Hyderabad Water Imposed Fine: హైదరాబాద్ వాసులకు బిగ్ వార్నింగ్..ఈ పని చేస్తే రూ.5,000 జరిమానా..ఈరోజే అమల్లోకి!
Hyderabad Water Board Imposed Fine: ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు సరిగా కురవకపోవడంతో హైదరాబాద్ పరిధిలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి. ఈ క్రమంలో రానున్న తాగునీటి ఎద్దడిని నివారించడానికి హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై బోర్డు కఠిన ఆంక్షలను ప్రకటించింది. ట్యాంకర్ల ద్వారా నీటి వృథా జరిగితే నవంబర్ 1 నుంచి రూ. 5 వేల జరిమానా విధించడంతో పాటు.. రెండోసారి నిబంధనలు ఉల్లంఘిస్తే రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని హెచ్చరించింది.
Hyderabad Water Board Imposed Fine: ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం కారణంగా సరైన వర్షపాతం నమోదు కాకపోవడంతో నగరంలో భూగర్భ జలాలు గణనీయంగా అడుగంటాయి. గ్రేటర్ హైదరాబాద్‌కు తాగునీటిని అందించే కీలక వనరులైన సింగూరు, మంజీర రిజర్వాయర్లు ఇప్పటికే డెడ్ స్టోరేజ్ స్థాయికి చేరుకున్నాయి. వీటికి తోడు జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లలో కూడా నీటి మట్టాలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో నగరంలో తాగునీటికి తీవ్రమైన ఇబ్బందులు తప్పవని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
గల్లీ గల్లీలో జలమండలి చాటింపు..
ఈ విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై బోర్డు (జలమండలి) ముందస్తు చర్యలు చేపట్టింది. తాగునీరు వృథా కాకుండా అరికట్టేందుకు నగరవ్యాప్తంగా ప్రచారాన్ని వేగవంతం చేసింది. కాలనీలు, బస్తీలలో సౌండ్ బాక్సుల ద్వారా ప్రజలకు నీటి సంరక్షణ, పరిమిత వినియోగంపై అవగాహన కల్పిస్తూ అధికారులు చాటింపు వేయిస్తున్నారు.
కఠిన ఆంక్షలు.. భారీ జరిమానాలు
నీటి వృథాను అడ్డుకునేందుకు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ప్రత్యేక నిబంధనలను జారీ చేశారు. నవంబర్ 1వ తేదీ నుంచి నగరంలో ట్యాంకర్ల ద్వారా నీటిని వృథా చేస్తే సంబంధిత యజమానులకు రూ. 5,000 జరిమానా విధించనున్నారు. అదే ట్యాంకర్ రెండోసారి కూడా నిబంధనలు అతిక్రమిస్తే దాని రిజిస్ట్రేషన్‌ను శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించారు. నీటి లీకేజీలు ఉన్నా, సరైన మూతలు లేకపోయినా అలాంటి ట్యాంకర్లను ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద అనుమతించవద్దని ఆదేశించారు. లోపాలను పూర్తిగా సరిదిద్దే వరకూ నీటిని నింపరాదని, ట్యాంకర్ యజమానులు, డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
వినియోగదారులకూ హెచ్చరికలు
ట్యాంకర్లతో పాటు సాధారణ ప్రజలు కూడా నీటిని దుర్వినియోగం చేయకూడదని జలమండలి తేల్చిచెప్పింది. ఇళ్ల ముందు నీటిని అనవసరంగా పారబోసినా, వాహనాలు లేదా కార్లను కడగడానికి తాగునీటిని వినియోగించినా భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. సరఫరా అవుతున్న నీటిని అత్యంత జాగ్రత్తగా, పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.