By Election: 'మేము పోటీ చేస్తాం'.. ఖైరతాబాద్ ఉప ఎన్నికపై కవిత కీలక ప్రకటన
Kavitha Announces Our Party Will Contest In Khairatabad By Election: న్యాయస్థానాలు దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయడంతో త్వరలో రాబోతున్న ఖైరతాబాద్ ఉప ఎన్నికలో తాము కూడా పోటీ చేస్తామని మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. పరిపాలన చేతకాకపోతే రేవంత్ రెడ్డి తప్పుకోవాలని.. రేవంత్ రెడ్డిది చేతగానీ, ఫెయిల్యూర్ సర్కార్ అని విమర్శించారు.
Khairatabad By Election: 'ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ తరఫున పోటీ చేసేందుకు అనుమతించిన కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలి' అని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత పిలుపునిచ్చారు. లేదంటే రాజ్యాంగం, చట్టం అవసరం లేదని మనమే చెప్పినట్లు అవుతుందని పేర్కొన్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన తరఫున కచ్చితంగా పోటీ చేస్తామని కవిత ప్రకటించారు. రేవంత్ రెడ్డిది చేతగానీ.. ఫెయిల్యూర్ సర్కార్ అని.. పరిపాలన చేతకాకపోతే పక్కకు తప్పుకోవాలని రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్సీ కవిత సూచించారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పట్టిలేని తనంతో ఏటా 4 వేల మంది పసిపిల్లలు చనిపోతున్నారని చెప్పారు. విద్య, వైద్యం విషయంలో ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. అఫిడవిట్‌లో ఉన్న దానికన్నా రూపాయి ఎక్కువ ఉన్న తిరిగి ఇచ్చేస్తానని స్పష్టం చేశారు.
'ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో జరిగిన ఘటనపై బాధపడని వారుండరు. కేవలం ఈ ప్రభుత్వం పట్టిలేని తనం కారణంగానే పిల్లలు మాడిమసి అయ్యారు. వైద్యం, విద్య విషయంలో ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ రాష్ట్రంలో విద్య, వైద్య రంగాన్ని సరిచేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ విషయంలో ప్రజలంతా కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది' అని మాజీ ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
'ఆదిలాబాద్ ఘటన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్న పరిస్థితిపై ఒక మిత్రుడు డేటా పంపించాడు. ఆ డేటా చూసిన తర్వాత రెండు రోజుల పాటు నిద్రపట్టలేదు. అత్యంత భయంకరమైన చేదు వాస్తవాలు అందులో ఉన్నాయి' అని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్లు ఎందుకు ప్రభుత్వ హాస్పిటల్స్, హాస్టళ్లను విజిట్ చేయటం లేదని ప్రశ్నించారు. చిన్న జిల్లాలే కదా? మీరు విజిట్ చేస్తే పరిస్థితి మారుతుంది కదా? అని కవిత తెలిపారు. ఈ ప్రభుత్వానికి పరిపాలన చేతకాకపోతే రేవంత్ రెడ్డి పక్కకు తప్పుకోండి అని సూచించారు.
ఇంత మంది పిల్లలు చనిపోతే కనీసం మానవత్వం లేదా? అని రేవంత్ రెడ్డిని మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. 'ఇక నుంచి మేము ప్రతి జిల్లాలో గవర్నమెంట్ హాస్పిటల్‌కు వెళ్తాం. మీ ప్రాంతంలో ఉన్న ప్రతి హాస్పిటల్‌కు వెళ్లి అక్కడ పరిస్థితులను ఫొటోలు తీసి ప్రశ్నించాలని ప్రజలను, యువతను కోరుతున్నా' అని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు వెళ్లి స్కూళ్లలో చూడండి. బాత్రూమ్‌లు లేని స్కూల్స్ ఉంటే మనమే చందా వేసుకొని కట్టిద్దాం' అని కవిత సూచించారు. 'రేవంత్ రెడ్డిది చేతగానీ, ఫెయిల్యూర్ సర్కార్. విద్య, వైద్యం మీద ఫోకస్ చేస్తూ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తున్నాం' అని చెప్పారు.
తన ఫామ్‌హౌస్‌లో గజం భూమి కూడా కబ్జా భూమి లేదని మాజీ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఎఫ్టీఎల్‌లో కూడా లేదని తెలిపారు. చట్టానికి లోబడే ప్రతి పైసా సంపాదించుకున్నట్లు.. భవిష్యత్‌లోనూ అలాగే ఉంటానని తెలిపారు. అఫిడవిట్‌లో ఉన్న దానికన్నా రూపాయి ఎక్కువ చూపించినా వారికే ఆ ఆస్తి ఇచ్చేస్తానని ప్రకటించారు. రేవంత్ రెడ్డి పరిపాలన చేతకాక డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్, ఇంకో కేసు అంటూ సిట్ వేశారని.. ఆ తర్వాత ఏమైంది? ప్రశ్నించారు.