SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Visa Mastercard Data Leak: ఏటీఎం వినియోగదారులకు బిగ్ న్యూస్..వీసా, మాస్టర్ కార్డ్ డేటా లీక్..మీ డబ్బు సేఫేనా?

Visa Mastercard JPMorgan Data Leak: బ్యాంకుల్లో డెబిట్, క్రెడిట్ కార్డులకు చెందిన సంస్థలైన వీసా, మాస్టర్‌కార్డ్, జేపీ మోర్గాన్ చేజ్ సంస్థలకు చెందిన కస్టమర్ల సమాచారం సైబర్ దాడిలో లీకైనట్లు వెల్లడైంది. థర్డ్‌పార్టీ సేవా సంస్థలను లక్ష్యంగా చేసుకున్న హ్యాకర్లు పేర్లు, ఈమెయిల్ చిరునామాలు, మార్కెటింగ్ రికార్డులను బయటపెట్టారు. కార్డు నంబర్లు, చెల్లింపుల వివరాలు లీక్ కాలేదని సంస్థలు చెబుతున్నప్పటికీ, ఫిషింగ్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Written By Harish Darla
Published: Nov 20, 2026, 13:12 IST | Updated: Nov 20, 2026, 14:22 IST
Join

Visa Mastercard JPMorgan Data Leak: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సేవలు అందించే ప్రముఖ సంస్థలు వీసా, మాస్టర్‌కార్డ్, జేపీ మోర్గాన్ చేజ్ లకు సైబర్ దాడుల ముప్పు ఎదురైంది. ఈ సంస్థలకు సేవలందిస్తున్న థర్డ్‌పార్టీ వెండర్లపై హ్యాకర్లు దాడి చేయడంతో కొంతమంది కస్టమర్ల వ్యక్తిగత సమాచారం బహిర్గతమైనట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ ఘటన అంతర్జాతీయంగా డేటా భద్రతపై మరోసారి ఆందోళన పెంచింది. 'n0n' అనే రాన్సమ్‌వేర్ గ్రూప్ ఈ దాడులకు బాధ్యత వహించినట్లు ప్రకటించింది. తమ డిమాండ్లకు స్పందించకపోవడంతో దొంగిలించిన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు పేర్కొంది.

ఈ డేటాలో కస్టమర్ల పేర్లు, ఈమెయిల్ చిరునామాలు, ఫోన్ నంబర్లు, పోస్టల్ కోడ్‌లు, మార్కెటింగ్ ప్రచారాలకు సంబంధించిన వివరాలు ఉన్నట్లు సమాచారం. అయితే, బ్యాంకు ఖాతాల లాగిన్ వివరాలు, కార్డు నంబర్లు, చెల్లింపులకు సంబంధించిన అత్యంత కీలక సమాచారం బయటపడినట్లు ప్రస్తుతానికి నిర్ధారణ కాలేదు.

జేపీ మోర్గాన్ చేజ్ తమ బాహ్య సేవా సంస్థల వద్ద జరిగిన భద్రతా ఉల్లంఘనపై దర్యాప్తు చేపట్టింది. కస్టమర్ల మార్కెటింగ్ రికార్డులు, పేర్లు, ఈమెయిల్స్ వంటి వివరాలు హ్యాకర్లకు అందినట్లు ప్రాథమిక పరిశీలనలో గుర్తించింది. వీసా సంస్థ ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని థర్డ్‌పార్టీ ప్రొవైడర్‌పై దాడి జరిగినట్లు వెల్లడించింది. ప్రీమియం డైనింగ్, లాయల్టీ ప్రోగ్రామ్‌లకు సంబంధించిన కొందరు కార్డుదారుల సమాచారం ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.

మాస్టర్‌కార్డ్ సైతం తన బాహ్య సేవా సంస్థకు సంబంధించిన సైబర్ భద్రతా ఘటనను ధృవీకరించింది. ఒక నిర్దిష్ట బెనిఫిట్ ప్రోగ్రామ్‌లో భాగమైన వినియోగదారులకు చెందిన పరిమిత వ్యక్తిగత సమాచారం బహిర్గతమైందని తెలిపింది. అయితే, ఈ ఘటన తమ ప్రధాన చెల్లింపు వ్యవస్థలను ప్రభావితం చేయలేదని మూడు సంస్థలు స్పష్టం చేశాయి.

ఈ డేటా లీక్ వల్ల వినియోగదారులకు ఫిషింగ్ ఈమెయిల్స్, నకిలీ బ్యాంకింగ్ సందేశాలు, ఫోన్ కాల్స్ ద్వారా మోసాలు జరిగే ప్రమాదం ఉంది. కస్టమర్లు అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకుండా, OTPలు, పాస్‌వర్డ్‌లు, కార్డు వివరాలు ఎవరికీ తెలియజేయకుండా జాగ్రత్తపడాలి. సంస్థలు దర్యాప్తు కొనసాగిస్తూ ప్రభావిత వినియోగదారులకు అవసరమైన సహాయం అందిస్తామని చెబుతున్నాయి.

Add Zee News as a Preferred Source

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

ZEENEWS TRENDING STORIES