Sonia Gandhi: ఎమర్జెన్సీ, ప్రధాని పదవిపై సోనియా గాంధీ ఆత్మకథలో 6 అతి ముఖ్యమైన అంశాలు
Sonia Gandhi Life Story Belonging A Journey of Love Book Highlights: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన ఆత్మకథలో కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. ఎమర్జెన్సీ పరిస్థితులు.. ప్రధానమంత్రి పదవికి పోటీపడడం.. ప్రణబ్ ముఖర్జీ ప్రధాని అభ్యర్థిత్వం కోసం పోటీపడడం వంటి అంశాలపై తన ఆత్మకథలో ప్రస్తావించారు.
Sonia Gandhi Life Story: భారతదేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తన జీవితంలో జరిగిన కీలక పరిణామాలను తన ఆత్మకథగా రాశారు. 'బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ ఏ లవ్ బుక్' అనే పేరుతో సోనియా గాంధీ పుస్తకం రాయగా.. ఆ పుస్తకంలో కొన్ని ప్రధాన ఘట్టాలు ప్రస్తావించారు. భారతదేశంలో చోటుచేసుకున్న కీలక పరిణామాల్లో తాను వహించిన పాత్ర విషయమై వివరించారు. తన ఆత్మకథలో ఆరు అతి ముఖ్యమైన అంశాలను వివరించారు.
అత్యవసర పరిస్థితి
భారతదేశ అత్యవసర పరిస్థితిపై ఆత్మకథలో సోనియా గాంధీ ప్రస్తావించారు. 1975లో ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీపై సోనియా తన అభిప్రాయాలను వెల్లడించారు. ఎమర్జెన్సీ విధించాలనే విషయంలో రాజీవ్ గాంధీకి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. సంజయ్ గాంధీ అత్యవసర పరిస్థితికి మద్దతుగా ఉన్నారని.. రాజీవ్ మాత్రం దానిపై వ్యతిరేకత వ్యక్తం చేశారని సోనియా గాంధీ ఆత్మకథలో వివరించినట్లు తెలుస్తోంది. ఇందిరా గాంధీ ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న నాయకురాలు అని.. ఎమర్జెన్సీ పరిణామాలపై తర్వాత పశ్చాత్తాపం చెందారని సోనియా అభిప్రాయపడినట్లు సమాచారం.
అధికారిక ఫైళ్లు
కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి అధికారంలో ఉన్న సమయంలో తనపై వచ్చిన విమర్శలు, ఆరోపణలపై తన ఆత్మకథలో సోనియా గాంధీ ప్రస్తావించారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారిక ఫైళ్లు పరిశీలించాననే ఆరోపణలు రావడంపై పుస్తకంలో వివరించినట్లు తెలుస్తోంది. యూపీఏ హయాంలో ప్రభుత్వ అధికారిక ఫైళ్లను సోనియా గాంధీ పరిశీలించేవారనే ఆరోపణలపై ఆమె స్పందిస్తూ కీలక విషయాలు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి సంబంధం లేని వ్యక్తిగా తాను అధికారిక ఫైళ్లలో ఏదో వెతుకుతున్నాననే ప్రచారం తనను తీవ్రంగా బాధించిందని పేర్కొన్నారు. తాను ఎప్పుడూ నిబంధనలను గౌరవించానని.. ప్రభుత్వ వ్యవహారాల్లో నియమాలను పాటించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపించానని పుస్తకంలో వివరించారు.
మోదీపై విమర్శలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సోనియా గాంధీ తన ఆత్మకథలో కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై సోనియా గాంధీ తన అభిప్రాయాలను పుస్తకంలో వెల్లడించారు. మన్మోహన్ సింగ్ నాయకత్వంలో భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందిందని.. గతంలో అమలుచేసిన ఆర్థిక విధానాలను మోదీ ప్రభుత్వం బలహీనపరుస్తోందని పుస్తకంలో విమర్శలు చేసినట్లు సమాచారం. 2014 ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేరలేదని ప్రజలు గుర్తిస్తున్నారని వ్యాఖ్యానించినట్లు సమాచారం
ప్రధానమంత్రి పదవి
2004లో ప్రధాని పదవిని తిరస్కరించారనే అంశంపై ఆత్మకథలో సోనియా గాంధీ వివరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని పదవిని చేపట్టే అవకాశం రాగా.. ప్రధానమంత్రి పదవిని స్వీకరించకుండా డాక్టర్ మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకు తీసుకొచ్చిన విషయం ఆత్మకథలో తెలిపినట్లు సమాచారం. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు.. తన అంతరాత్మ చెప్పిన మాటను పుస్తకంలో వివరించినట్లు.. ప్రధాని పదవిని వదులుకోవడం వెనుక ఉన్న వ్యక్తిగత, రాజకీయ ఆలోచనలను వెల్లడించినట్లు తెలుస్తోంది.
భారతదేశంలో కొత్త అలవాటు
విదేశీయురాలిగా ఉన్న సోనియా గాంధీ.. రాజీవ్ గాంధీతో వివాహం చేసుకుని భారతదేశం వచ్చారు. 1968లో రాజీవ్ గాంధీతో వివాహం తర్వాత భారత సంస్కృతికి తాను అలవాటు పడడంపై సోనియా గాంధీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. కొత్త దేశం, కొత్త భాష, కొత్త సంస్కృతికి అలవాటుపడడంలో ఎదురైన ఇబ్బందులను వివరించినట్లు సమాచారం. హిందీ నేర్చుకోవడం, చీరకట్టు కట్టడం, భారతీయ ఆహారపు అలవాట్లకు అలవాటు పడటం వంటి అనుభవాలను పంచుకున్నట్లు తెలుస్తోంది.
ప్రణబ్ ముఖర్జీ ప్రధాని కావాలనుకున్నారా?
ప్రణబ్ ముఖర్జీ ప్రధాని పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు సోనియా గాంధీ తన ఆత్మకథలో ప్రస్తావించినట్లు సమాచారం. 2010 ప్రాంతంలో ప్రణబ్ ముఖర్జీ తనతో జరిగిన సంభాషణలో ప్రధాని కావాలనే బలమైన కోరికను వ్యక్తం చేసినట్లు.. ఇది చెప్పడం తనకు ఆశ్చర్యానికి గురిచేసిందని సోనియా వెల్లడించినట్లు తెలుస్తోంది.