Kakinada Accident: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు భవానీ భక్తుల దుర్మరణం..
Kathipudi Road accident: రోడ్డుదాటుతున్న భవానీ భక్తులను వేగంగా వచ్చిన స్కార్పియో ఢీకొనడంతో నలుగురు ఎగిరిపడ్డారు. ఈ క్రమంలో తీవ్ర రక్తస్రావం కావడంతో స్పాట్ లోనే మరణించారు.
Four bhavani devotees died in Kakinada: ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. విజయవాడకు బయలుదేరిన కొంత మంది భక్తులలో.. నలుగురు భవానీ భక్తులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ఘటన ప్రత్తిపాడు నియోజక వర్గం కత్తిపూడి వద్ద సంభవించింది. విజయనగరం జిల్లా డెంకాడ నుంచి సుమారు 40 మంది భవానీ భక్తులు విజయవాడ దుర్గమ్మతల్లిని దర్శించుకునేందుకు బయలుదేరారు.
మార్గమధ్యంలో కాకినాడ జిల్లా కత్తిపూడీ వద్ద బస్సులో సాంకేతిక సమస్య తలెత్తింది. బస్సు మొరాయిడంతో డ్రైవర్ బస్సును ఆపి రిపేర్ చేస్తున్నారు. ఇంతలో బస్సులో ఉన్న నలుగురు భవానీ భక్తులు రోడ్డును దాటుతుండగా వేగంగా వచ్చిన స్కార్పీయో వారిని ఢీకొనడంతో వారంతా ఎగిరి పడ్డారు. వారి తలకు బలమైన గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది.
ఈ క్రమంలో స్పాట్ లోనే నలుగురు చనిపోయారు. ఈ ఘటనతో ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానికులు పోలీసులకు, అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. మరోవైపు స్కార్పియో వాహనం సైతం పూర్తిగా ధ్వంసం అయింది. అతివేగమే నలుగురు భవాానీ భక్తుల ప్రాణాలు పోవడానికి కారణమైందని అక్కడి వారు చెబుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. డ్రైవర్ తాగి ఉన్నాడా లేదా నిద్రమత్తు వల్ల ప్రమాదం జరిగిందా..?.. అన్న కోణంలో విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.