Indian Hockey: 44 ఏళ్ల కసి తీర్చుకున్న భారత మహిళలు.. హకీలో స్వర్ణం కైవసం
Indian Hockey Women Bags Gold Medal After 44 Years In Asian Games: ఆసియా క్రీడల్లో భారత హకీ క్రీడాకారిణులు చరిత్ర సృష్టించారు. 44 ఏళ్ల తర్వాత ఖండాంతర క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సాధించి రికార్డు నెలకొల్పారు. చైనాపై అద్భుత విజయం సాధించిన భారత హకీ మహిళా జట్టు 2028 ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Indian Hockey Women Bags Gold Medal After 44 Years: ఆసియా క్రీడల్లో భారత్ పతకాల మోత మోగిస్తోంది. క్రీడాకారులు పతకాల వేట కొనసాగిస్తుండగా.. భరతమాత మెడలో గోల్డ్ మెడల్స్‌తోపాటు ఇతర మెడల్స్ పడుతున్నాడు. ఈ క్రమంలోనే హకీలో మహిళా క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. ఆసియా క్రీడల్లో హకీ ఫైనల్స్‌లో చైనాను మట్టికరిపించిన మన అమ్మాయిలు స్వర్ణ పతకాన్ని కొల్లగొట్టారు. ఆసియా క్రీడల్లో 44 ఏళ్ల తర్వాత హకీలో గోల్డ్ మెడల్‌ను భారత మహిళలు సాధించి రికార్డు నెలకొల్పారు. ఈ విజయంతో భారత జట్టు 2028 ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధించడం విశేషం.
డిఫెండింగ్ చాంపియన్ చైనాకు షాక్
ఆసియా క్రీడల్లో శుక్రవారం జరిగిన హకీ ఫైనల్లో చైనాతో భారత్ తలపడింది. డిఫెండింగ్ చాంపియన్ చైనాకు గట్టి పోటీనిచ్చిన భారత అమ్మాయిలు తుది వరకు అదే ప్రదర్శన కొనసాగించి డ్రాగన్ జట్టును చిత్తు చేశారు. మ్యాచ్ ప్రథమార్థంలో 10వ నిమిషంలో భారత ప్లేయర్ లాల్‌రెమ్‌సియామి సాధించిన ఒక్క గోల్ తప్ప మ్యాచ్ ముగిసేవరకు ఇరు జట్లు సాధించలేకపోయాయి. లెఫ్ట్ సైడ్ సర్కిల్ నుంచి బంతిని నెట్‌లోకి పంపించి లాల్‌రెమ్‌సియామి భారత జట్టును ఆధిక్యంలోకి తీసుకురావడమే కాకుండా స్వర్ణ పతకాన్ని సాధించింది. చైనా ప్లేయర్ల అటాకింగ్ గేమ్‌ను సమర్థంగా అడ్డుకుంది. చైనా ఆటగాళ్లు సంధించిన పెనాల్టీ స్ట్రోక్‌లను కూడా భారత ఆటగాళ్లు నిర్వీర్యం చేయడంలో సఫలమయ్యారు.
ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం భారత్‌కు 44 ఏళ్లుగా అందని ద్రాక్షగా మారింది. 1982లో ఢిల్లీ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టు స్వర్ణ పతకం గెలిచింది. అప్పుడు జరిగిన తుది పోరులో భారత్ 22-0తో హాంకాంగ్‌పై సంచలన విజయం సాధించి.. స్వర్ణ పతకం కొల్లగొట్టింది. మళ్లీ నాలుగు దశాబ్దాల తర్వాత డిఫెండింగ్ చాంపియన్ చైనా నుంచి భారత జట్టు బంగారు పతకాన్ని చేజిక్కించుకుంది. ఇదే ఉత్సాహంతో 2028 ఒలింపిక్స్‌కు భారత జట్టు వెళ్లనుంది. ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు అదరగొట్టి స్వర్ణ పతకం సొంతం చేసుకోవడంతో అందరూ మహిళా క్రీడాకారులను అభినందిస్తున్నారు. 44 ఏళ్ల నిరీక్షణ తర్వాత గోల్డ్ మెడల్ సాధించిన మన అమ్మాయిలకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి.
ఒక్కరోజే ఆరు స్వర్ణాలు..
ఇక ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అద్భుతాలు నెలకొల్పుతూ తిరుగులేని విజయాలు పొందుతున్నారు. పతకాల వేటలో భారత్ స్థాయికి మించి ప్రదర్శన కొనసాగుతోంది. ఈసారి ఆసియా గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. మహిళా హకీ సాధించిన స్వర్ణం 16వ మెడల్ కావడం విశేషం. అయితే ఇతర క్రీడల్లో కూడా భారత్‌కు భారీగా స్వర్ణ పతకాలు లభిచాయి. శుక్రవారం జరిగిన పలు క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు ఆరు స్వర్ణాలు చేజిక్కించుకున్నారు. ఆర్చరీలో ఒకటి, బాక్సింగ్‌లో మూడు, రెజ్లింగ్‌లో ఒకటి, మహిళల హాకీ జట్టుతో కలిపి మొత్తం ఆరు స్వర్ణాలు కాగా.. ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన పతకాలు 76కు చేరగా.. పతకాల పట్టికలో భారత్ ఐదో స్థానంలో కొనసాగుతుంది.
ఆసియా క్రీడల్లో భారత్ పతకాలు
16 స్వర్ణాలు
25 రజతాలు
35 కాంస్యాలు