Bandi Sanjay Deeksha: దేవీ నవరాత్రుల సందర్భంగా బండి సంజయ్ భవానీ దీక్ష స్వీకరణ
Bandi Sanjay Takes Bhavani Deeksha: దేశవ్యాప్తంగా దేవీనవరాత్రి ఉత్సవాల సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ భవానీ దీక్ష స్వీకరించారు. నవరాత్రుల పాటు ఆయన ప్రత్యేక దీక్షలో ఉండి భక్తి ప్రపత్తులతో ఉండనున్నారు. ఈ దీక్షకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Bhavani Deeksha: దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమవగా ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ భవానీ దీక్ష స్వీకరించారు. కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో మాలాధారణ చేశారు. 11 రోజుల పాటు కేంద్ర మంత్రి దీక్షలో కొనసాగనున్నారు. దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్నారు. దీక్షలో ఉన్నన్నీ రోజులు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆలయంలోనే ఉండనున్నారు.
కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి అమ్మవారి ఆలయంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య కేంద్ర మంత్రి బండి సంజయ్ మాలాధారణ చేశారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈరోజు నుంచి 11 రోజుల పాటు బండి సంజయ్ దీక్షలో కొనసాగనున్నారు. ఈ 11 రోజులు పూర్తిగా ఆలయంలోనే ఉంటూ అమ్మవారి సేవలో తరించనున్నారు. వివిధ సమస్యల నిమిత్తం కేంద్ర మంత్రిని కలిసేందుకు వచ్చే వారందరినీ ఆలయ ఆవరణలోనే కలుసుకుంటారు. అందుకోసం ప్రత్యేకంగా ఒక టెంట్ ఏర్పాటు చేశారు.
సర్వాంగ సుందరంగా మహాశక్తి ఆలయం
దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కరీంనగర్‌లోని శ్రీ మహాశక్తి ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఆలయ పరిసరాలన్నింటినీ విద్యుద్దీప కాంతులతో ధగధగలాడుతోంది. ఆలయ ఆవరణలో ప్రత్యేక నిర్వహించనున్న ఆధ్మాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈనెల 11వ తేదీ నుంచి మహాశక్తి అమ్మవారు రోజుకో పూజ అందుకోనున్నారు. దేవీభవానీ దీక్షాధారులు, భక్తులతో శ్రీ మహాశక్తి అమ్మవారి ఆలయం సందడిగా మారింది.
దసరా నవరాత్రి ఉత్సవాల నిర్వహణలో కర్త, కర్మ, క్రియలా అన్నీ తానై వ్యవహరిస్తూ భక్తులకు ఏ చిన్న ఇబ్బంది లేకుండా అమ్మవార్లను ప్రశాంతమైన వాతావరణంలో మనస్పూర్తిగా దర్శించుకునేలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సకల సౌకర్యాలు కల్పించారు. భవానీ మాలాధారణ చేసిన దీక్షాపరులకు భోజన, పూజా వసతులను కల్పించారు. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవార్లను దర్శించుకునే భక్తులందరికీ ఉచితంగా ప్రసాదాలను అందజేయనున్నారు. భవానీ మాలాధారులుసహా అమ్మవారిని దర్శించుకునే ప్రతి ఒక్కరికీ అల్పాహారంతోపాటు మధ్యాహ్న భోజన సౌకర్యాలను కల్పిస్తున్నారు. ప్రతిరోజు 5 నుండి 10 వేల మంది భక్తులకు భోజన, అల్పాహారాలను అందజేసేలా ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు.
కరీంనగర్‌లో 16 ఏళ్ల కిందట శ్రీమహాశక్తి ఆలయం ప్రతిష్టాపన జరిగింది. ఈ ఆలయంలో బండి సంజయ్ తన కుటుంబసభ్యులతోపాటు కొంతమంది నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భవానీ మాలను స్వీకరించేవారు. దుర్గామాత దీక్షాపరులతో ఈ పుణ్యక్షేత్రం దసరా నవరాత్రి ఉత్సవాల్లో కోలాహలంగా మారింది.