Work From Park Hyderabad: రోజంతా ఇళ్లలోనే ఉండి.. నాలుగు గోడల మధ్య వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి బోర్ కొట్టిన ఐటీ ఉద్యోగులకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులు ఉక్కబోత గదుల నుంచి బయటకు వచ్చి.. ఆహ్లాదకరమైన పచ్చదనంతో కూడిన ప్రకృతి వాతావరణంలో, పార్కుల నుంచే తమ ఆఫీస్ పనులు ప్రశాంతంగా పూర్తి చేసుకునేందుకు వీలుగా వర్క్ ఫ్రమ్ పార్క్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు సరికొత్త ప్రాజెక్ట్ వివరాలను శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎంసీ కమిషనర్ జి.సృజన అధికారికంగా వెల్లడించారు.
నగరంలో వర్క్ ఫ్రం హోం సంస్క్రుతి పెరగడంతో.. ఉద్యోగులకు ప్రశాంతమైన వాతావరణం కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్టు రూపొందించినట్లు ఆమె తెలిపారు. దుబాయ్ లో ఇటీవల ప్రారంభమైన ఈ తరహా థీమ్ ను స్పూర్తిగా తీసుకుని.. దేశంలోనే తొలిసారిగా సైబరాబాద్ లో దీన్ని అమలు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. సాధారణంగా ఉదయం, సాయంత్రం వాకింగ్ కోసం ఉపయోగించే పార్కులను పగటిపూట కూడా ఇలా ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
శెరిలింగంపల్లి జోన్‌లోని మజీద్‌బండ మాధవ హిల్స్ కాలనీ పార్కులో.. కూకట్‌పల్లి జోన్‌లోని మాదాపూర్‌లో మరో పార్కులో పైలట్ ప్రాజెక్ట్ కింద పనులు ప్రారంభమయ్యాయని కమిషనర్ తెలిపారు. ఈ పార్కులలో ఉద్యోగులు తమ ల్యాప్‌టాప్‌లపై పనిచేయడానికి ప్రత్యేక డెస్కులు, కుర్చీలు, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పాయింట్లు, హై-స్పీడ్ వైఫై, కో-వర్కింగ్ సీటింగ్, స్టార్టప్ మీటింగ్ హాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. భద్రత కోసం సీసీటీవీ కెమెరాలతో పాటు, అల్పాహారం కోసం ఒక కేఫ్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు.
ఈ సౌకర్యాల నిర్వహణ కోసం వినియోగదారుల నుండి నామమాత్రపు రుసుము వసూలు చేస్తామని ఆయన తెలిపారు. జనవరి 1వ తేదీ నాటికి ఈ రెండు పార్కులను ప్రారంభించడమే లక్ష్యమని పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, రాబోయే రోజుల్లో ఈ సదుపాయాన్ని మరో 30 నుంచి 40 పార్కులకు విస్తరిస్తామని సృజన తెలిపారు. అంతేకాకుండా, కార్పొరేషన్ పరిధిలోని 770 ఖాళీ ప్లాట్లను ఆక్రమణల నుంచి కాపాడతామని, వాటిలో 300 ప్లాట్లను సంక్రాంతి నాటికి పూర్తిస్థాయి పార్కులుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.