SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Chandrababu: 'సర్పంచ్‌ ఎన్నికల'పై మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Chandrababu Key Orders To Ministers And TDP Leaders: పంచాయతీ ఎన్నికలపై మంత్రులు, టీడీపీ నాయకులపై సీం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయానికి అద్దం పట్టాయని.. పంచాయతీ ఎన్నికల్లోనూ అదే కొనసాగాలని ఆదేశించారు. ఏకగ్రీవాలకు ప్రయత్నించాలని సూచించారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 22, 2026, 14:33 IST | Updated: Nov 22, 2026, 14:39 IST
Image Credit: Source: Chandrababu X (Twitter)
Join

AP Sarpanch Elections: 'అన్ని ప్రాంతాల్లో ఏకపక్షంగా వచ్చిన ప్రజాభిప్రాయాన్ని గొడ్డలి పార్టీ (వైఎస్సార్‌సీపీ) జీర్ణించుకోలేకపోతోంది. అందుకే ఇప్పటికీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు' అని వైఎస్సార్‌సీపీపై సీఎం చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇదే స్ఫూర్తి కనిపించాలని.. ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ఓట్లుగా మలుచుకోవాలని సూచించారు. పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికల్లో ఇప్పటికే తీర్పు వచ్చిన నేపథ్యంలో పంచాయతీల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని సూచించారు.

తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, మంత్రులతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక ఎన్నికల ఫలితాలు, పంచాయతీ ఎన్నికలు, ఏకగ్రీవాలపై మంత్రులతో చర్చించారు. ఈ సందర్భంగా పంచాయతీల్లో ఏకగ్రీవాలపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామాభివృద్దికి ఉపయోగపడేలా పంచాయతీల్లో ఏకగ్రీవాలను పోత్సహించాలని ఆదేశించారు. ఏకగ్రీవాలకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 'స్థానిక ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయానికి అద్దం పట్టాయి. మునిసిపల్ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం రెండున్నరేళ్ల పాలనకు దక్కిన గుర్తింపు. కూటమితోనే ప్రజలు ఉన్నారు. స్థానిక ఎన్నికల ఫలితాలు కూటమి పాలనకు దక్కిన ఆమోదం' అని తెలిపారు. పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చారని.. కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల నమ్మకాన్ని చాటిందని చెప్పారు.

పార్టీల పోరు ముగిసిందని.. గ్రామాల అభివృద్దిపై జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన నజరానాల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. 5 వేల లోపు జనాభా ఉంటే రూ.15 లక్షలు, 5-10 వేల మధ్య జనాభా ఉంటే రూ.25 లక్షలు,10 వేలు పైన జనాభా ఉంటే రూ.50 లక్షలు ఇచ్చే విషయాన్ని ప్రచారం చేయాలని మంత్రులు, టీడీపీ నాయకులకు చెప్పారు. 'గతంలో కనిష్టంగా రూ.5 లక్షలుగా ఉన్న నజరానాను ఇప్పుడు రూ.15 లక్షలు చేశారు.    గతంలో గరిష్టంగా రూ.20 లక్షలు ఉన్న ఏకగ్రీవాల బహుమానాన్ని రూ.50 లక్షలకు పెంచాం' అని వివరించారు.

'పంచాయతీలు వేరు, జడ్పీ ఎన్నికలు వేరు. పార్టీ గుర్తు లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను కూటమి ప్రోత్సహించాలి. గ్రామాల్లో అందరి ఆమోదంతో ఏకగ్రీవాలు జరిగితే వచ్చే నిధులతో గ్రామాల్లో అభివృద్ది పనులు చేసుకోవచ్చు' అని సీఎం చంద్రబాబు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీపై గ్రామస్థాయి నాయకులు చాలా పట్టుదలగా ఉంటారని పేర్కొన్నారు. 'టీడీపీలో కూడా పోటీ పడతారు. అలాంటి వారితో మాట్లాడాలి. పార్టీలో నాయకుల మధ్య పంతాలు, ఈగోలు కాదు. ఐక్యత కనిపించాలి' అని దిశానిర్దేశం చేశారు. 'ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోని గ్రామాల్లో నేతలతో సంప్రదింపులు చేయండి. జెడ్పీ ఎన్నికల ఫలితాలతో వైఎస్సార్‌సీపీ ఎలాగూ పోటీకి ఆసక్తిగా లేదు. ఒకే పార్టీలో ఉన్న వాళ్లు రెండు వర్గాలుగా పోటీ చేసే పరిస్థితి రాకూడదు' అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ZEENEWS TRENDING STORIES