Milk Adulteration: ఒక్క పశువు లేకుండానే వందల లీటర్ల పాలు.. తయారీ విధానం తెలిస్తే షాక్..!
Fake Milk in Telangana: మన ఆహారంలో నిత్యం భాగమయ్యే పాలు... ఇప్పుడు ప్రాణాంతక విషాన్ని చిమ్ముతున్నాయి. ఉదయాన్నే చిన్నారులకు పోసే పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయనుకుంటే పొరపాటే..! తెలంగాణలో రోజురోజుకూ కల్తీ పాల దందాలు విపరీతంగా పెరుగుతోంది. నగరాలు, పట్టణాల్లోని సామాన్యుల ప్రాణాలతో అక్రమ వ్యాపారులు యథేచ్ఛగా చెలగాటమాడుతున్నారు.
Fake Milk in Telangana: తెలంగాణలో పాలు తాగుతున్నారా...అయితే మీ ప్రాణాలు పోయినట్లే. చూసేవన్ని పాలు కాదు అన్నట్లు తయారయ్యింది రాష్ట్రంలోని పరిస్థితి. కనీసం ఒక్క గేద లేకున్నా.. వందల కొద్ది లీటర్ల పాలు అమ్ముతున్నారు కొందరు దళారులు. అమాయకులను నమ్మంచి నట్టేటా ముంచేస్తున్నారు. స్వచ్ఛమైన గేదా పాలు అంటూ...ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. తెలంగాణవ్యాప్తంగా SOT, ఫుడ్ సేఫ్టీ పోలీసులు చేసిన సోదాల్లో కల్తీ పాల అసలు రంగు బయటపడింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని పోచారంతో పాటు హైదరాబాద్ శివార్లలో నిరంతరం సాగుతున్న కృత్రిమ పాల కేంద్రాల గుట్టును అధికారులు రట్టు చేశారు. ఏ ఒక్క ఆవు,గేదె లేకుండానే లీటర్ల కొద్దీ పాలను తయారు చేస్తున్నారు కొందరు దుర్మార్గులు.
అసలు పాలు లేకుండానే సింథటిక్ పాలు ఎలా తయారుచేస్తున్నారో తెలిస్తే ఒళ్లు జలదరిస్తుంది. పాలపొడి, యూరియా, నిషిద్ధ డిటర్జెంట్లు, సబ్బు పొడి, చవకబారు వంటనూనెలు, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి ప్రమాదకర రసాయనాలను నీటిలో కలిపి చిక్కటి పాలను తయారుచేస్తున్నారు. పాలు ఎక్కువ రోజులు పాడవకుండా ఉండేందుకు, తెల్లటి రంగు-చిక్కదనం కోసం ఈ ప్రాణాంతక కెమికల్స్ వాడుతున్నారు. ఈ కల్తీ పాలు తాగడం వల్ల మానవ శరీరంలో ఊహించని నష్టం జరుగుతోంది. చిన్నపిల్లల్లో జీర్ణ వ్యవస్థ దెబ్బతిని వికారాలు, వాంతులతో పాటు మానసిక వికాసం మందగిస్తోంది. ఇక దీర్ఘకాలికంగా ఈ విషపు పాలను తాగితే కిడ్నీ వైఫల్యం, లివర్ ఇన్ఫెక్షన్లు, ఉదర సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి భయంకర రోగాల బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
అసలు తెలంగాణలో కల్తీ వ్యాపారానికి ప్రధాన మూలం పాల ఉత్పత్తి-డిమాండ్ మధ్య ఉన్న భారీ అంతరమే! తెలంగాణలో ప్రస్తుతం రోజువారీగా సుమారు 70 నుంచి 75 లక్షల లీటర్ల పాలు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో ప్రభుత్వ రంగ సంస్థ 'విజయా డెయిరీ' తో పాటు ఇతర సహకార, ప్రైవేట్ డెయిరీలు సేకరించేది కేవలం ఒక భాగం మాత్రమే. మరోవైపు తెలంగాణలో రోజువారీ పాలు, పాల ఉత్పత్తుల అవసరం ఏకంగా కోటి 10 లక్షల లీటర్ల వరకు ఉంటోంది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ నగరంలోనే రోజూ 40 నుంచి 45 లక్షల లీటర్ల పాలు ఖర్చవుతున్నాయి. అంటే ప్రతి రోజూ సుమారు 35 నుంచి 40 లక్షల లీటర్ల పాల కొరత ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ భారీ డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల నుంచి నాణ్యత లేని పాలను దిగుమతి చేసుకుంటున్నారు. కొన్ని అసాంఘిక ముఠాలు దళారులతో చేతులు కలిపి... లీటర్ పాల స్థానంలో కెమికల్స్ సాయంతో రెండింతలు పెంచి మార్కెట్లోకి సరఫరా చేస్తున్నాయి. దీనివల్ల అసలైన డెయిరీ రైతులకు కూడా గిట్టుబాటు ధర దక్కకుండాపోతోంది.
ఈ దందాను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం పటిష్ట చర్యలకు శ్రీకారం చుట్టింది. సీఎం ఆదేశాల మేరకు సచివాలయం పర్యవేక్షణలో ప్రత్యేక 'ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్' బృందాలను రంగంలోకి దించారు. నగర శివార్లలో ఉండే ప్రైవేట్ డైరీలు, ప్రాసెసింగ్ యూనిట్లు, విక్రయ కేంద్రాల నుంచి నిరంతరం శాంపిల్స్‌ను సేకరించి మొబైల్ ల్యాబ్‌ల ద్వారా అక్కడికక్కడే పరీక్షలు నిర్వహిస్తున్నారు. కల్తీ పాల తయారీదారులపై కేవలం ఫైన్లతో సరిపెట్టకుండా పిడి యాక్ట్ తరహా తీవ్రమైన నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేస్తున్నారు. కల్తీ కేంద్రాలను సీజ్ చేయడమే కాక, వ్యాపారుల లైసెన్సులను రద్దు చేస్తున్నారు. అయితే కేవలం పోలీసుల చర్యలే కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న చెక్ పోస్టుల వద్ద నిఘా మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
సామాన్యులు కూడా కొనుగోలు చేసే పాలు అసలైనవో కాదో గుర్తించే చిన్నచిన్న టెస్టులు ఇంట్లోనే చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం పాల సేకరణను మరింత పెంచి రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తే తప్ప ఈ కొరత తీరదు. పాలలో విషం కలుపుతున్న పాపిష్టి మూఠాలపై ఉక్కుపాదం మోపితేనే ప్రతీ ఇంట స్వచ్ఛమైన పాలు అందుతాయి.