SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

One Way Traffic: హైదరాబాద్‌వాసులకు బిగ్‌ అలర్ట్‌.. 22న లక్డీకాపూల్‌లో వన్‌ వే ట్రాఫిక్‌ ట్రయల్‌ రన్‌

One Way Traffic Trail Will Implement On 22nd November: ట్రాఫిక్‌ రద్దీతో సతమతమవుతున్న హైదరాబాద్‌ ప్రజలకు బిగ్‌ అలర్ట్‌. నగరంలో మరో చోట వన్‌వే ట్రాఫిక్‌ విధానం అమలు చేయనున్నారు. ట్రాఫిక్‌ రద్దీ ఉన్న లక్డీకాపూల్‌ ప్రాంతంలో వాహనదారులను ఒక వైపు మాత్రమే వాహనాలను అమలు చేయనున్నారు. ఈ మేరకు ట్రాఫిక్‌ పోలీసులు కీలక ప్రకటన చేశారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 09, 2026, 10:29 PM IST | Updated: Nov 09, 2026, 10:34 PM IST
Image Credit: Lakdikapool One Way Traffic
Join

Lakdikapool One Way Traffic Trail: హైదరాబాద్‌లో అత్యంత ర‌ద్దీగా ఉండే ప్రాంతంలో కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ వన్‌వే ట్రాఫిక్‌ విధానం అమలు చేయగా.. ఇప్పుడు మరో ప్రాంతంలో కూడా వన్‌వే ట్రాఫిక్‌ విధానం అమలు చేస్తామని ట్రాఫిక్‌ పోలీసులు ప్రకటించారు. నగరంలోనే కీలకమైన లక్డీకాపూల్‌లో ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు అధిగమించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు వన్‌వే ట్రాఫిక్‌ విధానం అమలు చేయనున్నారు. వన్‌వే ట్రాఫిక్‌ విధానంపై ట్రాఫిక్‌ పోలీసులు కీలక ప్రకటన చేశారు. రవీంద్రభారతి – లక్డీకాపూల్ – ఇక్బాల్ మినార్ జంక్షన్ల మధ్య ప్రతిపాదిత వన్ వే విధానాన్ని నవంబర్ 22వ తేదీ ఆదివారం ఒక రోజు పాటు ప్రయోగాత్మకంగా ట్రయల్ రన్ అమలుచేస్తామని ట్రాఫిక్‌ పోలీసులు ప్రకటించారు.

కొత్త ట్రాఫిక్ విధానం అమలుపై అవసరమైన క్షేత్రస్థాయి ఏర్పాట్లు, రోడ్డు ఇంజినీరింగ్ పనులను పరిశీలించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఇద్దరూ కలిసి సోమవారం బైక్‌పై క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. వన్‌వే ట్రాఫిక్‌ విధానంపై టీజీఎస్పీడీసీఎల్, వాట‌ర్ బోర్డు, ఆర్టీసీ త‌దిత‌ర విభాగాల అధికారుల‌తో క‌లిసి స్వయంగా ప‌రిశీలించారు. ఈ సందర్భంగా లక్డీకాపూల్, ఇక్బాల్ మీనార్, ర‌వీంద్ర‌భార‌తి, ఓల్డ్ కంట్రోల్ రూం, హెచ్‌డీఎఫ్‌సీ, పాత సైఫాబాద్ పీఎస్ త‌దిత‌ర జంక్ష‌న్ల‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

ఈ పర్యటనలో అడిషనల్ సీపీ (ట్రాఫిక్) జోయల్ డేవిస్, ట్రాఫిక్-1 డీసీపీ అవినాశ్‌ కుమార్, ఖైరతాబాద్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ మోహన్ కుమార్‌తోపాటు జీహెచ్‌ఎంసీ, ఆర్టీసీ, టీజీఎస్పీడీసీఎల్, వాట‌ర్ బోర్డు తదితర విభాగాల ఉన్నతాధికారులతో కలిసి కమిషనర్‌ సజ్జనార్‌ సమీక్ష చేశారు. వన్ వే విధానంలో వాహనాలు ఎలాంటి అడ్డంకులు లేకుండా సజావుగా సాగేందుకు కూడళ్ల రీ-డిజైనింగ్‌తో పాటు భారీ ఇంజినీరింగ్ మార్పులు చేపట్టాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది.

వాహనాల దారి మళ్లింపు ఇలా
==> కొత్త ట్రాఫిక్ విధానంలో భాగంగా ప్రతిపాదించిన మార్గాల ప్రకారం ఓల్డ్ కంట్రోల్ రూం నుంచి వైపు నుంచి రవీంద్రభారతి మీదుగా ఇక్బాల్‌మీనార్ వైపునకు వాహనాలు నేరుగా వెళ్లేందుకు అనుమతించరు. వీటిని రవీంద్రభారతి వద్ద మళ్లించి హెచ్‌డీఎఫ్‌సీ జంక్షన్, పాత సైఫాబాద్ పీఎస్, ఇక్బాల్‌మీనార్, సచివాలయం జంక్షన్ మీదుగా సికింద్రాబాద్ తదితర గమ్యస్థానాల వైపు అనుమతిస్తారు.

