Hyderabad Hotel Industry: బిర్యానీ నుంచి బిజినెస్ హోటళ్ల వరకు.. హైదరాబాద్‌లో కొత్త ట్రెండ్
Hyderabad Hotel Industry: హైదరాబాద్ అంటేనే ఆతిథ్యానికి పెట్టింది పేరు. ఒకప్పుడు ప్రయాణికులకు వసతి కల్పించడానికే పరిమితమైన హోటళ్లు.. ఇప్పుడు పర్యాటకం, ఉపాధి, వ్యాపారం, సంస్కృతి, ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. హైదరాబాద్‌లో హోటల్ ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం..
Hyderabad Hotel Industry: హైదరాబాద్‌లో హోటల్ ఇండస్ట్రీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు ప్రయాణికులకు బస కల్పించడానికే పరిమితమైన ఈ రంగం.. ఇప్పుడు ఉపాధి, పర్యాటకం, వ్యాపారం, స్థానిక సంస్కృతితో ముడిపడింది. ఐటీ కారిడార్ల విస్తరణ, అంతర్జాతీయ పర్యాటకుల రాక, ఆధునిక జీవనశైలి హోటళ్ల నిర్వహణ తీరునే మార్చేస్తున్నాయి. ఈ పరిణామాలు నగర ఆర్థిక వ్యవస్థతో పాటు యువతకు అందుబాటులోకి వస్తున్న అవకాశాలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో CAIIHM బాల్కంపేట క్యాంపస్ రూమ్స్ డివిజన్ HOD వాణి కొడమంచిలి విశ్లేషించారు. హైదరాబాద్‌లో గత కొన్నేళ్లుగా చోటుచేసుకుంటున్న మార్పులు హోటల్ పరిశ్రమపైనా ప్రభావం చూపుతున్నాయని అన్నారు. నగరం ఐటీ, వ్యాపార, పర్యాటక కేంద్రంగా విస్తరిస్తుండటంతో హాస్పిటాలిటీ రంగంలో కొత్త అవసరాలు ఏర్పడుతున్నాయన్నారు. ఒకప్పుడు ప్రయాణికులకు వసతి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఉన్న హోటళ్లు.. ఇప్పుడు వ్యాపార సమావేశాలు, పర్యాటక కార్యకలాపాలు, ఆహార సంస్కృతి, సామాజిక పరస్పర సంబంధాలకు వేదికలుగా మారుతున్నాయని చెప్పారు. సంప్రదాయ ఆతిథ్య విలువలను కొనసాగిస్తూనే ఆధునిక అవసరాలకు అనుగుణంగా మారడం ఈ రంగానికి కీలకంగా మారిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌కు ఆతిథ్య రంగంలో ప్రత్యేకమైన నేపథ్యం ఉంది. అతిథులను ఆప్యాయంగా స్వాగతించే 'మెహమాన్ నవాజీ' సంప్రదాయం నగర సంస్కృతిలో భాగం. కాలంతో పాటు హోటళ్ల రూపం, సేవలు మారినా ఈ ఆతిథ్య భావన ఇప్పటికీ కొనసాగుతోంది. చార్మినార్, పాతబస్తీ ప్రాంతాలు చారిత్రక కట్టడాలు, సంప్రదాయ వంటకాలు, సంస్కృతిపై ఆసక్తి ఉన్న పర్యాటకులను ఆకర్షిస్తుండగా.. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాల్లో వ్యాపార అవసరాలకు అనుగుణంగా హోటల్ సేవలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఒకే నగరంలో హెరిటేజ్ హోటళ్లు, బిజినెస్ హోటళ్లు, లగ్జరీ వసతి కేంద్రాలు, సర్వీస్డ్ అపార్ట్‌మెంట్లు వంటి విభిన్న సదుపాయాలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఇతర రంగాల్లోనూ..
