Trump Putin Meeting: ఒకే వేదికపైకి పుతిన్, ట్రంప్, జిన్‌పింగ్..చైనాలో అగ్రరాజ్యాల అధినేతల అరుదైన కలయిక!
Trump Putin XI Jinping Meeting: చైనాలోని షెంజెన్ వేదికగా జరుగుతున్న ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (ఎపెక్) సదస్సు సందర్భంగా ప్రపంచ అగ్రరాజ్యాల అధినేతలు ఒకే వేదికపై ప్రత్యక్షమై సరికొత్త చరిత్ర సృష్టించారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇచ్చిన విందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కలుసుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు.
Trump Putin XI Jinping Meeting: చైనాలోని షెంజెన్ నగరంలో బుధవారం సాయంత్రం అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ఎపెక్ సదస్సుకు హాజరైన దేశాధినేతల గౌరవార్థం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఆయన సతీమణి పెంగ్ లియువాన్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. హాలులో ట్రంప్, జిన్‌పింగ్ ఉండగా రష్యా అధ్యక్షుడు పుతిన్ రెడ్ కార్పెట్‌పై నడుచుకుంటూ వారి వద్దకు చేరుకున్నారు.
ఆ సమయంలో ట్రంప్, పుతిన్ కరచాలనం చేసుకుని, ఒకరి భుజం మరొకరు తట్టుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భాన్ని జిన్‌పింగ్ ఆసక్తిగా గమనించగా, అనంతరం ముగ్గురు నేతలు కలసి ఉల్లాసంగా గడుపుతూ ఫొటోలు దిగారు, చర్చలు కొనసాగించారు.
నేతల భేటీలు - చారిత్రక నేపథ్యం
2025 ఆగస్టులో అలస్కా వేదికగా జరిగిన సమావేశం తర్వాత ట్రంప్, పుతిన్‌లు మళ్లీ కలుసుకోవడం ఇదే ప్రథమం. కాగా, దేశాధినేతల హోదాలో పుతిన్, జిన్‌పింగ్‌లు భేటీ కావడం ఇది 50వ సారి కావడం విశేషం. అంతకుముందే షెంజెన్ చేరుకున్న పుతిన్, జిన్‌పింగ్‌తో ప్రత్యేకంగా సమావేశమై తమ విదేశాంగ విధానాలు సత్ఫలితాలనిస్తున్నాయని పేర్కొన్నారు.
మరోవైపు, ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో విచ్చేసిన డొనాల్డ్ ట్రంప్‌నకు జిన్‌పింగ్ వ్యక్తిగతంగా విమానాశ్రయానికి వెళ్లి ఆలింగనం చేసుకుని సైనిక వందనం, ఫైటర్ జెట్ల విన్యాసాలతో ఘన స్వాగతం పలికారు.
కీలక చర్చలు, అంతర్జాతీయ ప్రాధాన్యం
ట్రంప్‌తో విస్తృత స్థాయి చర్చలు జరిపి ఇరుదేశాల సంబంధాలను పటిష్ఠం చేయడంతో పాటు ఆసియా-పసిఫిక్‌లో శాంతి, స్థిరత్వాలకు సహకరించుకోవాలని చైనా భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అటు ట్రంప్ సైతం జిన్‌పింగ్‌తో భేటీ ఆశాజనకంగా సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గురువారం జరగనున్న విస్తృత, ద్వైపాక్షిక భేటీల్లో అణ్వాయుధ నియంత్రణ, ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ పరిణామాలపై నేతలు చర్చించే అవకాశముంది. అంతేకాకుండా, ఈ పర్యటనలో భాగంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో కూడా సమావేశం కావాలని ట్రంప్ యోచిస్తున్నారు.