వండర్‌లా సరికొత్త రికార్డు.. 19.5 లక్షల మంది సందర్శకులు.. ఆదాయం ఎంతంటే..?
Wonderla: వండర్‌లా హాలిడేస్ లిమిటెడ్ తన రెండో త్రైమాసికం ఫలితాల్లో అదరగొట్టింది. కొత్తగా వచ్చిన చెన్నై పార్క్‌తోపాటు బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్ పార్కులకు సందర్శకుల తాకిడి పెరగడంతో సంస్థ హిస్టరీలోనే అత్యుత్తమ త్రైమాసిక ఆదాయాన్ని నమోదు చేసింది. వివరాలు ఇలా..
Wonderla: దేశంలోని ప్రముఖ అమ్యూజ్‌మెంట్ పార్క్‌ల నిర్వహణ సంస్థ వండర్‌లా హాలిడేస్ లిమిటెడ్ మరోసారి తన సత్తా చాటింది. 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఇప్పటివరకు ఎన్నడూ లేనంత ఉత్తమ ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ మొత్తం ఆదాయం 42 శాతం పెరిగి రూ.126 కోట్లకు చేరింది. EBITDA ఏకంగా 90 శాతం వృద్ధి చెంది రూ.30.11 కోట్లుగా నమోదైంది. సందర్శకుల సంఖ్య పెరగడం, చెన్నై పార్క్ నుంచి వచ్చిన ఆదాయం, ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న పార్కుల మెరుగైన పనితీరు ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.
2026 సెప్టెంబర్ 30వ తేదీతో ముగిసిన తొలి ఆరు నెలల కాలంలోనూ మంచి ఫలితాలు సాధించినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ కాలంలో మొత్తం ఆదాయం 41 శాతం వృద్ధితో రూ.377.78 కోట్లకు చేరుకుంది. EBITDA గత ఏడాదితో పోలిస్తే 47 శాతం పెరిగి రూ.152.10 కోట్లుగా నమోదైంది. ఆరు నెలల్లో వండర్‌లా పార్కులను సందర్శించిన వారి సంఖ్య 19.50 లక్షలకు చేరగా.. గత ఏడాదితో పోలిస్తే ఇది 37 శాతం అధికం.
పార్కుల వారీగా సందర్శకుల వివరాలు..
- బెంగళూరు: 2.13 లక్షలు
- కొచ్చి: 2.02 లక్షలు
- చెన్నై: 1.90 లక్షలు
- హైదరాబాద్: 99 వేలు
- భువనేశ్వర్: 20 వేలు
మొత్తంగా ఈ మూడు నెలల్లో 7.25 లక్షల మంది వండర్‌లా పార్కులను సందర్శించారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే సందర్శకుల సంఖ్య 44 శాతం పెరిగింది. వండరలా వృద్ధిలో చెన్నై పార్క్ కీలక పాత్ర పోషించింది. కార్యకలాపాలు ప్రారంభించిన తొలి ఆరు నెలల్లోనే ఈ పార్క్ ద్వారా రూ.73 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ కాలంలో 4.32 లక్షల మంది సందర్శకులు చెన్నై పార్కును సందర్శించారు. ఒక్క రెండో త్రైమాసికంలోనే 1.90 లక్షల మంది రాగా.. సుమారు రూ.28 కోట్ల ఆదాయం లభించింది. మరోవైపు బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్, భువనేశ్వర్‌లోని ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్న పార్కులు కూడా స్థిరమైన వృద్ధిని కనబరిచాయి. రెండో త్రైమాసికంలో ఈ పార్కుల ఆదాయం సుమారు 8 శాతం పెరిగింది. సందర్శకుల సంఖ్యలో 6 శాతం, ఒక్కో సందర్శకుడి నుంచి వచ్చే సగటు ఆదాయంలో 2 శాతం వృద్ధి నమోదైంది.
కంపెనీ పనితీరుపై వండర్‌లా హాలీడేస్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ చిట్టిలపిల్లి మాట్లాడుతూ.. రెండో త్రైమాసికంలో సాధించిన ఫలితాలు సంస్థకు ఎంతో ప్రత్యేకమని తెలిపారు. ఆదాయం 42 శాతం పెరగడంతో పాటు EBITDA దాదాపు రెట్టింపు కావడం, మార్జిన్లు మెరుగుపడటం కంపెనీ వృద్ధికి నిదర్శనమన్నారు. చెన్నై పార్క్ తొలి ఆరు నెలల్లోనే రూ.73 కోట్ల ఆదాయాన్ని అందించిందని.. మరోవైపు ఇప్పటికే ఉన్న పార్కులు కూడా సొంతంగా మంచి వృద్ధిని సాధిస్తున్నాయన్నారు. తొలి ఆరు నెలల్లో కంపెనీ ఆదాయం రూ.378 కోట్లకు, EBITDA రూ.152 కోట్లకు చేరడం సంతోషంగా ఉందన్నారు.