• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /Zee Salaam Awards 2026: జీ సలామ్‌ డెక్కన్‌ అవార్డ్స్‌ 2026పై మంత్రి ఉత్తమ్‌ ప్రశంసలు

Zee Salaam Awards 2026: జీ సలామ్‌ డెక్కన్‌ అవార్డ్స్‌ 2026పై మంత్రి ఉత్తమ్‌ ప్రశంసలు

Uttam Kumar Reddy Appreciates To Zee Network For Zee Salaam Deccan Awards 2026: సమాజానికి ఆదర్శంగా నిలుస్తూ వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న ప్రతిభావంతులను గుర్తించి 'డెక్కన్ ఐకాన్స్' పేరిట అవార్డులు అందించడం అభినందనీయమని తెలంగాణ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి జీ నెట్‌వర్క్‌ను అభినందించారు. అవార్డులతో గౌరవించడం మరెంతో మందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 25, 2026, 23:42 IST|Updated: Nov 25, 2026, 23:46 IST
joinshare
Zee Salaam Awards 2026: జీ సలామ్‌ డెక్కన్‌ అవార్డ్స్‌ 2026పై మంత్రి ఉత్తమ్‌ ప్రశంసలు
Image Credit: Source: N Uttam Kumar Reddy Twitter (X)

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Price Hike: ధరల పెరుగుదల నుంచి ఏపీ ప్రజలకు భారీ ఊరట.. సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్‌!

Price Hike: ధరల పెరుగుదల నుంచి ఏపీ ప్రజలకు భారీ ఊరట.. సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్‌!

2

Zee Salaam Awards 2026: జీ సలామ్‌ డెక్కన్‌ అవార్డ్స్‌ 2026పై మంత్రి ఉత్తమ్‌ ప్రశంసలు

3

Achampet: రేపు సొంత జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన.. రూ.450 కోట్లతో అభివృద్ధి జాతర!

4

Kavitha: ఇంటర్‌ బోర్డు విలీనంపై కవిత ఆగ్రహం.. రేవంత్‌ రెడ్డిపై మండిపాటు

5

Raptadu Girl Incident: మృత్యువుతో పోరాడి గెలిచిన రాప్తాడు బాలిక.. మణిపాల్ ఆస్పత్రిలో కేక్ కట్ చేసి సంబరాలు.. వీడియో వైరల్..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Zee Salaam Deccan Awards 2026: 'తెలంగాణ అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. హైదరాబాద్ అంటేనే గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీక. ఈ నగరం కులమతాలకు అతీతంగా అందరినీ అక్కున చేర్చుకుంటుంది. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, ఇతర మతాలవారు అన్నదమ్ముల్లా కలిసి జీవించే గొప్ప సంస్కృతి మన హైదరాబాద్ సొంతం. ఇలాంటి చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం ఉన్న డెక్కన్ ప్రాంతంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని ఒకే వేదికపై సత్కరించడం ఎంతో ప్రత్యేకమైన విషయమని జీ నెట్‌వర్క్‌ను అభినందించారు.

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో జీ సలాం ఉర్దూ చానల్‌ 'డెక్కన్ ఐకాన్స్ అవార్డు-2026' పేరిట సమాజంలో విశేష సేవలు అందిస్తున్న వారిని సత్కరించి గౌరవించింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అవార్డులను అందించిన అనంతరం ప్రసంగం చేశారు.

'ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జీ సలాం, జీ నెట్‌వర్క్ యాజమాన్యానికి నా ప్రత్యేక అభినందనలు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న ప్రతిభావంతులను గుర్తించి, వారిని డెక్కన్ ఐకాన్స్ అవార్డులతో సత్కరించడం నిజంగా అభినందించదగినది' అని తెలంగాణ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. ఒక వ్యక్తి సాధించిన విజయం వెనుక ఎంతో కష్టం, పట్టుదల, కృషి ఉంటాయని.. అలాంటి వారిని గుర్తించి గౌరవించడంతో మరెంతో మందికి స్ఫూర్తి అని పేర్కొన్నారు.

అనంతరం ప్రసంగంలో మైనార్టీ సంక్షేమం - సమానత్వం - విద్య - అభివృద్ధిపై ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కీలక విషయాలు తెలిపారు. 'కాంగ్రెస్‌కు మైనార్టీల సంక్షేమం ఒక నిరంతర నిబద్ధత. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మైనార్టీల సంక్షేమంతో విడదీయలేని అనుబంధం ఉంది' అని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రతిసారీ మైనార్టీల విద్యా, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చిందని చెప్పుకొచ్చారు. కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించడం, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవడం తమ ప్రభుత్వ విధానమని ప్రకటించారు.

