SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

WTC Points Table: WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు ఎదురుదెబ్బ.. ఫైనల్‌కు చేరాలంటే ఇలా చేయాల్సిందే..!

India WTC Qualification Scenario: న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్ మ్యాచ్‌ డ్రా కావడంతో భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉండగా.. కివీస్ మూడో స్థానంలో ఉంది. భారత్‌ ఫైనల్‌కు చేరాలంటే మిగిలిన అన్ని టెస్టు మ్యాచ్‌ల్లో గెలుపొందాల్సి ఉంటుంది.

Written By Ashok Krindinti
Published: Nov 23, 2026, 16:34 IST | Updated: Nov 23, 2026, 16:37 IST
Image Credit: India WTC Final Chances (Source: BCCI/X)
Join

India WTC Qualification Scenario: తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ బ్యాటర్లు అద్భుతంగా పోరాడి.. భారత్‌కు విజయం దక్కకుండా చేశారు. వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో గెలుపు ఖాయమనుకున్న పరిస్థితి నుంచి భారత్ డ్రాతో సరిపెట్టుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 352 పరుగుల భారీ ఆధిక్యం సాధించినా.. చివరి రోజు కివీస్ బ్యాటర్లను ఆలౌట్ చేయలేకపోయింది. ఈ ఫలితంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 ఫైనల్ రేసులో టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. పాయింట్ల పట్టికలో భారత్ నాలుగో స్థానంలోనే కొనసాగుతున్నా.. పాయింట్ల శాతం 51.52 నుంచి 50కి పడిపోయింది. అటు న్యూజిలాండ్ కూడా రెండో స్థానం నుంచి మూడో స్థానానికి దిగజారింది.

వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్టు ఐదు రోజుల పాటు ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. కేఎల్ రాహుల్ 136, రిషభ్ పంత్ 128 పరుగులతో భారీ స్కోర్లు సాధించారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 98 పరుగులతో తృటిలో సెంచరీ కోల్పోయాడు. యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్ కూడా అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు.

దీంతో భారత్ 9 వికెట్ల నష్టానికి 720 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కివీస్‌పై ఏకంగా 352 పరుగుల ఆధిక్యం సంపాదించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత బౌలర్లు ఆరంభంలో వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు. అయితే డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ భారత బౌలర్లకు అడ్డుగా నిలిచారు. వీరిద్దరూ చివరి వరకు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడటంతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 239 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

ఈ మ్యాచ్ డ్రా కావడంతో భారత్ ఖాతాలో మరో నాలుగు పాయింట్లు చేరాయి. అయినా పాయింట్ల శాతం తగ్గింది. ప్రస్తుతం టీమిండియా 12 టెస్టులు ఆడి ఐదు విజయాలు, నాలుగు ఓటములు, మూడు డ్రాలతో 72 పాయింట్లు సాధించింది. పాయింట్ల శాతం 50గా ఉంది. మరోవైపు న్యూజిలాండ్ కూడా డ్రాతో నాలుగు పాయింట్లు పొందింది. అయితే ఆ జట్టు పాయింట్ల శాతం 72.22 నుంచి 66.67కు పడిపోయింది. దీంతో రెండో స్థానం నుంచి మూడో స్థానానికి చేరింది. ఆస్ట్రేలియా రెండో స్థానాన్ని దక్కించుకుంది.

 

స్థానంజట్టుమ్యాచ్‌లుపాయింట్ల శాతం
1దక్షిణాఫ్రికా875.00%
2ఆస్ట్రేలియా1369.23%
3న్యూజిలాండ్766.67%
4భారత్1250.00%
5బంగ్లాదేశ్940.74%
6ఇంగ్లాండ్1638.54%
7వెస్టిండీస్1427.38%


టీమిండియా ఫైనల్‌కు చేరాలంటే..

భారత్‌కు WTC ఫైనల్ చేరే అవకాశాలు సంక్షిష్టంగా మారాయి. మిగిలిన ఆరు టెస్టుల్లోనూ కచ్చితంగా గెలుపొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు క్రైస్ట్‌చర్చ్‌లో జరగనుంది. ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కూడా భారత్ ఫైనల్ అవకాశాలను నిర్ణయించడంలో కీలకం కానుంది. మిగిలిన ఆరు టెస్టుల్లోనూ గెలిస్తే భారత్ పాయింట్ల శాతం 66.67కు చేరుతుంది. అయినా.. ఫైనల్ బెర్తు ఖాయమవుతుందని గ్యారంటీ లేదు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల ఫలితాలు కూడా భారత్‌కు అనుకూలంగా ఉండాల్సి ఉంటుంది. 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES