"విద్యా వ్యవస్థలో సంస్కరణలు కాగితాలకే పరిమితం కావొద్దు".. జీతెలుగు వేదికగా కేకే కీలక వ్యాఖ్యలు..!!
Zee Telugu Guruvandanam: సమాజంలో గురువులకు ఉన్న స్థానం ఎంతో గొప్పదన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు.. సీనియర్ నేత కే.కేశవరావు. భావితరాలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బృహత్తర బాధ్యత ఉపాధ్యాయుల పై ఉందన్నారు.
Zee Telugu Guruvandanam: సమాజంలో గురువులకు ఉన్న స్థానం ఎంతో గొప్పదన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు.. సీనియర్ నేత కే.కేశవరావు. భావితరాలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బృహత్తర బాధ్యత ఉపాధ్యాయుల పై ఉందన్నారు. హైదరాబాద్ లో జీతెలుగు న్యూస్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ అండ్ టీచర్స్ అవార్డ్స్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని దిశానిర్దేశం చేశారు. తల్లిదండ్రులు మనకు జన్మను ఇస్తే.. ప్రపంచాన్ని పరిచయం చేసి సరైన మార్గంలో నడిపించేది గురువేనని కేకే కొనియాడారు.
సమాజంలో ఎన్ని మార్పులు వచ్చినా.. ఏ రంగంలో ఎంత అభివ్రుద్ధి సాధించినా.. దానికి మూలం విద్య మాత్రమేనని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఉపాధ్యాయులు తమ వ్రుత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ.. విద్యార్థుల్లో కేవలం పుస్తక జ్నానమే కాకుండా నైతిక విలువలను..సామాజిక స్ప్రుహను పెంపొందించాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రభుత్వాలు ఎటువంటి మార్పులు తీసుకువచ్చినా.. అవి కేవలం కాగితాల మీద.. జీవోల రూపంలోనే లేదంటే ప్రకటనల రూపంలో ఉండిపోతే సరిపోదని.. క్షేత్రస్థాయిలో ఆచరణలో వచ్చినప్పుడే అసలైన మార్పు సాధ్యం అవుతుందన్నారు. విద్యా రంగంలో గుణాత్మక మార్పులకోసం కేవలం చర్చలు సరిపోవని..చిత్తశుద్ధితో కూడిన అమలు ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రభుత్వాలు మారినప్పటికీ.. విద్యారంగానికి పెద్ద పీటవేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో విద్య గుణాత్మక అభివ్రుద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఉపాధ్యాయుల సహకారం ఎంతో కీలకమని కేకే అభిప్రాయపడ్డారు. టీచర్లను సన్మానించి గౌరవించడం ద్వారా సమాజం గొప్ప సంస్క్రుతిని చాటుకుంటుందన్నారు. ఇలాంటి సత్కారాలు చేపట్టిన జీ తెలుగు యాజమాన్యాన్ని నిర్వాహకులను కేకే అభినందించారు.