Subsidy Onions: కూరగాయల ధరలే మండిపోతుంటే ఇక ఉల్లిపాయలు రెక్కలొచ్చినట్టు అందనంత స్థాయికి ధరలు పెరిగిపోతున్నాయి. ధరలన్నీ పెరిగిపోతుండడంతో సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితి ఎదురైంది. ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు. ముఖ్యంగా ఉల్లిపాయలు కిచెన్‌లో ఘాటు ఎక్కిస్తున్నారు. పాతిక రూపాయలు ఉండే ఉల్లిపాయ ఇప్పుడు కిలో రూ.వందకు చేరుతోంది. దీంతో ప్రజలు ఉల్లిపాయలను కిచెన్‌లోకి బంద్ పెట్టారు. ఉల్లిపాయ ధరలతో సతమతమవుతున్న ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. అధిక ధరలతో బాధపడుతున్న వారికి ఊరటనిస్తూ ఏపీ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. రూ.35కే కిలో ఉల్లిపాయలను అందించనుంది. ఈ కార్యక్రమం రేపటి నుంచే ఏపీలో ప్రారంభం కానుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉల్లిపాయలు ధరలు మండిపడుతుండడంతో ప్రజలకు ఊరట కలిగించేలా ఏపీ ప్రభుత్వం తక్కువ ధరకు ఉల్లిపాయలు అందించనుంది. రేపటి నుంచి రైతు బజార్లలో కిలో ఉల్లిపాయలు రూ.35కే విక్రయించాలని నిర్ణయించింది. ధరల స్థిరీకరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తొలి దశలో విజయవాడలోని అన్ని రైతు బజార్లలో సబ్సిడీ ధరకు ఉల్లిపాయలు ప్రభుత్వం అందించనుంది. ఆధార్/రేషన్ కార్డు ఆధారంగా ప్రతి కుటుంబానికి నెలకు రెండు కిలోల ఉల్లిపాయలు సబ్సిడీపై ప్రభుత్వం అందించేందుకు సిద్ధమైంది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఏపీ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ సూచించారు.
ఉల్లిపాయల ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కిలో ఉల్లిపాయలు రూ.35కే విక్రయించాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంది. ధరల పెరుగుదలను అదుపు చేసే చర్యల్లో భాగంగా మంత్రుల ఉప సంఘం (సబ్ కమిటీ) సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోగా రేపటి నుంచి అమల్లోకి రానుంది.
కేంద్ర ప్రభుత్వంలోని ఎన్‌సీసీఎఫ్ సంస్థ సహకారంతో ఉల్లిపాయలు కిలో రూ.35కే అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసింది. సబ్సిడీతో కూడిన ఉల్లిపాయ ధరలు రైతుబజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా అందించనున్నారు. బియ్యం, పప్పు, నూనె ధరలపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రాయితీలు అందిస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 350కి పైగా ప్రత్యేక బియ్యం కౌంటర్లతో తక్కువ ధరకు బియ్యాన్ని అందిస్తుండగా.. పామాయిల్, కందిపప్పు ధరలను కూడా మార్కెట్ ధరపై రూ.10 చొప్పున తగ్గించి విక్రయించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.