Rashmika Mandanna: 400 కుటుంబాలకు అండగా నిలిచిన నేషనల్ క్రష్!
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం, నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తన మంచి మనసుతో అందరి ప్రశంసలు అందుకుంటోంది. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ తాను మంచి మనిషినని మరోసారి నిరూపించుకుంది. ఏకంగా 400 కుటుంబాలకు సాయం చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తెలిసి అభిమానులు రష్మికపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Rashmika Mandanna: రష్మిక మందన్న తాజాగా 400 కుటుంబాలకు ఏడాది పాటు నిత్యావసర సరుకుల కోసం సాయం చేయనున్నట్లు ప్రకటించింది. ఒక్కోసారి మూడు నెలల పాటు 400 కుటుంబాలకు ఈ సహాయం అందించనుంది. ఇలా వచ్చే ఏడాది వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆమె నిర్ణయించుకుంది. దీనివల్ల ఆ కుటుంబాలకు సరుకుల కోసం ఖర్చు చేసే డబ్బు ఆదా అవుతుంది. ఆ డబ్బును వారు తమ భవిష్యత్తు అవసరాలకు ఉపయోగించుకోవచ్చని రష్మిక భావిస్తోంది.
ఈ విషయాన్ని రష్మిక సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. తనకు, తాను నటించిన జయమ్మ పాత్రకు కొన్ని పోలికలు ఉన్నాయని ఆమె చెప్పింది. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. "మీరు పోషించే పాత్రలు మీపై కూడా ప్రభావం చూపిస్తాయి. జయమ్మ పాత్రకు, నాకు ఏమైనా పోలికలు ఉన్నాయా అని చాలామంది అడుగుతున్నారు. అవును.. ఈ విషయంలో మా ఇద్దరికీ పోలిక ఉంది. ఇది ఎప్పటి నుంచో నా స్వభావంలో భాగం" అని తెలిపింది.
గతంలో కూడా తాను చాలామందికి సాయం చేశానని, అయితే వాటి గురించి బయటకు చెప్పలేదని రష్మిక వెల్లడించింది. ఇప్పుడు మాత్రం తన అభిమానులు కూడా ఇలాంటి మంచి పనులు చేయడానికి ప్రేరణ పొందాలని ఈ విషయాన్ని అందరితో పంచుకున్నట్లు చెప్పింది.
"మీరు నాకు చూపించే ప్రేమకు ప్రతిగా నేను ఎప్పుడూ ఇలాంటి పనులు చేస్తూనే ఉంటాను. కానీ ఇంతకుముందు వాటి గురించి బయటకు చెప్పేదాన్ని కాదు. ఇప్పుడు నా అభిమానులు కూడా ఇలాంటి పనులు చేయడానికి ప్రేరణ పొందితే నాకు సంతోషంగా ఉంటుంది" అని రష్మిక పేర్కొంది. అంతేకాదు, "ఒక చిన్న మంచి పని కూడా ఒకరి జీవితాన్ని మార్చగలదు. దాని కోసం పెద్ద పని చేయాల్సిన అవసరం లేదు. మనమందరం చిన్న పనులతోనే ప్రారంభిద్దాం" అని అభిమానులకు పిలుపునిచ్చింది.
తన సినీ ప్రయాణంలో ఎదురైన కష్టాలు, నిద్రలేని రాత్రులు, బాధలు అన్నీ ఆ కుటుంబాల ముఖాల్లో కనిపించే చిరునవ్వుల ముందు చిన్నవేనని రష్మిక చెప్పింది. "ఆ చిరునవ్వుల ముందు ఇవన్నీ విలువలేనివి. ఆ ఆనందం వెలకట్టలేనిది" అని ఆమె తెలిపింది. ఇక రష్మిక ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి నటించిన రణబాలి సినిమా విడుదల కోసం ఎదురుచూస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 16న థియేటర్లలోకి రానుంది.
Read More: Ranabaali First Review: కత్తెర పడలేదు.. యూఏ సర్టిఫికెట్ వచ్చేసింది.. రణబాలి గురించి సెన్సార్ ఏమనిందంటే!