డంపింగ్ యార్డ్ శాపం.. పీల్చే గాలి కాలుష్యం... తాగే నీరు విషం.! జవహర్ నగర్ ఆక్రోశం..!
Jawahar Nagar Dumping Yard: అధికార యంత్రాంగ బాధ్యతా రాహిత్యం...ముందుచూపు లేమి... నిర్వహణలో లోపించిన చిత్తశుద్ధి... ప్రజల పాలిట శాపమైంది. పీల్చేగాలి... తాగేనీరు... కాలుష్యమయం. నివాస యోగ్యం కాని పరిసరాలు.. ఇదీ జవహార్ నగర్ పరిస్థితి. గ్రేటర్ హైదరాబాద్ పరిసరాల్లోంచి సేకరించిన వ్యర్థాలన్నింటినీ ఏళ్ల తరబడి జవహార్ నగర్ పరిసరాల్లో డంప్ చేస్తున్నారు. నానాటికీ పేరుకుపోయిన మున్సిపల్ వ్యర్థాల కాలుష్య కూపంతో విషవలయం ఆవరించుకుపోయింది. ఎందుకొచ్చిందీ పరిస్థితి..? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? పరిష్కార మార్గమేంటి? జీ తెలుగు న్యూస్ స్పెషల్...
Jawahar Nagar Dump Yard Aggitation: ఇది గ్రేటర్ హైదరాబాద్ కు సమీపంలో ఉన్న జవహార్ నగర్ ప్రాంతం.... మేడ్చల్ జిల్లా కాప్రా మండలంలోని జవహర్‌నగర్‌లో దాదాపు 393.54 ఎకరాల విస్తీర్ణంలో ఈ డంపింగ్ యార్డుగా మార్చారు. ఇక్కడ 1994 నుంచి వ్యర్థాలను వేయడం మొదలుపెట్టారు. ప్రారంభంలో హైదరాబాద్ సిటీ నుంచి రోజుకు 2,500 నుంచి 3వేల టన్నుల వ్యర్థాలు వచ్చేవి. అప్పట్లో దానికి తగ్గట్టు నిర్వహణ చేపట్టేవారు. కాలక్రమంలో వ్యర్థాల పరిమాణం పెరిగింది. ప్రస్తుతం 8 వేల టన్నుల 10 వేల టన్నుల వ్యర్థాలు సేకరించి ఇక్కడ డంపింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ కోటి 40 లక్షల టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయి. దీన్నంతా ల్యాండ్ ఫిల్ చేసి దానిపై మళ్లీ వ్యర్థాలను డంప్ చేస్తున్నారు.
విషవాయువులను వెదజల్లుతున్న జవహార్ నగర్ డంపింగ్ యార్డ్..
వ్యర్థాలను ఆధునిక టెక్నాలజీ ద్వారా విద్యుత్తు ఉత్పత్తిచేయాలని అధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో దుండిగల్‌లో రెండు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి చెత్త తరలిస్తున్నారు. 2వేల టన్నులను విండ్రో కంపోస్టింగ్ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇది కాకుండా రోజూ వేస్టు టు ఎనర్జీ ప్లాంట్ లో 2వేల టన్నులను నిల్వచేస్తున్నారు. రెండు నుంచి మూడువేల టన్నుల చెత్త మిగులుతుండడంతో అంతా క్యాపింగ్ చేసిన చెత్త కుప్పపై వేస్తున్నట్టు సమాచారం. దీంతో సమస్య మరింత తీవ్రమవుతున్నది. ఇక్కడి వ్యర్థాలు రోజు రోజుకీ పేరుకుపోతున్నాయి. ముప్పై యేళ్లలో సముద్ర మట్టానికి 614 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాయి. ఇది 608 మీటర్లున్న గోల్కొండ కోట కంటే ఎత్తుగా ఉందని అధికారులు గుర్తించారు. వ్యర్థాల నిర్వహణలో శాస్త్రీయ విధానాలు అవలంభించకపోవడంతో నానాటికీ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. దీంతో వ్యర్థాల నిర్వహణపై అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చేసింది. దీంతో పేరుకుపోయిన వ్యర్థాల్లోంచి విషవాయువులు వెలువడుతున్నాయి. పరిసరాలు దుర్గంధభరితంగా మారిపోయాయి.
