Hostels Close: హైదరాబాద్‌లో నీటి సంక్షోభం.. జనవరిలో హాస్టల్స్, పీజీలు మూసివేత?
KPHB Hostels And PGs Likely To Close On January With Effect Of Elnino: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో హైదరాబాద్‌లో నీటి సంక్షోభం రాబోతున్నది. ఇప్పటికే ప్రభుత్వం నీటిని పొదుపుగా వాడాలని సూచిస్తుండగా.. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో హాస్టల్స్, పీజీలు మూతపడే అవకాశాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
KPHB Colony Hostels Association: వర్షాభావ పరిస్థితులతో తెలంగాణలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే వర్షాలు లేక జల వనరులు ఎండిపోయి వెలవెలబోతున్నాయి. కురిసిన వర్షాలకు ప్రభుత్వం ప్రాజెక్టుల్లో నీళ్లు ఎత్తిపోయకపోవడంతో నీటి ఎద్దడి మరింత తీవ్రమైంది. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం నీటి పొదుపు చర్యలు సూచించింది. నీటి సంక్షోభం తీవ్రస్థాయికి చేరితే హాస్టల్స్, పీజీలు మూసివేస్తామని యజమానులు ప్రకటించారు. జనవరి, ఫిబ్రవరిలో హాస్టళ్లు మూసివేస్తామని హాస్టల్ యజమానుల సంఘం తెలిపింది.
హైదరాబాద్‌లో కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీలో పెద్ద ఎత్తున హాస్టళ్లు, పీజీలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో హాస్టళ్ల నిర్వహణ రోజురోజుకూ భారంగా మారుతోంది. కేపీహెచ్‌బీ కాలనీలో నీటి ఎద్దడి ఏర్పడడంతో హాస్టళ్లు మనుగడ సాగించలేని పరిస్థితి ఏర్పడింది. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత తీవ్రరూపం దాల్చుతోందని.. బోర్లు ఎండిపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని హాస్టల్ అసోసియేషన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
'గతంలో రూ.1,000గా ఉన్న నీటి ట్యాంకర్ ఖర్చు ప్రస్తుతం రూ.2500 వేల నుంచి రూ.5 వేల వరకు పెరిగింది. అయినా కూడా నీటి ట్యాంకర్ లభించని పరిస్థితి' అని హాస్టల్స్ యజమానుల సంఘం తెలిపింది. సుమారు 50 కిలోమీటర్ల దూరం నుంచి నీటిని తీసుకురావాల్సి వస్తోందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ బిల్లులు, వంట నూనెలు, నిత్యావసర సరుకులు, ఇతర ముడిసరుకుల ధరలు భారీగా పెరిగాయని చెప్పారు.
'నీటి కొరత ఏర్పడడంతో హాస్టళ్లలో నీటి పొదుపు చర్యలు పాటిస్తున్నారు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, కోచింగ్ అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు సంబంధించి సర్క్యులర్లు జారీ చేయడంతో హాస్టళ్ల ఆక్యుపెన్సీపై ప్రభావం పడుతోంది' అని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని భవన యజమానులు అద్దెలు తగ్గించి సహకరించాలని హాస్టల్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే వచ్చే జనవరి, ఫిబ్రవరి నుంచి హాస్టళ్లకు తాళాలు వేసి భవనాల తాళాలను యజమానులకు అప్పగిస్తామని అసోసియేషన్ హెచ్చరించింది.