SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

AP PRC Updates: పీఆర్సీ కమిషనర్‌ జీతం ఫిక్స్.. ప్రభుత్వం ఖరారు చేసిన నిబంధనలివే..!

AP PRC Commissioner Salary: 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) కమిషనర్‌గా నియమితులైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్‌కు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు చెల్లించే వేతనంతో పాటు డీఏ, HRA, లీవ్స్, వైద్య సదుపాయాలు, ప్రయాణ భత్యాలకు సంబంధించిన నిబంధనలను ఖరారు చేసింది.

Written By Ashok Krindinti
Published: Nov 24, 2026, 14:27 IST | Updated: Nov 24, 2026, 14:29 IST
Image Credit: AP 12th PRC (Source: AI Generated)
Join

AP PRC Commissioner Salary: ఆంధ్రప్రదేశ్ 12వ పీఆర్సీ కమిషనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్‌ నియమితులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన నియామక నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఖరారు చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) జీవో జారీ చేసింది. కమిషనర్‌గా ఆయనకు నెలకు రూ.2.25 లక్షల స్థిర వేతనం చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు మంజూరు చేసే డీఏ పొందేందుకు దినేష్ కుమార్ అర్హులని తెలిపింది. అయితే తిరిగి నియామకమైన కాలంలో ఆయన తన పెన్షన్‌పై డీఆర్ పొందడానికి అర్హత ఉండదని తెలిపింది. హెచ్‌ఆర్‌ఏ విషయంలో అపెక్స్ స్కేల్ (ఫిక్స్‌డ్ గ్రేడ్) అధికారులకు వర్తించే నిబంధనలే ఆయనకు వర్తిస్తాయని పేర్కొంది.

సెలవుల విషయంలోనూ అదే స్థాయి అధికారులకు వర్తించే నిబంధనలను అనుసరించనున్నారు. ఏపీ లీవ్ రూల్స్‌లోని నిబంధనలు, అవసరమైన సడలింపుల ప్రకారం సెలవులు మంజూరు చేస్తారు. వైద్య సదుపాయాలకు సంబంధించి 1954 నాటి ఆల్ ఇండియా సర్వీసెస్ మెడికల్ అటెండెన్స్ రూల్స్‌తో పాటు ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే మార్గదర్శకాలు వర్తిస్తాయి. 

అలాగే రాష్ట్రంలో.. రాష్ట్రం వెలుపల పర్యటనలకు వెళ్లినప్పుడు అపెక్స్ స్కేల్ అధికారులకు వర్తించే ఏపీ ట్రావెలింగ్ అలవెన్స్ నిబంధనల ప్రకారం ప్రయాణ, దినసరి భత్యాలు పొందేందుకు ఆయనకు అర్హత ఉంటుంది. ఈ ఉత్తర్వులకు ఆర్థిక శాఖ కూడా అంగీకారం తెలిపినట్లు ప్రభుత్వం వెల్లడించింది. గతంలో అక్టోబర్ 1న జారీ చేసిన జీవో ద్వారా దినేష్ కుమార్‌ను 12వ పీఆర్సీ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా ఆయన వేతనం, ఇతర సదుపాయాలు, నియామక నిబంధనలపై స్పష్టతనిచ్చింది.

ఏపీ ప్రభుత్వం 2023 జులై 12న 12వ పీఆర్సీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదట రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను కమిషనర్‌గా నియమించింది. అయితే ఆయన 2024లో రాజీనామా చేయడంతో ఈ ప్రక్రియలో జాప్యం ఏర్పడింది. అనంతరం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్‌ను 12వ పీఆర్సీ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఏడాదిలోగా నివేదిక సమర్పించాలని గడువు విధించింది.

ప్రస్తుతం దినేష్ కుమార్‌కు సంబంధించిన నియామక నిబంధనలు మాత్రమే ప్రభుత్వం ఖరారు చేసింది. ఉద్యోగులకు ఎంత ఫిట్‌మెంట్ ఇవ్వాలి..? కొత్త వేతనాలు ఎంత ఉండాలి..? ఎప్పటి నుంచి అమలు చేయాలనే అంశాలపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు. కమిషన్ నివేదిక, దానిపై ప్రభుత్వ నిర్ణయం వచ్చిన తర్వాతే ఈ వివరాలపై క్లారిటీ రానుంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES