Success Story: రూ.50 వేలతో ప్రయాణం.. కష్టాలను జయించి.. ప్రపంచ స్థాయి టెక్నాలజీని సృష్టించిన తెలుగు ఇంజనీర్ సక్సెస్ స్టోరీ
Success Story: ఒకప్పుడు పూట గడవడానికే చౌక బంగాళాదుంపలు తింటూ రోజులు నెట్టుకొచ్చిన పరిస్థితులు.. మరోవైపు శరీరాన్ని కుంగదీస్తున్న పార్కిన్సన్స్ వ్యాధి.. సాధారణంగా ఎవరైనా ఇలాంటి స్థితిలో చేతులెత్తేస్తారు. కానీ తెలుగు ఇంజనీర్ అభిరామ్ తురగ మాత్రం తన ఆశయానికి ఎదురొచ్చిన ప్రతి సవాలునూ నిచ్చెనగా మార్చుకున్నారు. వోల్వో, క్వాల్‌కామ్ లాంటి దిగ్గజ సంస్థల్లో అత్యున్నత స్థాయికి చేరుకున్నా, సంతృప్తి చెందక.. తన ఇంటి గ్యారేజీ నుంచే అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీ ఆస్తులను సృష్టించారు. ఆయన సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం..
Success Story: గొప్ప ప్రయాణాలు ఎప్పుడు కష్టాలతోనే మొదలవుతాయని అంటారు. వర్తమానం కంటే భవిష్యత్ భిన్నంగా ఉండాలనే బలమైన సంకల్పంతో మాత్రమే సరికొత్త చరిత్ర ప్రారంభం అవుతుంది. అన్ని వనరులతో మొదలుపెట్టిన వారి కంటే.. ఏమీ లేకుండా ప్రారంభించి అద్భుతాలు సృష్టించిన వారే చరిత్రలో నిలుస్తారు. 2010లో భారత్ నుంచి కేవలం రూ.50 వేల నగదుతో స్వీడన్‌లో అడుగుపెట్టి.. నేడు 64 యాజమాన్య టెక్నాలజీ ఆస్తులతో కూడిన అంతర్జాతీయ మొబిలిటీ సంస్థను ఒంటిచేత్తో స్థాపించిన తెలుగు ఇంజనీర్ అభిరామ్ తురగ కథ కూడా అలాంటిదే. సాధారణంగా ఓ స్టార్టప్‌ను ప్రారంభించాలంటే భారీ ఇన్వెస్ట్‌మెంట్.. పెద్ద టీమ్, అత్యాధునిక మౌలిక వసతులు కావాలని అందరు అనుకుంటారు. కానీ పరిమిత వనరులతోనే అద్భుతాలు సృష్టించవచ్చని ఆయన నిరూపించారు.
అభిరామ్ తురగ ప్రయాణం 2010లో స్వీడన్‌లో అడుగుపెట్టడంతో మొదలైంది. లిన్నేయస్ యూనివర్సిటీలో 'డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్- కంట్రోల్ సిస్టమ్స్' విభాగంలో మాస్టర్స్ చదవడానికి వెళ్లిన ఆయన.. పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ తన కెరీర్‌ను నిర్మించుకున్నారు. కొత్త దేశం, తీవ్రమైన చలి, తెలియని భాషల మధ్య బతకడం పెను సవాలుగా మారింది. ట్యూషన్ ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం ఆయన దొరికిన ప్రతి పార్ట్‌టైమ్ ఉద్యోగం చేశారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో చౌకగా దొరికే బంగాళా దుంపలను మాత్రమే తింటూ నెలల తరబడి గడిపారు.