==> నిరంకారి జంక్షన్ వైపు నుంచి హెచ్‌డీఎఫ్‌సీ, రవీంద్రభారతి మీదుగా ఓల్డ్ కంట్రోల్ రూం వైపు వెళ్లే వాహనాలను నేరుగా హెచ్‌డీఎఫ్‌సీ వైపు వాహనాలు వెళ్లనివ్వరు. పాత సైఫాబాద్ పీఎస్ నుంచి ఇక్బాల్ మీనార్ వైపు వెళ్లి అక్కడ రైట్ టర్న్ తీసుకొని రవీంద్రభారతి మీదుగా ఓల్డ్ కంట్రోల్ రూం వైపు వెళ్లాల్సి ఉంటుంది.

==> లక్డీకాపూల్‌ ప్రాంతంలో రాకపోకల విధానంలో మార్పుతో స్థానిక ప్రజల దినచర్యపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేందుకు ట్రయల్ రన్‌కు ముందే స్థానిక వ్యాపారులు, నివాసితులు, నిత్య ప్రయాణికులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు. వారి నుంచి వచ్చే సలహాలు, సూచనలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని అవసరమైన మార్పులు చేపడతారు.

==>  నవంబర్ 22వ తేదీన నిర్వహించే ఈ ఒక్క రోజు ట్రయల్ రన్ సమయంలో వాహనాల రద్దీ తీవ్రత, ప్రయాణ సమయం, కూడళ్ల పనితీరు, భద్రతా ప్రమాణాలకు సంబంధించిన సమగ్ర డేటాను నిపుణులతో సేకరించి క్షేత్రస్థాయిలో విశ్లేషించనున్నారు. ప్రజా శ్రేయస్సు, ట్రాఫిక్ నిరంతరాయంగా సాగేందుకు అనుగుణంగా ప్రజల ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే ఈ విధానం కొనసాగింపుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఈ సందర్భంగా వన్‌వే ట్రాఫిక్‌ విధానంపై నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ కీలక వివరాలు వెల్లడించారు. లక్డీకాపూల్‌లో ఏళ్ల తరబడి ఎదురవుతున్న తీవ్ర ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం చూపేందుకు సమగ్ర అధ్యయనంతో ఈ వన్ వే విధానం రూపొందించినట్లు తెలిపారు. జంక్షన్ల వద్ద వాహనాలు ఎక్కువసేపు నిరీక్షించాల్సిన అవసరం లేకుండా నిరంతరాయంగా కదిలేలా చేయడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. వన్‌వే విధానంతో ప్రయాణ సమయం, ఇంధనం ఆదా అవుతుందని.. దీనిద్వారా ప్రమాదాల తీవ్రత తగ్గుతుందని తెలిపారు. నవంబర్ 22వ తేదీన ఒక్క రోజు ట్రయల్ రన్‌లో అమలుతో ట్రాఫిక్ ప్రవాహం, వేగం, భద్రతపై వచ్చే సాంకేతిక డేటాను నిశితంగా పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం ప్రకటిస్తామని కమిషనర్‌ సజ్జనార్‌ చెప్పారు. వన్‌వే ట్రాఫిక్‌ విధానంతో నగర ప్రజలంతా సంపూర్ణంగా సహకరించాలని కోరారు.

ప్రజలు సహకరించాలి: జీహెచ్ఎంసీ కమిషనర్
ట్రాఫిక్ పోలీసుల సాంకేతిక ప్రణాళికకు అనుగుణంగా వన్ వే మార్గాల్లో అవసరమైన రోడ్డు ఇంజినీరింగ్ మార్పులను జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. వాహనాలు సాఫీగా తిరిగేందుకు రోడ్లను సిద్ధం చేయడంతోపాటు గుంతలు లేని రోడ్లు, రాత్రివేళల్లో దారి స్పష్టంగా కనిపించేలా విద్యుద్దీపాలు, పెద్ద సైన్‌బోర్డుల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేస్తామని వెల్లడించారు. వాహనదారులకు సాఫీ ప్రయాణ అనుభూతిని అందించేలా అన్ని మౌలిక వసతులను సిద్ధం చేస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కర్ణన్‌ వివరించారు. కూడళ్ల వద్ద ట్రాఫిక్ చిక్కులను తగ్గించి నవంబర్ 22వ తేదీన నిర్వహించే ఈ ఒక్కరోజు ట్రయల్ రన్‌కు వాహనదారులు.. ప్రజలు సంపూర్ణంగా సహకరించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ విజ్ఞప్తి చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES