Sabarimala Pilgrims Police Alert: అయ్యప్ప భక్తులకు కేరళం పోలీసుల వార్నింగ్.. ఈ నిబంధనలు పాటించాల్సిందేనని హుకుం!
Sabarimala Pilgrims Kerala Police Alert: శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తుల కోసం కేరళం పోలీసులు కొన్ని కీలక మార్గదర్శకాలు విడుదల చేశారు. ఇకపై రోజుకు 80 వేల మందికి మాత్రమే దర్శన అనుమతి ఉండగా, వర్చువల్ క్యూ బుకింగ్ తప్పనిసరి చేశారు. స్పాట్ బుకింగ్ నీలక్కల్‌లో అందుబాటులో ఉంటుంది. పంబ వద్ద పార్కింగ్ నిషేధం, వాహన పరిమితులు, అటవీ మార్గాల బుకింగ్ నిబంధనలను భక్తులు పాటించాలని సూచించారు.
Sabarimala Pilgrims Kerala Police Alert: శబరిమలలోని మండల-మకరవిళక్కు యాత్ర సందర్భంగా అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు కేరళ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. దర్శన సమయంలో భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఈ నిబంధనలు రూపొందించారు. వీటిని ఆంధ్రప్రదేశ్ డీజీపీ కార్యాలయానికి కూడా పంపించారు. యాత్రకు బయలుదేరే భక్తులు ముందుగానే ఈ మార్గదర్శకాలను తెలుసుకోవాలని అధికారులు సూచించారు.
వర్చువల్ క్యూ బుకింగ్ తప్పనిసరి
అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు ముందుగా ఆన్‌లైన్ వర్చువల్ క్యూ టికెట్ బుక్ చేసుకోవాలి. రోజుకు గరిష్ఠంగా 80 వేల మంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. గతంలో పంబలో నిర్వహించిన స్పాట్ బుకింగ్ కేంద్రాలను నీలక్కల్‌కు మార్చారు. స్పాట్ బుకింగ్ ద్వారా దర్శనం పొందాలనుకునేవారు నీలక్కల్‌లోనే టికెట్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి.
ఇక్కడ రోజుకు 10 వేల మందికి మాత్రమే స్పాట్ బుకింగ్ అవకాశం ఉంటుంది. ఎరుమేలి - పంబ, వండిపెరియార్ సత్రం - పుల్లుమేడు అటవీ మార్గాల్లో కాలినడకన వెళ్లే భక్తులకు కూడా ఆన్‌లైన్ లేదా స్పాట్ బుకింగ్ రశీదు తప్పనిసరి. ఈ మార్గాల్లో రోజుకు 2 వేల మంది వరకు స్పాట్ బుకింగ్ సదుపాయం కల్పించారు.
నీలక్కల్‌లోనే వాహనాల పార్కింగ్
పంబ వద్ద పార్కింగ్ స్థలం పరిమితంగా ఉండటంతో ప్రైవేట్ వాహనాలను నీలక్కల్ బేస్ క్యాంప్‌లోనే నిలిపివేయాలి. అక్కడి నుంచి KSRTC చైన్ సర్వీస్ బస్సుల్లో పంబకు చేరుకోవాలి. నీలక్కల్ - పంబ రహదారిపై వాహనాల పార్కింగ్ పూర్తిగా నిషేధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 14 సీట్ల వరకు ఉన్న వాహనాలు భక్తులను పంబ వద్ద దించి తిరిగి నీలక్కల్‌కు వెళ్లాలి. అంతకంటే ఎక్కువ సీట్ల సామర్థ్యం ఉన్న ప్రైవేట్ బస్సులు, భారీ వాహనాలకు పంబ వరకు అనుమతి ఉండదు.
అలాగే పంపా నదిలో దుస్తులు వదిలేయడంపై నిషేధాన్ని విధించారు. నదీ పరిశుభ్రత, ప్రకృతి పరిరక్షణకు భక్తులు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. యాత్రలో ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా అయ్యప్ప దర్శనం చేసుకోవాలని కేరళం పోలీసులు సూచించారు.