ఇలా కష్టాలను ఎదుర్కొంటునే మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత.. అద్భుతమైన కార్పొరేట్ కెరీర్‌ను అభిరామ్ నిర్మించుకున్నారు. 2012 నుంచి 2016 వరకు మోటార్ కంట్రోల్ సాఫ్ట్‌వేర్, HIL వాలిడేషన్, సేఫ్టీ కాన్సెప్ట్స్‌పై పనిచేశారు. ఎలక్ట్రిక్ డ్రైవ్స్ నుంచి వాహన స్థాయి ఆటోనమీ వరకు లాంగ్‌హాల్ ట్రక్కులు, మైనింగ్ అప్లికేషన్ల కోసం గ్లోబల్ సిమ్యులేషన్ ప్లాట్‌ఫామ్‌ను కూడా డెవలప్ చేశారు.
2016 నుంచి 2019 వరకు వోల్వో కార్స్‌లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ (ACC), కర్వ్ స్పీడ్ అసిస్ట్, స్పీడ్ లిమిట్ అసిస్ట్ వంటి కీలక ప్రొడక్షన్ ఫంక్షన్లకు పూర్తి స్థాయి బాధ్యత వహించారు. ఆటోపైలట్ కాన్సెప్ట్ డెవలప్‌మెంట్‌కు నాయకత్వం వహించడంతో పాటు ISO 26262 సేఫ్టీ అసెస్‌మెంట్లు పూర్తి చేశారు. 2019లో DriveMe అటానమస్ డ్రైవింగ్ ప్రోగ్రామ్‌లో ఆటోనామస్ డ్రైవింగ్ ప్రోగ్రామ్‌లోని 'డెసిషన్ & కంట్రోల్' విభాగంలో మూడు బృందాలకు ఫంక్షన్ ఓనర్, ప్రొడక్ట్ ఓనర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత నాలుగు కొత్త ప్రపంచ స్థాయి కార్ల తయారీ సంస్థలకు (OEMs) డెసిషన్ & కంట్రోల్ సాఫ్ట్‌వేర్‌ను స్కేల్ చేశారు. సాంకేతిక స్థిరీకరణకు నాయకత్వం వహించారు.
క్వాల్‌కామ్ వంటి సంస్థలో స్థిరమైన కెరీర్ ఉన్నా.. సొంతంగా ఏదైనా నిర్మించాలనే ఆలోచన మాత్రం అభిరామ్‌ను వెంటాడుతూనే ఉంది. స్వీడన్‌లో తన సొంత సంస్థను నిర్మించేందుకు పౌరసత్వం అవసరమని భావించి.. అందుకోసం వేచి చూశారు. 'స్వీడిష్ పౌరసత్వం' లభించిన వెంటనే, అత్యధిక వేతనం లభించే క్వాల్‌కామ్ సీనియర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అదే సమయంలో ఆయన కుటుంబ పరిస్థితులు, ఆరోగ్య సమస్యలు కూడా సవాల్ విసిరాయి. భార్య ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే అభిరామ్ ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. పార్కిన్సన్స్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నా.. ఆయన తన లక్ష్యాన్ని మాత్రం వదులుకోలేదు. ఉదయం కన్సల్టింగ్ పని చేసి కుటుంబ ఖర్చులు, కంపెనీ అవసరాలకు ఆదాయం సమకూర్చేవారు. సాయంత్రం, రాత్రి మాత్రం తన సొంత వాహనాలపై పనిచేసేవారు. ఈ రెండు పనులను ఒకేసారి చేయడాన్ని ఆయన “బ్యాట్‌మెన్‌లా రెండు షిఫ్టులు పనిచేశాను” అంటూ అభివర్ణించారు.
అనుభవజ్ఞులైన ఇంజనీర్లను నియమించుకునే స్తోమత లేకపోవడం.. చేరిన ఇంటర్న్‌లు తరచూ మానేస్తుండటంతో CAD డిజైన్, PCB డిజైన్, ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్, మొబైల్ యాప్ డెవలప్‌మెంట్, బ్యాకెండ్ సిస్టమ్స్, AI అల్గారిథమ్స్ వంటి ప్రతి ఒక్క టెక్నాలజీని స్వయంగా నేర్చుకున్నారు. గోథెన్‌బర్గ్‌లోని హిసింగ్స్ బాకాలో ఉన్న తన ఇంటి వర్క్‌షాప్‌లోనే ఒంటరిగా పూర్తి ప్రాజెక్టును నిర్మించారు.
