, వార్షిక ఇంక్రిమెంట్లు కోల్పోయి నెలకు రూ.35 వేలకు పైగా రావాల్సిన జీతం కాస్తా రూ.23,500 వద్దే ఆగిపోయింది.

కేబినెట్ సబ్‌కమిటీ: ఉద్యోగుల సమస్యల అధ్యయనానికి 10 మంది మంత్రులతో కూడిన కేబినెట్ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసినా.. ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.

పదోన్నతుల ఆలస్యం: ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్, ఆర్టికల్ 309 ప్రకారం.. అర్హత కలిగిన ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.

నిబంధనల అమలులో వివక్ష: సర్వీస్ రూల్స్‌లోని క్రమశిక్షణ చర్యలను వేగంగా అమలు చేస్తున్న ప్రభుత్వం.. ప్రమోషన్లు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తోంది. కారుణ్య నియామకాలు వర్తింపజేయడం లేదని.. రాష్ట్రవ్యాప్తంగా సస్పెండైన 200 మందికి పైగా ఉద్యోగుల్లో పలువురికి ఇప్పటికీ పోస్టింగులు ఇవ్వలేదు.

అదనపు బాధ్యతలు: తమ శాఖ పనులతో పాటు ఇతర శాఖల విధులను నిర్వహిస్తున్నా.. ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సర్వీస్ ప్రయోజనాలు కల్పించడం లేదు.

జీవో నంబర్ 7లో అస్పష్టత: ఉద్యోగుల నిరసనల నేపథ్యంలో ప్రకటించిన జీవో నంబర్ 7లో స్పెషల్ ఇంక్రిమెంట్ అమలు తేదీ, గత ప్రయోజనాలపై స్పష్టత లేదు.

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య నిత్యం వారధులుగా పనిచేస్తున్న గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు కోరుతున్నవి గొంతెమ్మ కోరికలు కావని.. ఏ ప్రభుత్వమైనా కనీసంగా నెరవేర్చాల్సిన బాధ్యతలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగులను విభజించకుండా తక్షణమే వారి సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES