Durga Ashtami: వేములవాడలో ఘనంగా దుర్గాష్టమి వేడుకలు.. మహాగౌరీ దేవిగా రాజరాజేశ్వరి అమ్మవారు
Durga Ashtami Celebrations In Vemulawada Raja Rajeshwari Temple: దసరా దేవీ నవరాత్రి ఉత్సవాలు వేములవాడ ఆలయంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అష్టమి రోజు అమ్మవారిని మహాగౌరీ దేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Vemulawada Raja Rajeshwara Swami Temple: దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో దసరా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఆదివారం ఆశ్వయుజ శుద్ధ అష్టమి దుర్గాష్టమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రధానాలయంలో రాజరాజేశ్వర స్వామి, అమ్మవార్ల పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా, శాస్త్రోక్తంగా నిర్వహించారు.
భక్తుల సౌకర్యార్థం అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని మండపంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాజరాజేశ్వరీ అమ్మవారిని మహాగౌరీ అలంకారం చేయగా.. భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
శాస్త్రోక్తంగా ఉదయకాల పూజలు, చండీ హవనం
దుర్గాష్టమి సందర్భంగా ఆదివారం ఉదయం 5:30 గంటల నుంచి ప్రధానాలయంలో విశేష పూజలు ప్రారంభమయ్యాయి. లక్ష్మీగణపతి స్వామివారికి అభిషేకం, అర్చనలు జరిగాయి. రాజన్న సన్నిధిలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రాజరాజేశ్వరి అమ్మవారికి శ్రీసూక్తం, దుర్గాసూక్తం, లలితా సహస్రనామ సహిత చతుష్షష్ట్యోపచార పూజలను ఏకాంతంగా నిర్వహించారు.
ఉదయం 8:30 గంటలకు శ్రీ చండీ అమ్మవారి సన్నిధిలో కలశస్థాపన, అగ్నిప్రతిష్ఠాపన చేసి, శాస్త్రోక్తంగా చండీ సప్తశతీ హవనాన్ని జరిపారు.
ఆయుధ పూజ
దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ భద్రతా విభాగం, ఎస్పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా ఆలయ ప్రాంగణంలో ఆయుధపూజను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల పర్యవేక్షణలో భాగంగా ఆలయ డిప్యూటీ ఈవో ప్రతాప నవీన్ కుమార్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వీరి వెంట పీఆర్వో పెరిక శ్రీనివాస్ ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.
సాయంత్రం దేవీ ప్రవచనం - మహాపూజ - పల్లకీసేవ
సాయంత్రం 4 గంటల నుంచి శ్రీమద్ దేవీభాగవత పురాణ ప్రవచనం జరగనుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి ప్రత్యేక చతుష్షష్ట్యోపచార పూజలు, కన్యకా-సువాసినీ పూజలు వైభవంగా నిర్వహించనున్నారు. రాత్రి గంటలకు మహిషాసుర మర్దినీ అమ్మవారికి దుర్గాష్టమి మహాపూజ జరగనుంది. అనంతరం హరిహరుల పల్లకీసేవ కన్నులపండువగా సాగనుంది.