Maddimadugu Temple: తెలంగాణ ముఖ్యమంత్రి తన సొంత జిల్లాలో పర్యటించనున్నారు. తన సొంత జిల్లాలో రేవంత్ రెడ్డి అభివృద్ధి జాతర ప్రారంభించబోతున్నారు. అభివృద్ధ పనుల ప్రారంభోత్సవంతోపాటు శంకుస్థాపనలు చేయనున్నారు. మొత్తం రూ.450 కోట్ల పనులకు శ్రీకారం చుట్టనున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో రేపు తెలంగాణ ముఖ్యమంత్రి విస్తృత పర్యటన చేయబోతుండగా.. దాదాపు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి నాగర్‌కర్నూల్ జిల్లా పర్యటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రేపు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. రేపు మధ్యాహ్నం మద్దిమడుగులో సంత్ సేవాలాల్ మహారాజ్ భారీ విగ్రహ ఏర్పాటుకు.. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం హెలికాఫ్టర్ట్‌లో అచ్చంపేటకు చేరుకోని.. హెలిప్యాడ్ నుంచి పాదయాత్రగా బహిరంగసభా ప్రాంగణానికి చేరుకుంటారు. బహిరంగ సభ ప్రాంగణంలో మొత్తం రూ.450 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బహిరంగ సభ వేదికగా కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అంతేకాకుండా చేయూత కొత్త పెన్షన్ల పంపిణీని కూడా చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి కీలక ప్రసంగం చేస్తారు.
రూ.450 కోట్లతో చేసే శంకుస్థాపనలు ఇవే
మద్దిమడుగులో..
రూ.15 కోట్లతో పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో హరిత హోటల్ నిర్మాణం
రూ.18 కోట్లతో పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పనులు
రూ.38 కోట్లతో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ భారీ విగ్రహం, ఇతర అభివృద్ధి పనులు
అచ్చంపేట బహిరంగ సభ ప్రాంగణంలో..
రూ.274.32 కోట్లతో నాగర్‌కర్నూల్ జిల్లాలో బీటీ రోడ్ల అభివృద్ధి
రూ.29.65 కోట్లతో నాగర్‌కర్నూల్, పెద్దకొత్తపల్లి, వెల్దండ ప్రాంతాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
రూ.25 కోట్లతో అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనులు
రూ.18.105 కోట్లతో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో 130 అదనపు తరగతి గదుల నిర్మాణం
రూ.16 కోట్లతో అచ్చంపేట మున్సిపాలిటీ పరిధిలో నీటి సరఫరా మౌలిక సదుపాయాల కల్పన
రూ.14 కోట్లతో అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో నూతన ఐటీడీఏ భవన నిర్మాణం
రూ.2 కోట్లతో అచ్చంపేట పట్టణంలో ఆదివాసీ భవన్ నిర్మాణం