Tejaswini Visakhapatnam Mayor: విశాఖపట్నం మేయర్ టికెట్ రేసులో బాలకృష్ణ కుమార్తె..టీడీపీ నుంచి ఖాయమేనా?
Nandamuri Tejaswini Visakhapatnam Mayor: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ పీఠం 'జనరల్ మహిళ'కు కేటాయించడంతో నగరంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం (టీడీపీ), వైఎస్సార్ కాంగ్రెస్ (వైసీపీ) తమ అభ్యర్థుల ఎంపికపై తీవ్రంగా దృష్టి సారించాయి. టీడీపీ తరఫున నందమూరి బాలకృష్ణ చిన్నకుమార్తె తేజస్విని, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అర్ధాంగి లావణ్య పేర్లు ప్రచారంలోకి రాగా, వైసీపీ తరఫున మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ సహా పలువురు నేతల కుటుంబ సభ్యుల పేర్లు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.
Nandamuri Tejaswini Visakhapatnam Mayor: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల సందడి మొదలవడంతో విశాఖపట్నం రాజకీయం రసవత్తరంగా మారింది. ఈసారి విశాఖ మేయర్ పదవిని 'జనరల్ మహిళ' కేటగిరీకి కేటాయించడంతో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికపై వేగంగా అడుగులు వేస్తున్నాయి. సామాజిక సమీకరణాలు, గెలుపు అవకాశాలను బేరీజు వేసుకుంటూ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు నిమగ్నమయ్యాయి.
టీడీపీ రేసులో ప్రముఖుల పేర్లు..
తెలుగుదేశం పార్టీ తరఫున మేయర్ టికెట్ కోసం ప్రముఖుల పేర్లు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె, విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ అర్ధాంగి అయిన తేజస్విని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
అలాగే ఏపీ టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అర్ధాంగి లావణ్య పేరు కూడా తెరపైకి వచ్చింది. వీరితో పాటు మాజీ కార్పొరేటర్ ముక్కా శ్రావణి, మరొక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె పేరును కూడా అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇవన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలే అయినప్పటికీ, అధిష్ఠానం త్వరలోనే బలమైన అభ్యర్థిని ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తోంది.
వైసీపీలో గట్టి పోటీ..
మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కూడా మేయర్ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అర్ధాంగి, మాజీ ఎంపీ అయిన బొత్స ఝాన్సీ పేరు బలంగా ప్రచారంలో ఉంది. ఆమెకున్న రాజకీయ అనుభవం పార్టీకి కలిసివస్తుందని భావిస్తున్నారు. అలాగే మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అర్ధాంగి హిమగౌరి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, అనకాపల్లి మాజీ ఎంపీ బీశెట్టి సత్యవతి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. వైసీపీ అధిష్ఠానం సైతం సామాజిక వర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ అభ్యర్థి ఎంపికపై లెక్కలు వేస్తోంది.
మూడో మహిళా మేయర్ రాక..
గ్రేటర్ విశాఖ చరిత్రను పరిశీలిస్తే ఇప్పటివరకు ఇద్దరు మహిళలు మేయర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. జీవీఎంసీ ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి రాజాన రమణి (2000 - 2005) పనిచేయగా, 2021 నుంచి వైసీపీకి చెందిన గొలగాని హరి వెంకట కుమారి మేయర్‌గా వ్యవహరించారు. తాజా రిజర్వేషన్ల ఫలితంగా విశాఖపట్నానికి మూడో మహిళా మేయర్ రానున్నారు. ప్రముఖుల కుటుంబ సభ్యుల పేర్లు పరిశీలనలో ఉండటంతో ఈసారి ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.