Vemulawada Temple: వేములవాడ రాజన్న, భీమన్న క్షేత్రంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు
Devi Navratri Utsav In Vemulawada Temple: తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇక సమీపంలోని భీమేశ్వర ఆలయంలో కూడా ఉత్సవాలు మొదలయ్యాయి. వేములవాడలో దేవీ నవరాత్రి ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి.
Dussehra Navratri Utsav 2026: దసరా నవరాత్రి ఉత్సవాలు తెలంగాణలోని ప్రముఖ శైవ క్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. వేములవాడ రాజన్న ఆలయంతోపాటు సమీపంలోని భీమేశ్వర ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలు కాగా.. పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. రాజరాజేశ్వర, భీమేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా మంత్రోచ్ఛారణల నడుమ నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. భీమేశ్వర ఆలయంలో భక్తుల సౌకర్యార్థం మండపంలో అమ్మవారి ఉత్సవ మూర్తిని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలను ఆలయ డీఈఓ ప్రతాప నవీన్ కుమార్ పర్యవేక్షణలో పూజకు కావలసిన ద్రవ్యాలను ఆలయ అర్చకులు, వేద పండితులకు అందజేశారు. తొలిరోజు శైలపుత్రి అలంకారం చేయగా.. విశేష పూజలు నిర్వహించారు.
ఉదయకాల పూజలు
స్వస్తి పుణ్యాహవాచనం, పంచగవ్య మిశ్రణం, ఋత్విగ్వరణం, అఖండ దీపస్థాపన, కలశ ప్రతిష్ట మరియు శ్రీ గాయత్రీ ప్రతిష్ట కార్యక్రమాలు జరిగాయి.
మహా అభిషేకాలు
లక్ష్మీ గణపతి స్వామికి అధర్వశీర్ష పూర్వక మహాఅభిషేకం, రాజరాజేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు.
జపాలు, పారాయణాలు
దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 9 మంది ఋత్విజులు శ్రీ సూక్తం, దుర్గాసూక్తం, లలితా సహస్రనామ సహిత చతుష్షష్ట్యోపచార పూజలు జరిగాయి. గాయత్రీ మూలమంత్ర జపాలు, గాయత్రీ హవనం, శ్రీమద్భాగవత పురాణ ప్రవచనం, దేవీ చండీ సప్తశతీ పారాయణాలు పూర్తి చేశారు.
పరివార దేవతలకు పూజలు
ఆలయంలోని పంచాయతన సూక్త పరివార దేవతలైన లక్ష్మీనారాయణ, వేంకటేశ్వర, సోమేశ్వర, మహిషాసురమర్ధిని, సుబ్రహ్మణ్యేశ్వర, కాలభైరవ, నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు జరిగాయి.
సాయంత్ర విశేషాలు
సాయంత్రం 4 గంటల నుంచి భీమేశ్వరాలయంలో దేవీభాగవత పురాణ ప్రవచనం, 6:15 నుంచి 8 గంటల వరకు రాజరాజేశ్వరి అమ్మవారికి చతుష్షష్ట్యోపచార పూజలు, కన్యాక-సువాసినీ పూజలు, హరిహరుల ఉత్సవమూర్తుల పల్లకీ సేవ ఊరేగింపు నిర్వహించారు.
భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక కుంకుమ పూజలు
దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కూడా దేవీ నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని భక్తుల కోసం ప్రత్యేక కుంకుమ పూజల సేవను అందుబాటులోకి తెచ్చినట్లు ఆలయ వర్గాలు తెలిపారు.
పూజల తేదీలు: అక్టోబర్ 11 నుంచి 20 వరకు
కుంకుమ పూజ టికెట్ రుసుము: రూ.5,000