హోటల్ పరిశ్రమ గురించి మాట్లాడినప్పుడు చాలామందికి గుర్తొచ్చేది రిసెప్షన్, రూమ్ సర్వీస్, రెస్టారెంట్ సేవలు మాత్రమే. కానీ ఒక హోటల్ సమర్థంగా పనిచేయడానికి అనేక విభాగాల సమన్వయం అవసరం. ఫ్రంట్ ఆఫీస్, హౌస్‌కీపింగ్, ఫుడ్ ప్రొడక్షన్, ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్, సేల్స్, మార్కెటింగ్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్సెస్, ఇంజినీరింగ్, సెక్యూరిటీ వంటి విభాగాలు ఇందులో కీలకంగా ఉంటాయి. దీని ప్రభావం హోటళ్లకే పరిమితం కాదు. ఆహార పదార్థాలను సరఫరా చేసే రైతులు, వ్యాపారులు, రవాణా సంస్థలు, లాండ్రీ సర్వీసులు, పూల వ్యాపారులు, ఈవెంట్ నిర్వాహకులు కూడా ఈ రంగంపై ఆధారపడుతున్నారు. అంటే హోటల్ పరిశ్రమ అభివృద్ధి చెందితే దాని చుట్టూ ఉన్న చిన్న వ్యాపారాలు, సేవా రంగాలకు కూడా అవకాశాలు ఏర్పడతాయి.
ముఖ్యంగా యువతకు ఈ రంగం ఉద్యోగ అవకాశాలతో పాటు ప్రొఫెషనల్ స్కిల్స్ నేర్చుకునే వేదికగా నిలుస్తోంది. కమ్యూనికేషన్, కస్టమర్ రిలేషన్స్, టీమ్ మేనేజ్‌మెంట్, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం వంటి నైపుణ్యాలు హాస్పిటాలిటీ ఉద్యోగాల్లో ఎంతో అవసరం.
ఆహార సంస్కృతి..
ఒక నగరాన్ని అక్కడి ఆహార సంస్కృతి కూడా ప్రత్యేకంగా నిలబెడుతుంది. హైదరాబాద్ బిర్యానీ, హలీమ్, కబాబ్స్, సంప్రదాయ స్వీట్లు, ఇరానీ చాయ్ వంటి వంటకాలు నగరానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఈ రుచులను ఆస్వాదించాలనే ఆసక్తి చూపుతుంటారు. ఈ నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లు స్థానిక వంటకాలను విస్తృతంగా పరిచయం చేసే వేదికలుగా మారుతున్నాయి. అదే విధంగా స్థానిక కళలు, హస్తకళలు, పండుగలు, సంప్రదాయాలను కూడా హాస్పిటాలిటీ రంగం ద్వారా పర్యాటకులకు పరిచయం చేయవచ్చు. ఇది పర్యాటక అనుభవాన్ని మెరుగుపరచడమే కాకుండా నగర సాంస్కృతిక గుర్తింపును నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది.
హైదరాబాద్‌కు వచ్చే అతిథులందరి అవసరాలు ఒకేలా ఉండవు. కొందరు చారిత్రక ప్రదేశాలను సందర్శించడానికి వస్తే, మరికొందరు వ్యాపార సమావేశాలు, సదస్సులు, ఎగ్జిబిషన్లలో పాల్గొనేందుకు వస్తుంటారు. విద్య, వైద్యం, కుటుంబ పర్యటనలు కూడా నగరానికి వచ్చే సందర్శకులకు కారణాలుగా ఉన్నాయి. ఐటీ, వ్యాపార రంగాల విస్తరణతో కార్పొరేట్ సమావేశాలు, కాన్ఫరెన్స్‌లు, వివాహ వేడుకలు వంటి కార్యక్రమాలకు అనువైన వసతి, ఆహార, ఈవెంట్ సదుపాయాల అవసరం పెరుగుతోంది. ఈ పరిణామాలు హోటల్ పరిశ్రమకు కొత్త వ్యాపార అవకాశాలను సృష్టిస్తున్నాయి. అదే సమయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన హాస్పిటాలిటీ సదుపాయాలు నగర పర్యాటక సామర్థ్యాన్ని మరింత పెంచగలవు.
