Repo Rate 2026: లోన్లు తీసుకున్న వారికి బిగ్ షాక్.. ఈఎంఐలు ఎంత పెరగనున్నాయో తెలుసా..?
RBI Hikes Repo Rate: MPC సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే లక్ష్యంతో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) పెంచింది. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించనున్నాయి. వివరాలు ఇలా..
RBI Hikes Repo Rate: లోన్లు తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) షాకిచ్చింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను అదుపులోకి తెచ్చే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును పో రేటును 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. మూడు రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమీక్షా సమావేశం అనంతరం నిర్ణయాలను వెల్లడించింది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితులు, నిత్యావసరాల ధరల పెరుగుదల దృష్ట్యా వృద్ధి రేటును కాపాడుతూనే.. ద్రవ్యోల్బణాన్ని నిర్దేశిత పరిమితికి పరిమితం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
RBI నిర్ణయంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ప్రత్యక్షంగా ఆర్థిక భారం పడనుంది. బ్యాంకులు ఆర్బీఐ నుంచి పొందే రుణాలపై వడ్డీ పెరగనుండటంతో ఆ భారాన్ని వాణిజ్య బ్యాంకులు నేరుగా ఖాతాదారులకే బదిలీ చేయనున్నాయి. ఫలితంగా ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ (EBLR) లేదా ఫ్లోటింగ్ రేట్లతో ముడిపడి ఉన్న హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్, పర్సనల్ లోన్స్ మరింత ప్రియం కానున్నాయి.
వడ్డీ రేట్లు పెరిగినప్పుడు బ్యాంకులు సాధారణంగా రుణ కాలపరిమితిని (టెన్యూర్) పొడిగించడం లేదా నెలవారీ EMIని సవరించడం చేస్తాయి. ఉదాహరణకు రూ.30 లక్షల గృహ రుణంపై (20 ఏళ్ల కాలపరిమితితో) వడ్డీ రేటు 0.25 శాతం పెరిగితే.. నెలకు దాదాపు రూ.500 వరకు అదనపు భారం పడుతుంది. అదే రూ.50 లక్షల లోన్‌పై ఈ భారం నెలకు సుమారు రూ.800 దాటుతుంది. కాలపరిమితి పెరిగితే అసలు కంటే వడ్డీ రూపంలోనే లక్షలాది రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. (కింది టేబుల్‌లో పూర్తి లెక్కలు చూడండి..)
| రుణ మొత్తం | వడ్డీ రేటు | నెలవారీ EMI | మొత్తం వడ్డీ | చెల్లించాల్సిన మొత్తం |
|---|---|---|---|---|
| రూ. 20 లక్షలు <small style="color:#666666;">(20 ఏళ్లు)</small> | 8.75% | రూ. 17,674 | రూ. 22,41,811 | రూ. 42,41,811 |
| 9.00% | రూ. 17,995 | రూ. 23,18,685 | రూ. 43,18,685 | |
| +0.25% పెంపు | రూ. 321 | రూ. 76,874 | రూ. 76,874 | |
| రూ. 30 లక్షలు <small style="color:#666666;">(20 ఏళ్లు)</small> | 8.75% | రూ. 26,511 | రూ. 33,62,717 | రూ. 63,62,717 |
| 9.00% | రూ. 26,992 | రూ. 34,78,027 | రూ. 64,78,027 | |
| +0.25% పెంపు | రూ. 481 | రూ. 1,15,310 | రూ. 1,15,310 | |
| రూ. 50 లక్షలు <small style="color:#666666;">(20 ఏళ్లు)</small> | 8.75% | రూ. 44,185 | రూ. 56,04,528 | రూ. 1,06,04,528 |
| 9.00% | రూ. 44,986 | రూ. 57,96,712 | రూ. 1,07,96,712 | |
| +0.25% పెంపు | రూ. 801 | రూ. 1,92,184 | రూ. 1,92,184 |
గత నాలుగు MPC సమావేశాలలో రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా కొనసాగించిన విషయం తెలిసిందే. అయితే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను అరికట్టడానికి, US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచినందుకు ప్రతిస్పందనగా తాజాగా 0.25 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మొత్తం రెపో రేటు 5.50 శాతానికి చేరింది. పెరుగుతున్న EMI భారం నుంచి ఉపశమనం పొందాలంటే.. వీలైనంత వరకు రుణాలపై పాక్షిక ముందస్తు చెల్లింపులు చేయడం లేదా తక్కువ వడ్డీని ఆఫర్ చేసే బ్యాంకులకు లోన్ బదిలీ చేసుకునే అవకాశాలను పరిశీలించాలని బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు.
రెపో రేటు అంటే..?
బ్యాంకులకు అవసరమైనప్పుడు ఆర్‌బీఐ లోన్లు అందజేస్తుంది. ఇలా బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే రుణాలకు అందించే వడ్డీ రేటును 'రెపో రేటు' అంటారు. రెపో రేటు పెరిగితే.. బ్యాంకులు ఆర్బీఐ నుంచి అధిక వడ్డీ రేటుకు రుణాలు పొందుతాయి. అదేవిధంగా రెపో రేటు తగ్గితే.. బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుకు లోన్లు పొందుతాయి. హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్, వ్యక్తిగత రుణాలు మొదలైన వాటి వడ్డీ రేట్లను నేరుగా ప్రభావితం చేస్తుంది. వడ్డీ రేట్లు పెంచిన ప్రతిసారి ఈఎంఐ కూడా పెరుగుతుంది.