అభిరామ్ రెండు అనుబంధ సంస్థలు స్వీడన్‌లోని తురగ మోటార్స్ AB, భారత్‌లోని తురగ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించారు. భారీ వ్యయంతో కూడిన ‘గిగాఫ్యాక్టరీ’ విధానాలకు భిన్నంగా, తక్కువ పెట్టుబడితో ఎక్కువ సాంకేతిక సామర్థ్యాన్ని సాధించే ‘యాంటీ-గిగాఫ్యాక్టరీ’ మోడల్‌ను ఆయన రూపొందించారు. స్వీడిష్ డిజైన్, భద్రతా ప్రమాణాలను భారతీయ తయారీ రంగానికి జోడించడమే దీని ముఖ్య ఉద్దేశం.
తురగ మోటార్స్ సంస్థ తన వినూత్న సాంకేతిక పర్యావరణ వ్యవస్థతో మొబిలిటీ రంగంలో కీలక పురోగతి సాధించింది. ప్రకృతి సహజ నిర్మాణాలను అనుకరించే బయోమిమెటిక్ ఫ్రేమ్‌వర్క్, పట్టణ వాహనాల కోసం KARNA™, వైమానిక వాహనాల కోసం SilkTruss™ ప్లాట్‌ఫారమ్‌లను సంస్థ అభివృద్ధి చేసింది. వీటికి అనుసంధానంగా పూర్తి స్థాయి AI కంట్రోల్ ఆర్కిటెక్చర్‌ను రూపొందించింది. ఈ సాంకేతికత ఆధారంగా WBR యుటిలిటీ, BWR అర్బన్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలతో పాటు, హైబ్రిడ్ ఎనర్జీ, అటానమస్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ వంటి 17 రక్షిత ఆవిష్కరణలు కలిగిన 'ఫ్లైగా' eVTOL ఎగిరే వాహన కాన్సెప్ట్‌ను సంస్థ తీర్చిదిద్దింది. ఈ ఆవిష్కరణలన్నింటికీ రక్షణగా కంట్రోలర్ ట్యూనింగ్, ఫర్మ్‌వేర్ ఆప్టిమైజేషన్ ట్రేడ్ సీక్రెట్స్‌తో పాటు 14 ట్రేడ్‌మార్క్‌లు, 5 రిజిస్టర్డ్ డిజైన్ కాంపోనెంట్లను సంస్థ పొందింది. ఈ ఆధునిక సాంకేతిక ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకువచ్చే దిశగా తురగ మోటార్స్ ఇటీవల ప్రముఖ బొండడా గ్రూప్‌తో వ్యూహాత్మక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.
ఈ సందర్భంగా అభిరామ్ మాట్లాడుతూ.. స్టార్టప్‌లు పూర్తిగా సిద్ధమయ్యేంత వరకు వేచి చూడకుండా వెంటనే పనులు ప్రారంభించాలని.. ఎంత కఠిన పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు స్పష్టమైన విజన్ అత్యవసరమని అన్నారు. సౌకర్యాలకు అలవాటుపడకుండా లక్ష్యం కోసం కష్టాలను ఓర్చుకుని నిలబడేవారే ఏదైనా సాధించగలరని.. తాము సృష్టించిన మేధో సంపత్తికి చట్టపరమైన రక్షణ కల్పించుకోవడం వ్యాపార విస్తరణలో కీలకమని ఆయన వివరించారు. భవిష్యత్ ఎప్పుడూ అదృశ్యమైన అవకాశాలను ముందుగానే చూడగలిగేవారిదేనని, తన జీవితాంతం ఆ లక్ష్యాన్నే వెంబడించానని ఆయన చెప్పారు.