ఒక్క బొట్టు రక్తం చిందించకుండా స్వరాజ్యం.. జాతిపిత గాంధీజీ జీవితంలో మనకు తెలియని విషయాలు!
Facts About Gandhi: జాతిపిత మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా.. జాతిపిత జీవితం గురించి అంతగా ఎవరికీ తెలియని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం.
Facts About Gandhi: జాతిపిత మహాత్మాగాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్ లోని పోర్ బందర్ లో జన్మించారు. 20వ శతాబ్దంలో మానవాళిని గాంధీ అంతగా ప్రభావితం చేసిన మరో నాయకుడు లేరనే చెప్పాలి. అహింసే ఆయుధంగా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన గొప్ప యోధుడు జాతిపిత మహాత్మాగాంధీ. నేడు ఆయన 157వ జయంతి సందర్భంగా బాపూజీ జీవితం గురించి ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం.
భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో మహాత్మా గాంధీజీకి విశిష్టమైన స్థానం ఉంది. సత్యం, అహింస, శాంతియుత పోరాటాన్ని ఆయుధాలుగా చేసుకొని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చారు. సామాన్య ప్రజలను స్వాతంత్ర్య ఉద్యమంలో భాగస్వాములను చేసి దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. తండ్రి కరంచంద్ గాంధీ, తల్లి పుత్లీబాయి. చిన్ననాటి నుంచే తల్లి ప్రభావంతో నిజాయితీ, నైతిక విలువలు, ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకున్నారు.
విద్యాభ్యాసం:
ప్రాథమిక విద్యను పోర్‌బందర్, రాజ్‌కోట్ ప్రాంతాల్లో అభ్యసించారు మహాత్మాగాంధీ. తర్వాత న్యాయ విద్య కోసం 1888లో ఇంగ్లాండ్‌కు వెళ్లి లండన్‌లో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. 1891లో బారిస్టర్‌గా అర్హత సాధించి భారత్ కు తిరిగి వచ్చారు.
న్యాయవాదిగా దక్షిణాఫ్రికాలో సేవలు:
1893లో న్యాయవాదిగా పనిచేయడానికి దక్షిణాఫ్రికాకు వెళ్లారు. అక్కడ భారతీయులు ఎదుర్కొంటున్న జాతి వివక్షను ప్రత్యక్షంగా చూశారు. రైలులో ఫస్ట్‌క్లాస్ టికెట్ ఉన్నప్పటికీ కేవలం వర్ణ వివక్ష కారణంగా బయటకు పంపిన సంఘటన ఆయన జీవితంలో కీలక మలుపుగా మారింది. అక్కడే సత్యాగ్రహం, అహింసా పోరాట పద్ధతులను అభివృద్ధి చేశారు.
భారతదేశానికి తిరిగి రావడం:
1915లో దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన గాంధీజీ దేశంలోని ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి విస్తృతంగా పర్యటించారు. గోపాలకృష్ణ గోఖలేను తన రాజకీయ గురువుగా భావించారు.
స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ పాత్ర:
భారత స్వాతంత్ర్యోద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చడంలో గాంధీజీ కీలక పాత్ర పోషించారు. చంపారన్ సత్యాగ్రహం, ఖేడా సత్యాగ్రహం, అహ్మదాబాద్ మిల్లు కార్మికుల ఉద్యమం ద్వారా ప్రజా సమస్యలపై పోరాటానికి నాయకత్వం వహించారు.
గాంధీజీ నినాదాలు:
“చేయండి లేదా చావండి” (Do or Die) అనే పిలుపు 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రజల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించింది.
“సత్యమే నా దేవుడు” అనే భావన ఆయన జీవిత తత్వానికి ప్రతిబింబం.
* గాంధీజీ 5సంవత్సరాల పాటు పూర్తిగా పండ్లు, గింజలు, నట్స్ మాత్రమే తీసుకున్నారు. అనారోగ్య సమస్యలు రావడంతో శాకాహారం తీసుకున్నారు. ఆహారం విషయంలో గాంధీజీ దశాబ్దాలపాటు ప్రయోగాలు నిర్వహించారు. ది మోరల్ బేసిస్ ఆఫ్ వెజిటేరియనిజం పేరుతో ఓ పుస్తకాన్ని కూడా రాశారు.
