SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

జేబులు గుల్ల చేస్తున్న వైద్య, విద్యా ఖర్చులు.. తెలంగాణలో ఆందోళనకర పరిస్థితి..!!

Private School Fees Telangana: తెలంగాణలో పెరుగుతున్న జీవన వ్యయం, వైద్య, విద్యా రంగాల భారం సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌ను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు, వైద్య ఖర్చులు, ప్రైవేట్ విద్య ప్రాభవం.. మారుతున్న ఆహారపు అలవాట్లపై వెలువడిన నివేదిక ప్రకారం పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

Written By Bhoomi
Published: Oct 22, 2026, 02:56 PM IST | Updated: Oct 22, 2026, 02:58 PM IST
Image Credit: Private School Fees Telangana
Join

Private School Fees Telangana: తెలంగాణలో పెరుగుతున్న జీవన వ్యయం, వైద్య, విద్యా రంగాల భారం సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌ను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు, వైద్య ఖర్చులు, ప్రైవేట్ విద్య ప్రాభవం.. మారుతున్న ఆహారపు అలవాట్లపై వెలువడిన నివేదిక ప్రకారం పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

తెలంగాణలో ప్రైవేట్ వైద్య విద్య ఖర్చు పెరగడం వల్ల సామాన్య కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. పట్టణ ప్రాంతాల్లో తలసరి సగటు నెలసరి ఖర్చు రూ. 8,978 కాగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇది రూ.5,435గా ఉంది. ఈ రెండు గణాంకాలూ జాతీయ సగటు కంటే 28 నుంచి 32 శాతం అధికం. పట్టణవాసులలో సగం మంది నెలకు రూ.7,745 కంటే తక్కువ ఖర్చు చేస్తుండగా... అత్యధికంగా ఖర్చు చేసే 10 శాతం మంది రూ.13,923 కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారు.

పేదరిక రేఖకు దిగువన ఉన్న 10 శాతం మంది కేవలం రూ.4,844 కంటే తక్కువ ఖర్చు చేయడం గమనార్హం. తెలంగాణలోని వైద్య రంగంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఆసుపత్రి బిల్లులు ప్రజల జేబులను ఖాళీ చేస్తున్నాయి. రాష్ట్రంలో ఒక్కసారి ఆసుపత్రిలో చేరడానికి అయ్యే సగటు ఖర్చు రూ.52,743 కాగా, ఇది జాతీయ సగటు అయిన రూ.37,858 కంటే దాదాపు 40 శాతం ఎక్కువగా ఉంది. భీమా లేదా ప్రభుత్వ పథకాలు లేకపోతే, రోగి కుటుంబం సొంతంగా రూ.46,316 చెల్లించాల్సి వస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రులతో పోలిస్తే ప్రైవేట్ ఆరోగ్య సంరక్షణ 12 రెట్లు ఖరీదైనదిగా మారింది. రాష్ట్ర బడ్జెట్‌లో ఆరోగ్య సంరక్షణపై కేవలం 4.6 శాతం, జీఎస్‌డీపీలో కేవలం ఒక శాతం మాత్రమే ఖర్చు చేస్తుండటంతో, ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించక తప్పడం లేదు.

గణాంకాల ప్రకారం.. ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజుల వల్ల పిల్లల చదువుపై కుటుంబాలు పెట్టే ఖర్చు గణనీయంగా పెరిగింది. 2016-17లో రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల వాటా 53.4 శాతంగా ఉండగా, 2025-26 నాటికి ఇది 64.5 శాతానికి చేరుకుంటుందని అంచనా. ప్రభుత్వ పాఠశాలల వాటా 43.9 శాతం నుంచి 34.5 శాతానికి పడిపోయింది. ఒక్క సంవత్సరంలోనే 1,969 ప్రభుత్వ పాఠశాలలు మూతపడగా, 771 కొత్త ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభమయ్యాయి.

రాష్ట్రంలో ఒక్కో విద్యార్థికి పాఠశాల విద్య కోసం అయ్యే సగటు ఖర్చు సంవత్సరానికి రూ.20,590 కాగా, ఇది జాతీయ సగటు అయిన రూ.12,616 కన్నా 63 శాతం ఎక్కువ. ప్రభుత్వ పాఠశాలలో వార్షిక ఖర్చు రూ.2,863 కాగా, పట్టణ కుటుంబాలలో ఇది రూ.10,000గా ఉంది. ఆహారేతర ఖర్చులో విద్య వాటా 12.79 శాతంగా ఉంది. ఆహారపు అలవాట్లలో కూడా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

గ్రామీణ కుటుంబాల ఖర్చులో ఆహారం వాటా 49.4 శాతం నుండి 48.9 శాతానికి, పట్టణ కుటుంబాలలో 40.4 శాతం నుండి 38.8 శాతానికి తగ్గింది. పట్టణ కుటుంబాలు ప్రతి రూ.100లో రూ.61 ​​ఆహారేతర అవసరాలపై ఖర్చు చేస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లోని కుటుంబాలు ఇంట్లో తినే భోజనాల సంఖ్య సంవత్సరానికి 262 నుండి 232కి తగ్గింది. పట్టణ కుటుంబాల ఆహార బడ్జెట్‌లో మూడింట ఒక వంతు. అంటే 33.63 శాతం, పానీయాలు, ప్యాక్ చేసిన ఆహారం.. హోటల్ భోజనాలకే కేటాయిస్తున్నారు. వేగవంతమైన జీవనశైలి.. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ఈ మార్పునకు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES