Price Hike: ధరల పెరుగుదల నుంచి ఏపీ ప్రజలకు భారీ ఊరట.. సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్!
CM Chandrababu Announces Good News About Essential Commodities Price Hike: నిత్యావసర వస్తువుల ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు, వంటనూనె అందించాలని.. డిసెంబర్ మొదటి వారం నుంచే అందించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Essential Commodities Price Hike: పప్పు, బియ్యం, వంటనూనెల ధరలు పెరిగిపోవడంతో ప్రజలపై ఆర్థిక భారం తీవ్రమైన వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీపి కబురు వినిపించారు. ధరల భారం నుంచి ఉపశమనం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై కీలక ఆదేశాలు ఇచ్చారు. నిత్యావసరాలు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి ఆదేశించారు. అంతేకాకుండా రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు కందిపప్పు, పామాయిల్ అందించాలని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
నిత్యావసరాల ధరల నియంత్రణపై బుధవారం సీఎం చంద్రబాబు సచివాలయంలో సమీక్ష చేశారు. రాబోయే ఏడాదిన్నర కాలానికి సంబంధించి నిరంతరం మార్కెట్ ధరలు, ద్రవ్యోల్బణాన్ని బేరీజు వేస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ చర్యలతో గత నెలతో పోలిస్తే రాష్ట్రంలో నాలుగు వెరైటీల బియ్యం ధరలు 8 నుంచి 18 శాతం వరకు తగ్గాయని అధికారులు సీఎం చంద్రబాబుకు తెలిపారు. బియ్యం విక్రయాల విషయంలో ప్రభుత్వం ధరల పట్టికను ప్రకటించడంతోపాటు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా నిరంతర నిఘా పెట్టడంతో ధరలు తగ్గాయని వివరించారు.
నిత్యావసర వస్తువుల ధరల భారం సామాన్య ప్రజలపై ఏమాత్రం పడకూడదని.. ప్రభుత్వ చర్యలతో ప్రజలకు ఊరట కలగాలని సీఎం చంద్రబాబు తెలిపారు. వినియోగదారుడిని ఆదుకోవడమే ప్రభుత్వ ప్రథమ బాధ్యత అని స్పష్టం చేశారు. ఉల్లిపాయల ధర కూడా 28 శాతం మేర తగ్గిందని.. పామాయిల్ ధరలు 5 శాతం తగ్గి లీటర్ రూ.145కు చేరిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కందిపప్పు ధరల్లో ఇంకా నియంత్రణ రావాలని తెలిపారు.
ధరల పెరుగుదల నేపథ్యంలో ప్రజలను ఆదుకునేందుకు రేషన్ కార్డు ద్వారా తక్కువ ధరకే నిత్యావసర వస్తువులు ఇవ్వడంపై అధికారులతో సీఎం చంద్రబాబు ఆరా తీశారు. రేషన్ ద్వారా కందిపప్పు, పామాయిల్‌ను ఎప్పటినుంచి సరఫరా చేస్తారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. రేషన్ దుకాణాల ద్వారా వాటిని అందించే దిశగా చర్యలు తీసుకుంటామని.. అయితే డిసెంబర్ మొదటి వారం నుంచి రేషన్ దుకాణాల ద్వారా అందించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
కిలో రూ.100కే కందిపప్పు, లీటర్ పామాయిల్ నూనె రూ.125కు రేషన్‌కార్డు లబ్ధిదారులకు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. డిసెంబర్ మొదటి వారం నుంచి రేషన్ దుకాణాల్లో ఇవ్వాలని సూచించారు. కందిపప్పు ధరను ఇంకా అదుపులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి కేటాయించిన 40,300 మెట్రిక్ టన్నుల కందులను సరఫరా చేయడంతోపాటు.. రాష్ట్రంలో కందిపప్పు ఉత్పత్తి, వినియోగం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేలా కంది సాగును ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు.
ధరణి బ్రాండ్ పేరుతో ప్రభుత్వం సరఫరా చేస్తున్న 26 కిలోల బస్తా సూపర్-ఫైన్ బియ్యానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని అధికారులు సీఎం చంద్రబాబు వివరించారు. ఇప్పటివరకు 2.25 లక్షల మందికి పైగా వినియోగదారులు 59,662 క్వింటాళ్ల బియ్యాన్ని కొనుగోలు చేశారని తెలిపారు. ప్రస్తుతం 286 కేంద్రాల్లో ఈ విక్రయాలను జరుపుతున్నామని.. వీటిని 500 కేంద్రాలకు విస్తరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. బియ్యం సహా వివిధ నిత్యావసరాలు బ్లాక్ మార్కెట్‌కు తరలించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎల్ నినో ప్రభావంతో వివిధ పంటల దిగుబడులపై పడే ప్రభావాన్ని ముందుగానే అంచనా వేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఉల్లి, టమాట ధరలు రానున్న రోజుల్లో మరింత తగ్గుతాయని అగ్రివాచ్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయని.. కూరగాయల ధరలు పెరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. కృష్ణా డెల్టా వంటి ప్రాంతాల్లో తక్కువ నీటితో పండే సన్నరకం వరి సాగును ప్రోత్సహించాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.