*పాల ఉత్పత్తులను పూర్తిగా మానేయాలని భావించారు. కానీ ఆరోగ్యం దెబ్బతినడంతో తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. తర్వాత మేకపాలు తాగడం ప్రారంభించారు. తాజాగా ఉండే మేక పాల కోసం కొన్ని సమయాల్లో ఆయన తన ప్రయాణాల్లోనూ మేకను తన వెంట తీసుకెళ్లేవారు.
* భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, గాంధీజీ మొదట చంపారన్ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఆయన నీలిమందు రైతుల తరఫున పోరాడారు. ఆ సమయంలో రైతులు ఆయనను మహాత్మా అని పిలవడం ప్రారంభించారు. స్వాతంత్ర్య పోరాటానికి ముందు, గాంధీజీ మహిళల హక్కుల కోసం పోరాడారు. ఆయన అంటరానితనం నిర్మూలనను, మతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి సమాన హక్కులను డిమాండ్ చేశారు.
* గాంధీ నిరాహార దీక్షలో ఉన్నప్పుడు, ఆయన ఫోటోలు తీయడానికి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతించలేదు. ఎందుకంటే, ఆయన ఫోటోలు ప్రచురిస్తే స్వాతంత్ర్య పోరాటం మరింత తీవ్రమవుతుందని వారు భయపడ్డారు.
* గాంధీజీకి 13 ఏళ్ల వయసులో వివాహం జరిగింది. కస్తూర్బా ఆయన కంటే ఒక సంవత్సరం పెద్దది. వారి వివాహ బంధం 62 సంవత్సరాలు కొనసాగింది.
* గాంధీ ఒక అహింసావాది. మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ పక్షాన పోరాడటానికి ఆయన భారతీయులను ఎంచుకున్నారు. అయితే, రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశం పాల్గొనడాన్ని ఆయన విమర్శించారు.
* గాంధీ భార్య కస్తూర్బా, 1944లో ఆగఖాన్ ప్యాలెస్‌లో నిర్బంధంలో ఉండగా మరణించారు. ఆమె మరణాన్ని మన దేశంలో ఫిబ్రవరి 22న మాతృ దినోత్సవంగా జరుపుకుంటారు. ఆమె మరణించినప్పుడు గాంధీ కూడా జైలులోనే ఉన్నారు. ఆయన కూడా మలేరియాతో చనిపోతారేమోనన్న భయంతో బ్రిటీష్ వారు ఆయన్ను జైలు నుండి విడుదల చేశారు.
* గాంధీ ఇంగ్లాండ్‌లో న్యాయశాస్త్రం అభ్యసించినట్లు తెలిసింది. అక్కడ ఆయన ఉపాధ్యాయులు గాంధీ చేతిరాత బాగోలేదని పదేపదే వ్యాఖ్యానించేవారు.
* గాంధీ 1948, జనవరి 30న హత్యకు గురయ్యారు. గాడ్సే ఆయనను మూడుసార్లు కాల్చాడు. మహాత్మునికి వీడ్కోలు పలకడానికి 20 లక్షల మందికి పైగా ప్రజలు వచ్చారు. ఆయన అంత్యక్రియలకు హాజరైన జనం 8 కిలోమీటర్ల మేర బారులు తీరారు.
* గాంధీ ఐదుసార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. కానీ ఆయనకు అది లభించలేదు. దీంతో, భారతదేశం గాంధీ శాంతి బహుమతిని ప్రదానం చేయడం ప్రారంభించింది.
* 1959లో, తమిళనాడులోని మదురైలో గాంధీ మెమోరియల్ మ్యూజియం స్థాపించారు. గాడ్సే గాంధీని కాల్చినప్పుడు, ఆయన బట్టలు రక్తంతో తడిసిపోయాయి. ఆ వస్త్రం నేటికీ మ్యూజియంలో ఉంది.
ముగింపు:
మహాత్మా గాంధీజీ జీవితం సత్యం, అహింస, సేవ, త్యాగం, నైతిక విలువలకు ప్రతీక. స్వాతంత్ర్యం కోసం గాంధీజీ చేసిన పోరాటం భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పాలి. గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలు నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకం. విద్యార్థులు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని దేశ సేవ, సామాజిక బాధ్యత, మానవతా విలువలను పెంపొందించుకోవాలి.