హోటల్ రంగంలో ఇప్పుడు టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. ఆన్‌లైన్ రిజర్వేషన్లు, డిజిటల్ చెల్లింపులు, మొబైల్ అప్లికేషన్లు, కాంటాక్ట్‌లెస్ సర్వీసులు, స్మార్ట్ రూమ్ సదుపాయాలు అతిథుల అనుభవాన్ని మార్చేస్తున్నాయి. గతంలో రిసెప్షన్ వద్ద గంటల తరబడి జరిగే కొన్ని పనులు ఇప్పుడు డిజిటల్ విధానాలతో వేగంగా పూర్తవుతున్నాయి. అయితే సాంకేతికత ఒక్కటే మంచి హాస్పిటాలిటీకి కొలమానం కాదని వాణి కొడమంచిలి అభిప్రాయపడుతున్నారు. అతిథిని ఆప్యాయంగా పలకరించడం, వారి అవసరాలను అర్థం చేసుకోవడం, సమస్య వచ్చినప్పుడు సానుభూతితో స్పందించడం వంటి అంశాలు ఇప్పటికీ అత్యంత కీలకం. డిజిటల్ సౌకర్యాలు సేవలను వేగవంతం చేయగలవు కానీ మానవీయ సంబంధాలకు ప్రత్యామ్నాయం కాలేవు.
యువత పాత్ర కీలకం
హోటల్ పరిశ్రమలో వస్తున్న మార్పులు ఉద్యోగాల స్వరూపాన్నీ మార్చుతున్నాయి. భవిష్యత్తులో హాస్పిటాలిటీ రంగంలో రాణించాలనుకునే వారు కేవలం సాంకేతిక పనులకే పరిమితం కాకుండా కమ్యూనికేషన్, నాయకత్వం, సేవా నైపుణ్యాలు, టెక్నాలజీ వినియోగంపై కూడా పట్టు సాధించాల్సి ఉంటుంది. హాస్పిటాలిటీ విద్య యువతకు ఈ నైపుణ్యాలను అందించడంలో కీలకంగా ఉంటుంది. హోటళ్లలో పనిచేయడంతో పాటు పర్యాటకం, ఈవెంట్ మేనేజ్‌మెంట్, ఫుడ్ సర్వీసెస్ వంటి అనుబంధ రంగాల్లోనూ కెరీర్ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.
హైదరాబాద్ హోటల్ పరిశ్రమ భవిష్యత్తు టెక్నాలజీ, స్థిరమైన అభివృద్ధి, నాణ్యమైన సేవల సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది. ఆధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ ప్రమాణాలు ఎంతగా పెరిగినా నగరానికి ప్రత్యేకమైన సంప్రదాయ ఆతిథ్యాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. మొత్తంగా హోటల్ పరిశ్రమలో వస్తున్న మార్పులు నగర ఆర్థిక వ్యవస్థ, ఉపాధి, పర్యాటకం, సంస్కృతిపై ప్రభావం చూపుతున్నాయి. హైదరాబాద్ వంటి వేగంగా ఎదుగుతున్న నగరానికి హాస్పిటాలిటీ రంగం కేవలం వ్యాపార అవకాశమే కాదు.. స్థానిక సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే, యువతకు నైపుణ్యాలను అందించే కీలక రంగం కూడా. భవిష్యత్తులో హోటళ్లు మరింత ఆధునికంగా మారినా, అతిథికి ఆత్మీయ అనుభూతిని అందించడమే ఆతిథ్య రంగానికి అసలైన విజయమని వాణి కొడమంచిలి విశ్లేషిస్తున్నారు.