Telangana SSC Inter Board Merger: తెలంగాణలో ఎస్సెస్సీ, ఇంటర్ బోర్డు విలీన ప్రక్రియ ప్రస్తుతం అనిశ్చితిలో పడినట్లు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నూతన విద్య విధాన మార్గదర్శకాలను అనుసరించి 8వ తరతగతి నుంచి ఇంటర్ వరకు ఒకే విద్యా సంక్లిష్టంగా నిర్వహించాలని ప్రభుత్వం మొదట భావించింది. ప్రత్యేకంగా ఉండే రెండేళ్ల ఇంటర్ వ్యవధి వల్ల విద్యావ్యవస్థ కొద్దిపాటి కార్పొరేట్ విద్యాసంస్థల చేతుల్లో బంధీ అవుతుందని.. టెన్త్ తర్వాత డ్రాప్ అవుట్లు పెరగడమే కాకుండా ఇంటర్ లో ఉత్తీర్ణత శాతం భారీగా పడిపోతోందని విద్యాశాఖ విశ్లేషించింది.
ఈ సంస్కరణతో విద్యార్థుల అభ్యసన నిలకడగా సాధించవచ్చని భావించిన ప్రభుత్వం.. గతంలోనే విలీన ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. విద్యాశాఖ సమగ్ర నివేదికను రూపొందించి న్యాయశాఖ పర్మిషన్ కూడా తీసుకుంది. అయితే అధికారుల జాప్యంతో వాయిదా పడుతూ వచ్చిన ఈ కీలక ఫైల్.. ప్రస్తుతానికి సీఎం పరిశీలనలో నిలిచిపోయింది.
అయితే విలీన ప్రతిపాదనను ఇంటర్ బోర్డు అధికారులు, అధ్యాపక సంఘాలు తీవ్రంగా అడ్డుకుంటున్నాయి. ఇటీవల పాలిటెక్నిక్ విద్యను స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి మార్చుతూ.. ఇచ్చిన జీవోపై నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం వెనక్క తగ్గింది. అదే తరహాలోనే ఇంటర్ బోర్డు విలీనంపై కూడా బలవంతంగా నిర్ణయం తీసుకున్నట్లయితే రాజకీయంగా ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు.. భాగస్వామ్య వర్గాలను ఒప్పించిన అనంతరం నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుత పరిణామాల ద్రుష్టా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోకపోవడంతో.. 2027-28 విద్యాసంవత్సరంలో కూడా ఈ బోర్డుల విలీనం అమల్లోకి రావడం కష్టమేనని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
విలీనానికి సర్కార్ చూపుతున్న ప్రతిపాదనలను సరికావని.. కార్పొరేట్ సంస్క్రుతి అనేది దేశవ్యాప్తంగా ఉన్న సమస్య అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి విధానాన్ని అమలు చేసినప్పటికీ.. ఆశించిన మేర మెరుగైన ఫలితాలు రాలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ గురుకులాలతో పోల్చితే.. సాధారణ ఇంటర్ కాలేజీలకు కనీస బడ్జెట్ కేటాంయిపులు చాలా తక్కువని.. సరైన వసతులు కల్పిస్తే ఫలితాలు సాధించవచ్చని ఇంటర్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇంటర్ విద్యలో లోపాలు ఉన్నట్లయితే సరిదిద్దాలి కానీ.. వ్యవస్థనే లేకుండా చేయడం సరికాదంటున్నారు.