SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Hyderabad Biryani Price Hike: హైదరాబాద్‌లో బిర్యానీ ప్రియులకు షాక్.. ఒక్క ప్లేట్‌పై రూ.50 వరకు పెంపు!

Hyderabad Biryani Price Hike: హైదరాబాద్‌లో బిర్యానీ ధరలు భారీగా పెరగడంతో ప్రియులకు షాక్ తగిలింది. ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు ఒక్కో ప్లేట్‌పై రూ. 50 వరకు ధరలు పెంచాయి. నెయ్యి, బియ్యం, చికెన్, వంట నూనెతో పాటు కమర్షియల్ గ్యాస్ ధరలు పెరగడం ఈ నిర్ణయానికి కారణమని హోటల్ యజమానులు చెబుతున్నారు. ఈ పెంపు బ్యాచిలర్లు, విద్యార్థులు, ఉద్యోగుల నెలవారీ ఆహార బడ్జెట్‌పై ప్రభావం చూపనుంది.

Written By Harish Darla
Published: Nov 16, 2026, 14:13 IST | Updated: Nov 16, 2026, 14:16 IST
Join

Hyderabad Biryani Price Hike: హైదరాబాద్ అంటేనే ముందుగా గుర్తొచ్చేది ఘుమఘుమలాడే బిర్యానీ. నగరానికి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన ఈ వంటకం ఇప్పుడు సామాన్యులకు కాస్త ఖరీదైన ఆహారంగా మారుతోంది. హైదరాబాద్‌లోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లు బిర్యానీ ధరలను పెంచడంతో నగరవాసులపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. తాజా నివేదిక ప్రకారం.. కొన్ని హోటళ్లు ఒక్కో ప్లేట్‌పై రూ. 50 వరకు ధర పెంచాయి.

బిర్యానీ ధరలు పెరగడానికి కారణాలేంటి?
హోటల్ నిర్వాహకుల వివరణ ప్రకారం.. గత ఆరు నుంచి ఎనిమిది నెలలుగా వంటకు అవసరమైన ముడిసరుకుల ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా నాణ్యమైన నెయ్యి కిలో ధర రూ. 580 నుంచి రూ. 800 దాటినట్లు సమాచారం. పెరుగు, చీజ్ వంటి పాల ఉత్పత్తుల ధరలు కూడా పెరిగాయి. దీంతో బిర్యానీ తయారీ ఖర్చు గతంతో పోలిస్తే ఎక్కువైంది.

మరోవైపు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,750 నుంచి రూ. 3,080కు చేరిందని హోటల్ యజమానులు చెబుతున్నారు. వంట నూనె లీటరు ధర రూ. 150కు చేరువ కావడం, నాణ్యమైన బియ్యం కిలో రూ. 100కు చేరడం కూడా నిర్వహణ వ్యయాలను పెంచుతున్నాయి. చికెన్, కూరగాయల ధరలు సైతం హోటళ్లకు భారంగా మారాయి.

నగరవాసులపై ఎంత భారం?
హైదరాబాద్‌లో ప్రతిరోజూ సుమారు ఆరు లక్షల బిర్యానీ ప్లేట్లు విక్రయమవుతున్నాయని వ్యాపార వర్గాల అంచనా. సగటున ఒక్కో ప్లేట్‌పై రూ. 30 పెరిగితే రోజుకు రూ. 1.8 కోట్ల అదనపు వ్యయం వినియోగదారులపై పడుతుంది. నెలవారీగా ఈ మొత్తం సుమారు రూ. 54 కోట్లకు చేరవచ్చని అంచనా.

ముఖ్యంగా ఉద్యోగాలు, చదువుల కోసం హైదరాబాద్‌లో నివసించే బ్యాచిలర్లు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగుల ఆహార బడ్జెట్‌పై ఈ ప్రభావం కనిపించనుంది. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ద్వారా బిర్యానీ ఆర్డర్ చేసేవారికి ప్యాకింగ్, డెలివరీ ఛార్జీలు కూడా అదనపు భారంగా మారుతున్నాయి.

హోటల్ యజమానుల ఆవేదన
తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కంచర్ల అశోక్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. ముడిసరుకుల ధరలు పెరగడంతో హోటల్ వ్యాపారంలో లాభాలు తగ్గి నష్టాలు పెరుగుతున్నాయి. ధరలు పెంచితే కస్టమర్లు తగ్గుతారనే ఆందోళన ఉన్నప్పటికీ, వ్యాపారాన్ని కొనసాగించడానికి ఈ నిర్ణయం తప్పనిసరిగా మారిందని ఆయన వివరించారు. మొత్తానికి, పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు హైదరాబాద్ బిర్యానీ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఇకపై బయట బిర్యానీ తినాలనుకునే వారు తమ నెలవారీ బడ్జెట్‌ను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

ZEENEWS TRENDING STORIES