AP Govt Employees: ప్రభుత్వ శాఖల్లో డిజిటల్ సేవలను మరింత వేగవంతం చేయడంతో పాటు ఉద్యోగుల పనితీరును సులభతరం చేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోజుకో పోర్టల్.. పనికో పాస్‌వర్డ్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా అన్ని అప్లికేషన్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన 'ఏపీ సింగిల్ సైన్-ఆన్' (APSSO) విధానాన్ని అన్ని ప్రభుత్వ శాఖల్లో తక్షణమే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇక నుంచి ప్రభుత్వ విభాగాలు, అనుబంధ సంస్థలు వాడే ప్రతి డాష్‌బోర్డు, యాప్‌ను sso.ap.gov.in వేదికతో మాత్రమే లింక్ చేయాల్సి ఉంటుంది.
ప్రస్తుతం సచివాలయ స్థాయి నుంచి క్షేత్రస్థాయి ఉద్యోగుల వరకు వేర్వేరు సేవల కోసం వివిధ రకాల యూజర్ ఐడీలు, పాస్‌వర్డులను గుర్తుపెట్టుకోవాల్సి వస్తోంది. పాస్‌వర్డ్ మర్చిపోయిన సమయంలో మళ్లీ రీసెట్ చేసేందుకు చాలా సమయం వృథా అవుతోంది. ఈ సమస్యకు తెరదించుతూ APSSO విధానాన్ని ప్రభుత్వం తీసుకుచ్చింది. ఇక నుంచి ఒకే ఒక్క అఫీషియల్ ఎంప్లాయ్ ఐడీతో ప్రభుత్వ అప్లికేషన్లన్నింటినీ యాక్సెస్ చేయవచ్చు. ఉద్యోగి హోదా, విధులు, అధికార పరిధి ఆధారంగానే వారికి కావాల్సిన పోర్టల్స్ మాత్రమే స్క్రీన్‌పై కనిపిస్తాయి. దీనివల్ల అనధికారిక లాగిన్లు తగ్గి డేటా భద్రత గణనీయంగా పెరుగుతుంది.
ఈ సరికొత్త విధానం కేవలం శాశ్వత ఉద్యోగులకే కాకుండా.. ప్రభుత్వం కింద పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో పాటు అటానమస్ సంస్థల్లోని ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. ఇక పాత లాగిన్ పద్ధతులకు ప్రభుత్వం పూర్తిగా క్లోజ్ చేసింది. పోర్టళ్లను APSSOతో అనుసంధానించిన వెంటనే పాత ఇండివిడ్యువల్ లాగిన్ ఐడీలను శాశ్వతంగా రద్దు చేయాలని ఆదేశించింది. అంతేకాదు భవిష్యత్తులో ఏ శాఖ కూడా ఈ సింగిల్ సైన్-ఆన్ ఫీచర్ లేకుండా కొత్తగా ఎలాంటి పోర్టళ్లు గానీ, సాఫ్ట్‌వేర్లను గానీ కొనుగోలు చేయడానికి లేదా డెవలప్ చేయడానికి వీల్లేదని నిబంధనల్లో స్పష్టం చేసింది. పరిపాలనలో జవాబుదారీతనం పెంచడం, టెక్నీకల్ సమస్యలను తగ్గించి ఉద్యోగుల సమయాన్ని ఆదా చేయడమే లక్ష్యంగా తెచ్చిన ఈ ఏకీకృత లాగిన్ విధానం పాలనలో సరికొత్త మార్పునకు నాంది పలకనుంది.