ఏపీలో పురుడు పోసుకున్న కొత్త పార్టీ.. విజయ్ సాయి రెడ్డి పార్టీ జెండా.. అజెండా ఇదే..
Vijayasai Reddy New Party: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. మాజీ ఎంపీ వైయస్ఆర్సీపీ పార్లమెంటరీ పక్ష నేతగా వ్యవహరించిన విజయి సాయి రెడ్డి ఏపీ గడ్డపై కొత్త పార్టీని ప్రకటించారు. అంతేకాదు పార్టీ జెండా.. అజెండా అన్ని ప్రకటించారు.
Parivartan Rajniti Party: రాజకీయాల్లో పరివర్తన తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. 'పరివర్తన రాజనీతి పార్టీ' (PRP) పేరుతో సరికొత్త పొలిటికల్ ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించారు. విజయవాడ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ పేరుతో పాటు జెండాతో పాటు అజెండా కూడా ప్రకటించారు. 'దేశం కోసం.. ధర్మం కోసం' అనే నినాదంతో పార్టీ ప్రజల్లోకి వెళ్లనున్నట్టు ప్రకటించారు. కాషాయం, తెలుపు రంగులతో మధ్యలో ధర్మచక్రంతో పార్టీ జెండాను రూపొందించారు.
యువతకు అధిక సీట్లు..
పార్టీ ఆవిర్భావం సందర్భంగా విజయసాయి రెడ్డి తమ రాజకీయ లక్ష్యాలను వెల్లడించారు. యూత్‌కు రాజకీయాల్లో ఎక్కువ అవకాశాలు కల్పించడమే ప్రధాన ఉద్దేశాల్లో ఒకటిగా పేర్కొన్నారు.కొత్త పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే స్థానాల్లో 66 శాతం ఇప్పటి యూత్‌కు కేటాయించున్నట్టు చెప్పారు. ముఖ్యంగా 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న యువతకు పొలిటికల్‌గా వారికి అవకాశాలు కల్పించనున్నట్లు గతంలోనే తీర్మానించడమే కాదు. దాన్ని ఆచరణలోకి తీసుకొస్తామని ప్రకటించారు. యువత నాయకత్వంలో కొత్త తరహా రాజకీయాలను తీసుకురావాలన్నది పార్టీ ఆలోచనలో భాగం అన్నారు. అయితే ఈ పార్టీ పేరు గతంలో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీకి షార్ట్ కట్ నేమ్ ఉండటం విశేషం. ఆల్రెడీ ప్రజలకు తెలిసిన పీఆర్‌పీ పార్టీ పేరు వచ్చేలా కొత్త రాజకీయ పార్టీ పెట్టడం వ్యూహంలో భాగంగా తెలుస్తుంది.
ఏపీలో మరో రాజకీయ ప్రత్యామ్నాయం అవసరం..
ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ప్రజలకు మరో ప్రత్యామ్నాయం అవసరమని విజయసాయిరెడ్డి గతంలో ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా సంక్షేమం, అభివృద్ధి ప్రధాన అంశాలుగా కొత్త పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళాతనని చెప్పుకొచ్చారు. విద్య, ఉపాధి, వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ వంటి అంశాలకు తమ అజెండాలో ప్రాధాన్యం ఇస్తామన్నారు.
విజయ్ సాయి రెడ్డి రాజకీయం..
నవంబర్ 11వ తేదీ, ఉదయం 11 గంటల 11 నిమిషాలకు కొత్త పార్టీని ప్రకటించడం విశేషం. అందుకు అనుగుణంగా విజయవాడలో పార్టీ ఆవిర్భావ కార్యక్రమం ఎంతో అట్టహాసంగా జరిగింది. తాజాగా పార్టీ పేరు, జెండా, నినాదాన్ని ప్రకటించడంతో ఏపీ రాజకీయాల్లో మరో పార్టీ తన ప్రస్థానాన్ని ప్రారంభించినట్లయింది.అయితే ఆయన ప్రకటించిన అంశాలు అన్ని పార్టీలు చెప్పినట్టు రొటీన్‌గా రొడ్డుకొట్టుడు వ్యవహారంగా ఉందే తప్ప కొత్తగా లేదనే వాదన వినిపిస్తోంది. పరివర్తన రాజనీతి పార్టీతో విజయ సాయి రెడ్డి నిజంగానే ఏపీ రాజకీయాల్లో పరివర్తన తీసుకొస్తారా లేదా అనేది చూడాలి మరి.