Srisailam Railway Line: మల్లన్న భక్తులకు గుడ్‌న్యూస్..శ్రీశైలానికి త్వరలోనే రైలు మార్గం..ఏపీకి కొత్త 3 రైల్వే లైన్లు!
Srisailam Railway Line In AP: ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే కనెక్టివిటీని విస్తరించేందుకు మూడు కొత్త రైలు మార్గాల ప్రతిపాదనలు రైల్వే బోర్డు పరిశీలనకు చేరాయి. మార్కాపురం - శ్రీశైలం - సికింద్రాబాద్, రాజంపేట - నెల్లూరు, సామర్లకోట - చింతూరు మార్గాల్లో కొత్త లైన్లు నిర్మించాలని అధికారులు సూచించారు. వీటికి ఆమోదం లభిస్తే శ్రీశైలం యాత్రికులకు రైలు ప్రయాణ సౌకర్యం పెరగడంతో పాటు, వెనుకబడిన ప్రాంతాలకు రవాణా, పర్యాటక అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉంది.
Srisailam Railway Line In AP: ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రయాణ సౌకర్యాలను మరింత విస్తరించే దిశగా కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. రాష్ట్రంలోని రైలు కనెక్టివిటీ తక్కువగా ఉన్న ప్రాంతాలకు కొత్త మార్గాలను అందించడంతో పాటు, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, జిల్లాల మధ్య ప్రయాణాన్ని సులభతరం చేయాలనే లక్ష్యంతో మూడు కీలక రైల్వే లైన్ల నిర్మాణానికి దక్షిణ కోస్తా రైల్వే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలు ప్రస్తుతం రైల్వే బోర్డు పరిశీలనలో ఉన్నాయి.
ప్రధానంగా మార్కాపురం నుంచి శ్రీశైలం మీదుగా సికింద్రాబాద్ వరకు సుమారు 290 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మించాలనే ఆలోచన ఉంది. ప్రస్తుతం శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి ఆలయానికి నేరుగా రైలు సౌకర్యం లేదు. ఈ కొత్త మార్గం కార్యరూపం దాలిస్తే హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు రైలులో శ్రీశైలానికి చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. రోడ్డు ప్రయాణంపై ఆధారపడే యాత్రికులకు ఇది ఎంతో ఉపయుక్తంగా మారవచ్చు.
మరో ప్రతిపాదన రాజంపేట నుంచి నెల్లూరు మధ్య సుమారు 120 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించినది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యం లభించడంతో పాటు ప్రస్తుతం ఇతర మార్గాల ద్వారా వెళ్లాల్సిన అవసరం తగ్గే అవకాశం ఉంది. అలాగే సామర్లకోట నుంచి జగ్గంపేట, రంపచోడవరం, మారేడుమిల్లి మీదుగా చింతూరు సమీప ప్రాంతానికి సుమారు 150 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది.
ఏజెన్సీ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు పెరిగితే స్థానిక ప్రజలకు ప్రయాణం సులభమవుతుంది. వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర సరుకుల రవాణాకు మెరుగైన అవకాశాలు లభించవచ్చు. ఈ మూడు ప్రతిపాదనలకు రైల్వే బోర్డు ఆమోదం లభిస్తే తదుపరి సర్వేలు, డీపీఆర్ తయారీ, ప్రాజెక్టు సాధ్యాసాధ్యాల పరిశీలన వంటి ప్రక్రియలు ముందుకు సాగనున్నాయి. రైల్వే మార్గాల విస్తరణతో పర్యాటకం, వాణిజ్యం, ప్రాంతీయ అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడే ఆశలు కనిపిస్తున్నాయి.