Zee సలామ్ మరియు Zee నెట్‌వర్క్ సంయుక్తంగా నిర్వహించిన దక్కన్ ఐకాన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రసంగించాను.నా ప్రసంగంలో, హైదరాబాద్ యొక్క బహుళ సాంస్కృతిక స్వరూపం,ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, అనుకూలమైన వాతావరణం మరియు శతాబ్దాల నాటి మత సామరస్య సంప్రదాయం వంటివి ప్రపంచ వేదికపై ఈ నగరానికి ఒక ప్రత్యేకమైన పోటీ ప్రయోజనాన్ని ఎలా అందించాయో వివరించాను. హైదరాబాద్ గంగా-జమున సంస్కృతికి ప్రతిరూపం. దేశంలోని లేదా ప్రపంచంలోని ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఇక్కడ తమ సొంత ఇంటిలో ఉన్నట్లు భావిస్తారు. ఈ అద్భుతమైన సమ్మిళిత స్వభావమే, హైదరాబాద్ ప్రపంచ పెట్టుబడిదారులకు అత్యంత ఇష్టమైన గమ్యస్థానంగా ఎదగడానికి గల కారణాలలో ఒకటి.

— Uttam Kumar Reddy (@UttamINC) November 25, 2026

'మైనార్టీల సంక్షేమానికి మా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోంది. మైనార్టీలు కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా, నాయకులుగా, పారిశ్రామికవేత్తలుగా, ఉన్నత విద్యావంతులుగా ఎదగాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం' అని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. మైనార్టీ సంక్షేమానికి చరిత్రలోనే లేని విధంగా బడ్జెట్ కేటాయింపులు చేశామని.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మైనార్టీ సంక్షేమ శాఖకు సుమారు రూ.3,585 కోట్ల నిధులను కేటాయించినట్లు వెల్లడించారు. గతంతో పోలిస్తే మైనార్టీ సంక్షేమానికి కేటాయింపులను పెంచుతూ, విద్య, ఉపాధి, ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యమిస్తున్నట్లు వివరించారు.

విద్య ద్వారానే మైనార్టీల అభివృద్ధి సాధ్యమని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రటకించారు. 'ఏ ఒక్క మైనార్టీ విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదన్నది మా ప్రభుత్వ ఆలోచన. అందుకే మైనార్టీ విద్యార్థుల కోసం సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల ద్వారా నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకునేలా ప్రోత్సహిస్తున్నాం. పేద మైనార్టీ కుటుంబంలో పుట్టిన విద్యార్థి కూడా ఉన్నత చదువులు చదివి ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, ఇంజనీర్, శాస్త్రవేత్తగా ఎదగాలన్నదే మా ఆకాంక్ష' అని వెల్లడించారు. ఒక తరానికి విద్యను అందిస్తే ఆ కుటుంబం భవిష్యత్తు మారుతుంది. ఒక సమాజానికి విద్యను అందిస్తే, ఆ సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

మైనార్టీ మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. మహిళ సాధికారత అనేది కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన అంశం కాదని.. మొత్తం సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. మైనార్టీ యువతలో ఎంతో ప్రతిభ ఉందని.. వారికి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అర్హులైన యువతకు స్వయం ఉపాధి, సబ్సిడీ రుణాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు.

'హైదరాబాద్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం. హైదరాబాద్ అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న నగరం. ఐటీ, పారిశ్రామిక రంగం, విద్య, వైద్యం, వ్యాపారం, సాంస్కృతిక రంగాల్లో హైదరాబాద్ తనదైన ముద్ర వేసుకుంది' అని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గుర్తుచేశారు. ఈ అభివృద్ధిలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలకు చెందిన ప్రజల కృషి ఉందని ప్రకటించారు. జీ సలామ్‌ డెక్కన్ ఐకాన్స్ అవార్డులు – ప్రతిభకు గుర్తింపు, సమాజానికి స్ఫూర్తి అని అభివర్ణించారు.

'మా ప్రభుత్వానికి కులం, మతం, ప్రాంతం అనే భేదాలు లేవు. ప్రతి పేద కుటుంబానికి అండగా నిలవడం, ప్రతి యువకుడికి అవకాశం కల్పించడం, ప్రతి మహిళకు ఆర్థిక భరోసా ఇవ్వడం, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడం మా లక్ష్యం' అని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. మైనార్టీల అభివృద్ధి అంటే తెలంగాణ అభివృద్ధి.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి అంటే రాష్ట్ర అభ్యున్నతి అని ప్రకటించారు. 'అందరినీ కలుపుకొని, అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ, సంక్షేమం మరియు అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్లడమే మా ప్రజా ప్రభుత్వ విధానం. సబ్‌కా సాథ్ – సబ్‌కా వికాస్ అనే స్ఫూర్తితో సమానత్వం, సామరస్యం, సంక్షేమం, అభివృద్ధి దిశగా తెలంగాణను ముందుకు తీసుకెళ్దాం' అని ఉత్తమ్‌ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న జీ సలాం, జీ నెట్‌వర్క్ యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Hyderabad
Telangana News
Congress