30ఏళ్లకు పైగా భారీగా పేరుకుపోయిన మున్సిపల్ వ్యర్థాలు..
గ్రేటర్ హైదరాబాద్ సమీపంలో ఉన్న జవహార్ నగర్ ప్రాంతంలో ప్రజలు దినదిన గండంగా జీవనం గడుపుతున్నారు. భూగర్భజలాలన్నీ విషతుల్యమైపోయాయి. పీల్చే గాలిలోనూ ఘాడతతో కూడిన ప్రాణాంతకమైన విషవాయువులున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది. జవహార్ నగర్ డంపింగ్ యార్డువల్ల దుర్వాసన భరించలేకపోతున్నామని, దాహం తీర్చుకోడానికి గుక్కెడు నీళ్లు కరువయ్యాయని పరిసర నివాసితులు ఆందోళనకు దిగారు. డంపింగ్ యార్డు నుంచి ఘాడతతో కూడిన వాయువులు వెలువడనీకుండా శాస్త్రీయపద్దతుల్లో వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
జవహార్ నగర్ డంపింగ్ యార్డులో మున్సిపల్ వేస్ట్ మేనేజ్మెంట్ చేపట్టాలని డిమాండ్..
ప్రపంచంలోనే అతి ప్రమాదకర ప్రాంతాల్లో జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఒకటిగా నిలిచింది. ఇప్పటికే జల కాలుష్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ డంపింగ్ యార్డు ఇప్పుడు మిథేన్ వంటి విష వాయువులను అత్యధిక మోతాదులో విడుదల చేస్తున్న డేంజరస్ ప్లేస్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజిల్స్ ‘స్టాప్ మిథేన్ ప్రాజెక్ట్’ కింద చేపట్టిన పరిశోధనలో భయంకరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పటికే ఇక్కడ కోటి 40 లక్షల టన్నుల వ్యర్థాలను రాంకీ సంస్థ భూమిలో పూడ్చిపెట్టింది. దీనివల్ల ఇక్కడ ఎటువంటి సమస్య లేదని, చుట్టుపక్కల వారికి కూడా ఏమీ కాదని, ల్యాండ్ ఫిల్ లేకుండా శాస్త్రీయ పద్ధతిలో ఎప్పటికప్పుడు వచ్చిన చెత్తని ప్రాసెస్ చేస్తున్నామని రాంకీ చెప్తోంది. అయితే, అవన్నీ అబద్దాలేనని ఇప్పటికే పలు స్టడీ రిపోర్టులు తేల్చాయి.
ప్రపంచంలోనే అత్యధికంగా కాలుష్యం ఉన్న డంపింగ్ యార్డుల్లో జవహర్ నగర్ ది నాలుగో స్థానం..
యూసీఎల్ఏ ప్రొఫెసర్లు, రీసెర్చ్ కాలర్స్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పరిస్థితి చూసి కంగారుపడ్డారు. ఇక్కడ పేరుకుపోయిన చెత్త కేవలం కంపు కొట్టడమే కాదని, భూగోళాన్నే వేడెక్కిస్తుందని తేల్చారు. ఈ డంపింగ్ యార్డు నుంచి గంటకు ఏకంగా 5.9 టన్నుల మిథేన్ వాయువు విడుదలవుతోందని పరిశోధనలో తెలుసుకుని షాక్ అయ్యారు. ఈ మిథేన్ కార్బన్ డయాక్సైడ్ కంటే 86 రెట్లు ఎక్కువ ప్రమాదకరమని గుర్తించారు. ఇక్కడ గంటకు వెలువడే గ్యాస్.. రోడ్ల మీద తిరిగే 12 లక్షల కార్లు కలిగించే భూతాపంతో సమానమని పేర్కొన్నారు. చివరకు పరిశోధనల్లో ప్రపంచంలోనే అత్యధికంగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న డంపింగ్ యార్డుల్లో జవహర్ నగర్ ది నాలుగో స్థానమని తేలింది.
