Nayara Petrol Hike: ఇంధన వినియోగదారులకు పిడుగు లాంటి వార్త..పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 నయారా పెంపు!
Nayara Energy Petrol Hike: ప్రపంచంలో మారుతున్న పరిస్థితుల కారణంగా నానాటికి క్రూడ్ ఆయిల్ ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ఇప్పటికే భారతదేశంలో ఇటీవలే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగ్గా.. తాజాగా ప్రైవేట్ ఇంధన రిటైలర్ సంస్థ నయారా ఎనర్జీ కూడా తాజాగా పెట్రోల్‌పై లీటరుకు రూ.5, డీజిల్ ధర లీటర్‌కు రూ. 3 చొప్పున పెంచనున్నట్లు ప్రకటించింది.
Nayara Energy Petrol Hike: ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలపై వస్తున్న మార్పుల వల్ల ప్రైవేట్ రిఫైనరీలపై ఆర్థిక భారం పెరిగిపోతుంది. ఈ ఏడాది ఇరాన్‌లో ఉద్రిక్తత ప్రారంభమైన నాటి నుంచి ఇంధనాల ధరల భారాన్ని వినియోగదారులపై మోపుతున్న సంగతి తెలిసిందే.
మార్చి 26న లీటర్ పెట్రోల్‌పై అప్పట్లో లీటరుకు రూ. 5, డీజిల్‌పై రూ.3 పెంచడంతో.. పెట్రోల్ ధర రూ.100.71, డీజిల్ ధర రూ.91.31 (ఢిల్లీలో)కి చేరాయి. అయితే పశ్చిమాసియాలో పరిస్థితులు సర్దుమణిగిన తర్వాత చమురు ధరలు తగ్గడంతో జూలై 1న నయారా మళ్లీ రూ. 5, రూ. 3 చొప్పున తగ్గించి ప్రభుత్వ పెట్రోల్ బంకుల ధరలతో సమానంగా తెచ్చింది. అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా మళ్లీ ఖర్చులు పెరిగిపోవడంతో కంపెనీ ఈ తాజా సర్దుబాటు చేసింది.
ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ మార్కెట్
దేశంలో ఉన్న 1,04,137 పెట్రోల్ పంపులలో 90 శాతానికి పైగా ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్ (భారత్ పెట్రోల్), హెచ్‌పీసీఎల్ (హిందూస్థాన్ పెట్రోలియం) వంటి ప్రభుత్వ రంగ సంస్థల నియంత్రణలోనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఈ సంస్థలు పంప్ ధరలను స్థిరంగా కొనసాగిస్తున్నాయి.
మరోవైపు 2,304 పంపులు కలిగిన జియో - బీపీ (జియో పెట్రోల్ బంక్) ఇప్పటివరకు ఎలాంటి ధరల సవరణ చేయలేదు.
నయారా, జియో-బీపీలు నష్టాల వల్ల గతంలో విక్రయాలపై పరిమితులు విధించగా, అక్టోబర్ 1న కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ రిటైలర్లు సరఫరాపై పరిమితులు విధించవద్దని ఆదేశించింది.
చమురు కంపెనీల నష్టాలు, ద్రవ్యోల్బణ ప్రభావం
రేటింగ్ ఏజెన్సీ ఐక్రా (ICRA) ప్రకారం.. ముడి చమురు బ్యారెల్‌కు 85 - 90 డాలర్లు దాటినప్పుడు రిటైల్ ధరలు పెంచకపోతే చమురు సంస్థలకు నష్టాలు వస్తాయి. ప్రస్తుతం ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్‌పై లీటరుకు రూ. 8, డీజిల్‌పై రూ. 9 చొప్పున మార్కెటింగ్ నష్టాలను ఎదుర్కొంటూ రోజుకు సుమారు రూ. 530 కోట్లు నష్టపోతున్నాయని ఐక్రా తెలిపింది.
గుజరాత్‌లోని వడినార్‌లో ఏటా 20 మిలియన్ టన్నుల సామర్థ్యం గల రిఫైనరీ నడుపుతున్న నయారా చేసిన ఈ ధరల పెంపు వల్ల ప్రైవేట్, ప్రభుత్వ బంకుల మధ్య వ్యత్యాసం పెరిగింది. ఇది సమీప భవిష్యత్తులో రవాణా వ్యయాన్ని పెంచి, నిత్యావసరాలపై గృహ ద్రవ్యోల్బణ భారం పెంచే అవకాశం ఉంది.