Palapitta: పాలపిట్ట బంధించడంపై కమిషనర్ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం.. కఠిన చర్యలకు ఆదేశం
Police Commissioner VC Sajjanar Warns On State Bird Palapitta: దసరా పండుగ సందర్భంగా రాష్ట్రపక్షి పాలపిట్టను చూడడం శుభసూచికంగా భావిస్తారు. అయితే ఆ పక్షిని బంధించడం నేరమని.. బంధించిన వారికి పోలీస్ కమిషనర్ హెచ్చరిక జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు సజ్జనార్ కీలక సూచనలు చేశారు.
State Bird Palapitta: దసరా పండుగ సందర్భంగా తెలంగాణలో పాలపిట్టను చూడడం సంప్రదాయం. దసరా పండుగను పురస్కరించుకుని కొందరు పాలపిట్టను బంధించి చూడడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర పక్షిగా ఉన్న పాలపిట్టను బంధించడం.. వేధింపులకు పాల్పడడం నేరంగా పరిగణిస్తారు. చట్టపరంగా శిక్షార్హం. దీంతో ఈ మేరకు ప్రజలకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు.
పాలపిట్టను బంధించడంపై 'ఎక్స్' వేదికగా సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. 'ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరాల్సిన తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టను దసరా వేళ కొందరు స్వార్థం కోసం ఇనుప బోనుల్లో బంధించారు. మూగజీవులను హింసిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని మేం ముందుగానే స్పష్టంగా హెచ్చరించినప్పటికీ కొందరు పెడచెవిన పెట్టి ఆ నిస్సహాయ పక్షులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు' అని సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు.
'అప్రమత్తమైన పౌరుల నుంచి అందిన పక్కా సమాచారంతో హైదరాబాద్ సిటీ పోలీసులు తక్షణమే స్పందించి మూడు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు జరిపి మొత్తం 4 పాలపిట్టలను ప్రాణాలతో కాపాడారు' అని ఆ వీడియో సజ్జనార్ పంచుకున్నారు. హైదరాబాద్ లంగర్‌హౌస్ బాపుఘాట్ సమీపంలోని ఆలయం వద్ద ఇరుకైన బోనుల్లో నరకయాతన అనుభవిస్తున్న రెండు పాలపిట్టలను విడిపించి కేబీఆర్ పార్క్ అటవీ అధికారులకు అప్పగించినట్లు వివరించారు. ఛత్రినాక చిత్రగుప్త స్వామి ఆలయం వద్ద చెట్టుకు బోను వేలాడదీసి నిర్బంధించిన ఒక పాలపిట్టను, మంగళహాట్ బాలాజీనగర్ గుడి సమీపంలో బోనులో ఉంచిన మరో పాలపిట్టను కాపాడి అటవీ అధికారులకు అప్పగించినట్లు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. బాధ్యులపై అటవీ శాఖ సమన్వయంతో కఠిన చట్టపరమైన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
'దసరా పండుగ పేరుతో ఒక నిస్సహాయ పక్షిని బంధించి ఆహారం, నీళ్లు లేకుండా చిత్రహింసలకు గురిచేసి చూడడం ఎవరికీ మంచి చేయదు. ఇది మన సమాజానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు' అని కమిషనర్ సజ్జనార్ హితవు పలికారు. ప్రాణభయంతో బోను చువ్వల మధ్య విలవిల్లాడుతున్న పక్షి రోదనలో శుభం ఎలా కనిపిస్తుంది? నిజమైన భక్తి అంటే జీవకారుణ్యమే తప్ప, ప్రకృతిని బందీ చేయడం కాదు! తెలిపారు. మూగప్రాణుల స్వేచ్ఛను హరిస్తూ.. కాసుల వేటకు తెరలేపే ఇలాంటి అమానవీయ పోకడలను ఎవరూ ప్రోత్సహించవద్దని సూచించారు. వన్యప్రాణులకు హాని తలపెట్టే ఘటనలు ఎక్కడ కనిపించినా వెంటనే టోల్‌ఫ్రీ నంబర్లు 18004255364, 9803338666 లేదా డయల్ 112 కు సమాచారం అందించి బాధ్యతాయుత పౌరులుగా వ్యవహరించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.