మీథేన్ గ్యాస్ వ్యాప్తితో... బెంబేలెత్తుతున్న పరిసరవాసులు..
కార్బన్ డయాక్సైడ్ కంటే మీథేన్ సుమారు 86 రెట్లు ఎక్కువ ప్రభావాన్ని చూపుతుందని, ప్రస్తుత గ్లోబల్ వార్మింగ్‌లో 45శాతం కంటే ఎక్కువ వాటా ఈ మిథేన్ దే అని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరి అంచనా ప్రకారం డంపింగ్ యార్డు చుట్టూ గాలి పీల్చుకుంటే కొన్ని యేండ్లలో ఊపిరితిత్తులు పాడైపోవడం ఖాయం. మిథేన్ సూర్యకాంతితో కలిసినప్పుడు గ్రౌండ్ లెవల్ ఓజోన్ ఏర్పడుతుంది. దీనివల్ల ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు పెరుగుతాయి. తల తిరగడం, తలనొప్పి, వాంతులు వచ్చినట్లు ఉండటం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల జ్ఞాపకశక్తి కోల్పోవడం, గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది.
భూగర్భజలాలు విషంగా మారిపోయిందని పరిసరవాసుల ఆవేదన..
జవహర్ నగర్ డంపింగ్ యార్డు వల్ల చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయ్యింది. 10 కిలోమీటర్ల మేర భూమి లోపల నీళ్లు కలుషితమయ్యాయని రిపోర్టులు చెబుతున్నాయి. ఇక్కడి నీటి టీడీఎస్ చెక్ చేస్తే 4 వేలకు పైగా ఉంది. ఈ నీటితో స్నానం చేస్తున్న వారికి చర్మ సంబంధిత వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. ఈ నీటిని వాడిని కొందరి కిడ్నీలు కూడా ఫెయిలయ్యాయి. ఇక్కడి చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి 2023 ఏప్రిల్ 15న రూ.251 కోట్లతో 2వేల కేఎల్డీ సామర్థ్యం గల లీచెట్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ వల్ల విపరీతమైన వాయు కాలుష్యం ఏర్పడుతోందని పలు స్టడీ రిపోర్టులు వెల్లడించాయి. ప్లాంట్ నుంచి వచ్చే లీచెట్ తో చుట్టుపక్కల చెరువులు పూర్తిగా కలుషితమయ్యాయి. దుర్గంధం వెదజల్లుతోంది. దమ్మాయిగూడ, నాగారం ప్రాంతాల్లోని కాలనీల్లో డంపింగ్ యార్డు నుంచి వచ్చే నీటితో వాటర్ పొల్యూషన్ అవుతుంది.
జవహార్ నగర్ పరిసరాల్లో మీథేన్ తీవ్రత ఎక్కువ కావడంతో ప్రజకు ప్రాణాంతకంగా మారింది. డంపింగ్ యార్డులో వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించాలని వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేశారు. పర్యావరణ శాస్త్రవేత్తల చేత అధ్యయనం చేయించి శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాలను నిర్వహించకుంటే ప్రమాదకరంగా మారుతుందని డాక్టర్లు చెబుతున్నారు.
ప్రభుత్వ అధికార యంత్రాంగం చొరవతీసుకుని డంపింగ్ యార్డులో శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణ చేపట్టేందుకు అధికారులు చొరవతీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
(రచయత.. మునిరాజ్ జీ న్యూస్ డెస్క్ సౌజన్యంతో)